Obstacles
-
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్‌ను పంపించనున్నట్లు తెలిపారు. సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు. -
అవరోధాన్ని ఏనుగులా దాటండి.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..
ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ తన ఫాలోవర్స్‌ను ఆలోచింపజేస్తూనే ఉంటారు. స్పూర్తిదాయకమైన పోస్టులతో తన అనుచరులను ఆలోచింపజేస్తుంటారు. వ్యాపారలావాదేవీలతో బీజీగా గడుపుతున్నప్పటికీ ఏదో ఒక విధంగా మంచి పోస్టులతో నెటిజన్లను మేల్కొలుపుతారు. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏనుగును చూసి ప్రతికూలతలను అధిగమించడం ఎలాగో నేర్చుకోండి అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ ఏనుగు కంచెను దాటుతుంది. ఫెన్సింగ్‌ను దాటడానికి అది అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం అంటూ ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆ ఏనుగు ఫెన్సింగ్ చాల చాకచక్యంగా దాటుతుంది. కంచెను కూలదోయడానికి అది అనసరించిన విధానం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. ఫెన్సింగ్ బలంగా ఎక్కడుందో చూస్తుంది. బలహీనంగా ఎక్కడ ఉందో కూడా చెక్ చేసుకుంటుంది. అనంతరం ఫెన్సింగ్ వీక్‌గా ఉన్న ప్రదేశంలో కాలుతో కూలదోసి దర్జాగా వెళ్లిపోతుంది. A masterclass from a pachyderm on how to overcome obstacles: 1) Carefully test how strong the challenge really is & where it might have least resistance. 2) Slowly apply pressure at the point of greatest leverage of your own strength. 3) Walk confidently through… 😊 pic.twitter.com/SmYm8iRWKH — anand mahindra (@anandmahindra) August 4, 2023 ఈ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ప్రతికూలతను దాటడానికి ముందు అది ఏ స్థాయిలో బలాన్ని కలిగి ఉందో ఏనుగులాగే చెక్ చేసుకోవాలి. అనంతరం బలాన్ని, బలహీనతల్ని గుర్తించాలి. సరైన బలంతో తక్కువ ప్రతికూలత ఉన్న ప్రదేశం నుంచి పనిచేయడం ప్రారంభించాలి. అనంతరం ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లాలి అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే లక్షా ఇరవై నాలుగు వేల మంది వ్యూస్ వచ్చాయి. only legends like anand mahindra derive lessons from all walks of life 🙂 do you agree? (as always thank you sir for taking the time to share 🙏) — Swaroop D (@swaroopspaces) August 4, 2023 ఇదీ చదవండి: Viral Video: ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా.. -
Patenting: ప్రకృతికి పేటెంట్ తీసుకోవచ్చా!!!
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ. మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు. భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం. ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు. నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విజయానికి తొలిమెట్టు అవగాహన
అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి. పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!! ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!! –వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
సాగరం చుట్టిన వనితలు
ఎగిసిపడే అలల్ని చూసి జడిసిపోలేదు. పెనుగాలులకు చిగురుటాకైన నావను చూసి వణికిపోలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 200 రోజులకు పైగా సాగిన సాగర యాత్ర... సగర్వంగా ప్రపంచ రికార్డులకెక్కింది. భారతీయ వనితల సత్తాను చాటింది. పెద్ద తుఫాన్, చల్లని ఈదురుగాలులు, ఎముకలు కొరికే చలి.... ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించే వరకు పట్టువీడలేదు. రెండు మహా సముద్రాల మీదుగా లక్ష్యాన్ని చేరుకున్నారు. భారతీయ మహిళా నావికుల సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ఇండియన్ నేవీ 2017 సెప్టెంబర్ 10న ‘నావికా సాగర్ పరిక్రమ’ పేరుతో యాత్రను ప్రారంభించింది. ఇందుకోసమని దేశవ్యాప్తంగా ఉన్న నేవీ విభాగాల నుంచి మెరికల్లాంటి ఆరుగురు మహిళా కెప్టెన్లను నియమించింది. వీరిలో విశాఖపట్టణానికి చెందిన స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన బొడ్డపాటి ఐశ్వర్యలు ఉన్నారు. యాత్ర ఎలా జరిగింది, ఇబ్బందులు ఎలా ఎదురైయ్యాయి, ఆనంద క్షణాలు ఏంటి అనే విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు విశాఖపట్టణానికి చెందిన స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన నేవీ లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డుపల్లిలు. 2015లోనే కార్యచరణ ‘నావికా సాగర్ పరిక్రమ’ కోసం 2015లోనే కార్యచరణను ప్రారంభించారు నేవీ అధికారులు. ఇండియన్ బోటు ద్వారా సుదీర్ఘదూరం సముద్రంలో యాత్ర చేయాలనేది నేవీ రిటైర్డ్ వైస్ అడ్మిరల్ మనోహర్ కల. ఆ కలను సాకారం చేసేందుకు ఇండియన్ నేవీ సీలింగ్ వెజిల్ని తయారు చేసింది. కెప్టెన్ దిలిప్ డోండే సారధ్యంలో టీమ్ ఏర్పాటైంది. ఇందులో వైజాగ్‌కు చెందిన నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్ ఆఫీసర్ స్వాతి పాతర్లపల్లి, హైదరాబాద్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డుపల్లి, వర్తికా జోషి (రిషికేష్), ప్రతిభా జాంబ్వాల్ (హిమాచల్ ప్రదేశ్), విజయదేవి (మణిపూర్), పాయల్ గుప్తా (డెహ్రడూన్)లు ఎంపికయ్యారు. వీరికి ‘నావికా సాగర్ పరిక్రమ’ చేపట్టే ఏడాది ముందు నుంచే ట్రైనింగ్‌ను ఇచ్చారు. ట్రయల్ ట్రిప్‌గా 2016 మేలో గోవా నుంచి మారిషస్‌కి వీరిచే ఒక మినీ యాత్రను నిర్వహించారు. సుమారు 8 వారాల పాటు సాగిన ఈ ట్రైనింగ్ యాత్రలో ఎదురైన ఒడిదుడుకులను వీరు ఎదిరించారు. మార్గమధ్యలో బోటు రిపేర్ అయితే వారంతటికి వారే రిపేర్ చేసుకోవడం, పెద్ద పెద్ద అలలు తాకినప్పుడు ధైర్యంగా నిలవడాన్ని చూసిన భారత నేవీ అధికారులు ‘నావిక సాగర్ పరిక్రమ’ యాత్ర చేపట్టేందుకు పూర్తి అనుమతి ఇచ్చారు. సముద్రంలో 199 రోజులు 2017 సెప్టెంబర్ 10న గోవా నుంచి ‘తరుణి’ బోటులో ‘నావికా సాగర్ పరిక్రమ’ మొదలైంది. ఇది 254 రోజులు సాగింది. రెండు మహాసముద్రాలు పసిఫిక్, అట్లాంటిక్ మీదుగా సుమారు 21,600 కి.మీ. ప్రయాణించారు. సముద్రం మీద వీరు రోజులు 199 రోజులు ఉంటే, 55 రోజులు వివిధ దేశాల్లో మన దేశ కార్యక్రమాలైన మహిళా సాధికారిత, మేక్ ఇన్ ఇండియా, మానిటరింగ్ మెరీన్ పొల్యూషన్, మానిటిరింగ్ వెదర్ అండ్ గివింగ్ వంటి వాటిపై అవగాహాన కల్పించారు. ఆయా దేశాల్లో అక్కడి స్త్రీలతో మమేకమై వీరి యాత్రా విశేషాలను పంచుకున్నారు. విపత్కర పరిస్థితులను ఎదురించిన స్వాతి వైజాగ్‌కు చెందిన స్వాతి పాతర్లపల్లి నేవీలో నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఈ యాత్రలో కమ్యునికేషన్ అండ్ నేవిగేటింగ్ చూసుకునే బాధ్యత స్వాతిదే. రోడ్డు మార్గంలో ఏదైనా యాత్ర చేస్తున్నప్పుడు కమ్యునికేషన్‌కు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి బాధ్యత వహిస్తున్న వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అటువంటిది సముద్రం లోపల నేవిగేటింగ్ అండ్ కమ్యునికేషన్‌ను కంట్రోల్ చేయడం అంత సులువైంది కాదనే చెప్పాలి. ‘రెండు పర్యాయాలు తుఫాన్ వచ్చినప్పుడు నెట్వర్క్ పూర్తిగా కటై్టంది. నేవిగేషన్ ఎటు చూపిస్తోందో అర్థం కాలేదు. రెండు గంటల పాటు అవతలి దేశం వారికి కమ్యునికేషన్ కనెక్ట్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో మా బోటును తాకిన అలలను చూస్తే అందరం భయపడాల్సి వచ్చింది’ అని స్వాతి చెప్పారు. వాలంటీర్‌గా ఐశ్వర్య కలలు సాకారం చేసుకుంది హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్య బొడ్డుపల్లి ఈ యాత్రలో కీలకంగా వ్యవహిరించారు. ఐదుగురు లెఫ్ట్నెంట్లతో పాటు ఐశ్వర్య వాలంటీర్‌గా ఉన్నారు. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి సముద్రంలో బోటు యాత్ర చేయాలనేది కల. ఆ కల ఇండియన్ నేవీ ద్వారా అదీ తాను లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఉన్న సమయంలో జరగడం ఐశ్వర్యకు ఆనందాన్ని ఇస్తోంది. ఈ యాత్రలో స్వాతి, పాయల్ గుప్తా, వర్తికా జోషి, విజయదేవిలకు చేదోడుగా ఉంటూ, కీలక సమయాల్లో వాలంటీర్ సేవలను తను అందించడం జరిగింది. ప్రపంచ రికార్డులో భాగస్వామి కావడం పట్ల ఐశ్వర్య పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. పదిరోజులు మ్యాగీ, 14 రోజులు వర్షపునీరు ‘మేం యాత్ర ప్రారంభించిన కొద్దిరోజులకే సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో మేము తెచ్చుకున్న నిత్యవసర సరుకులన్నీ తడిసిపోయి తినడానికి వీలు లేకుండా పోయాయి. పదిరోజుల పాటు మా వెంట తెచ్చుకున్న మ్యాగీని చేసుకుని ఆకలిని తీర్చుకున్నాం’ అని ఐశ్వర్య బొడ్డుపల్లి వివరించారు. ‘బోటులో ఉన్న ఆర్వోప్లాంట్ పాడైంది. దీంతో మంచినీళ్లు లేక ఎన్నో తిప్పలు పడ్డాము. వర్షపునీటిని పట్టుకుని కాచి చల్లార్చుకుని దాహం తీర్చుకున్నాం’ అని చెప్పారు. రాత్రంతా చలిలోనే.. ‘ఫసిఫిక్ మహాసముద్రం దాటిన తరువాత పెద్ద పెద్ద అలలు వ్యాపించాయి. వాతావరణం చాలా చల్లగా అయిపోయింది. అలలు క్రాష్ అయ్యాయి. ఆ సమయంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్ పాయల్‌గుప్తా తలకు బలమైన గాయం అయ్యింది’ అని ఐశ్వర్య చెప్పారు. ‘బోటు ముఖద్వారం వద్ద రెండు పెద్ద తెరచాపలు ఉన్నాయి. వీపరీతమైన గాలి, వర్షం కారణంగా ఆ రెండు తెరచాపలు తెగిపడ్డాయి. దీంతో చల్లని గాలి బోటు లోపలకి రావడంతో రాత్రంతా నిద్ర మానుకుని చలిలోనే గడపాల్సి వచ్చింది’ అని స్వాతి గుర్తు చేశారు. స్వీట్ మెమోరీస్.. ‘అట్లాంటిక్ మహా సముద్రం దాటుతుండగా జనవరి 7న భారీ తుఫాన్ వచ్చింది. బోటు విపరీతంగా కిందకు పైకి ఊగడంతో మునిగిపోతుందనే భయపడ్డాం. కాని అదృష్టం బాగుండి అలా జరగలేదు. ఆ∙తెల్లారి అంటే జనవరి 8న తేదీన అలలు నెమ్మదిగా, చక్కగా వస్తున్నాయి. ఆ సమయంలో రెయిన్బో ఆ అలలపై పడటం, డాల్ఫిన్స్ మా బోటు వద్దకు రావడం చాలా సంతోషమనిపించింది. ఇవి మా ఆరుగురికీ జీవితాంతం గుర్తుండే స్వీట్ మెమోరీస్’ అన్నారు ఐశ్వర్య. మారిషస్ వద్ద స్టీరింగ్ ఫెయిల్ ‘కేప్‌టౌన్ నుంచి గోవా వస్తున్నప్పుడు మారిషస్ వద్ద స్టీరింగ్ ఫెయిల్ అయ్యింది. ఇదే సమయంలో ‘ఫకీర్’ అనే తుఫాన్ కూడా వచ్చింది. చాలా ఆందోళన చెందాము. తిరిగి గోవాకు చేరేదట్లా అంటూ అందరం మానసికంగా వేదనపడ్డాం. ఆరుగురం కలసి అత్యంత కష్టం మీద ఆ బోటును రిపేర్ చేసుకుని యాత్రను విజయవంతం చేశాం’ స్వాతి, ఐశ్వర్యలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నుంచి కితాబు యాత్రను విజయవంతం చేసుకుని ప్రపంచ రికార్డును నెలకొల్పిన సందర్భంగా భారత ప్రధాని రామ్‌నాథ్ కోవింద్ ఈ నారీమణులను గురువారం సత్కరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో స్వాతి పాతర్లపూడి, ఐశ్వర్య బొడ్డుపల్లి, పాయల్ గుప్తా, ప్రతిభా జంబ్వాల్, వర్తికా జోషి, విజయదేవిలు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. యాత్రను విజయవంతం చేసుకుని భారత్‌కు తిరిగొచ్చి యావత్ప్రపంచానికి మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పడం పట్ల రాష్ట్రపతి వీరిని కొనియాడారు. గర్వంగా ఉంది మా అమ్మాయి ఐశ్వర్యని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేవీలోకి వెళ్లేముందు చాలా మంది ఎందుకు పంపిస్తున్నారన్నారు. అయినా మేం లెక్కచెయ్యలేదు. తన ఇష్టానికి ప్రాధాన్యతను ఇచ్చి ప్రొత్సహించాం. ఈ యాత్ర మొదట్లో అందరూ ఆడపిల్లలే... ధైర్యంగా ఉండగలరా అని టెన్షన్ పడ్డాం. మధ్య మధ్య ఫోన్ చేసి తను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో సంతృప్తి చెందాం. బోటు రిపేర్ అయిన విషయాన్ని చెప్పినప్పుడు తిరిగి ఇంటికి వస్తారా..రారా అంటూ ఆందోళన చెందాము. కాని ఇవాళ యాత్ర విజయవంతం కావడంలో మా అమ్మాయి పాత్ర కూడా ఉండటం గర్వంగా ఉంది. ఆడపిల్లలను ఇంటికే పరిమితం చెయ్యకుండా వారికి నచ్చిన రంగంలో అవకాశాన్ని కల్పిస్తే వారు ఏదైనా సాధిస్తారు. – సాయిప్రభాకర్, సత్యవాణ(ఐశ్వర్య తల్లిదండ్రులు) తిండితిప్పలు మానేశాం ‘నావికా సాగర్ పరిక్రమ’ యాత్రలో రెండు సార్లు తుఫాన్ వచ్చిన విషయం మాకు చెప్పలేదు. తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నాం. ప్రతి రెండు రోజులకోసారి ఫోన్ చేసి మమ్మల్ని పలకరించేది. మేము కూడా ఆరుగురి యోగక్షేమాలు తెలుకునే వాళ్లం. యాత్ర విజయవంతం అయ్యి తిరిగొచ్చాక నా కూతురు ఏదైనా సాధిస్తుందనే నమ్మకం మాలో దృడంగా కలిగింది. ఆడపిల్లలకే ప్రతి తల్లిదండ్రులు ప్రాధాన్యతను ఇవ్వాలి. మేము మా అమ్మాయి టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించాం, ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. – పాతర్లపల్లి రాణి, ఆదినారాయణ (స్వాతి తల్లిదండ్రులు) – చైతన్య వంపుగాని, సాక్షి ప్రతినిధి -
అడ్డంకులు ఎదురైనా జనగర్జన నిర్వహిస్తాం
∙జనగామ జిల్లా కోసం నేడు అన్ని గ్రామాల్లో డప్పుచాటింపు ∙సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించాం ∙21న 50వేల అభ్యంతరాలను కలెక్టర్‌కు అప్పగిస్తాం దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఈ నెల 20న తలపెట్టిన జనగర్జన సభకు ఎన్ని అడ్డం కులు ఎదురైనా నిర్వహించి తీరుతామని జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. స్థానిక జూబ్లీఫంక్ష¯ŒS హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఆముదాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, బెడిదె మైసయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. శాంతియుతంగా జరుపుకునే సభకు అనుమతి లేదనడం హాస్యాస్పదమన్నారు. డివిజ¯ŒSలోని 16 మండలాల నుంచి లక్షకు పైగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభ నిర్వహణ కోసం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. నేడు అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు చేయాలని పిలుపునిచ్చారు.19న ఇంటింటికి బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతామన్నారు. పట్టణంలో వార్డుల వారీగా కమిటీలు వేసి, వందశాతం ప్రజలు సభకు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆయా రాజకీయ పార్టీలు, అనుబంధ సంస్థలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి, సభకు వచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానాలు సైతం చేస్తున్నారన్నారు. సభ విజయవంతానికి పట్టణం నుంచి చేర్యాల, పాలకుర్తి నియోజకవర్గాల వైపు వెళ్లిన బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందన్నారు. సిద్దిపేట జిల్లాపై వస్తున్న అభ్యంతరాల వివరాలు రాత్రికి రాత్రే మార్చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు 50 వేల అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా అందజేస్తామని చెప్పారు. ఆ¯ŒSలై¯ŒS, రాతపూర్వకంగా లక్ష అభ్యంతరాలను ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు పజ్జూరి గోపయ్య, ఆకుల వేణుగోపాల్‌రావు, మాశెట్టి వెంకన్న, ఆలేటి సిద్దిరాములు, బూడిద గోపి, నక్కల యాదవరెడ్డి, మంగళ్లపల్లి రాజు, మోకు కనకారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, మాజీద్, పిట్టల సురేష్, నవీ¯ŒS, నర్సింహులు, యాదగిఇర, మల్లేష్ తదితరులు ఉన్నారు. వినూత్న నిరసన ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, జనగామను జిల్లా చేయాలని కోరుతూ ఓ యువకుడు శనివారం వినూత్నంగా నిరసన తెలిపాడు. పట్టణానికి చెందిన గండి నాగరాజు జనగామ జిల్లా కోసం జరుగుతున్న కట్రలను నిరసిస్తూ ఒంటి నిండా నల్లరంగుతో నిరసన తెలుపుతూ, అధికారికంగా విమోచనం కోసం జాతీయ జెండాతో పాటు బీజేపీ బ్యానర్ పట్టుకుని పట్టణంలోని పలు వార్డులో పర్యటించాడు. -
భవిష్యం(28-08-2016)
టారో 28 ఆగస్టు నుంచి 3సెప్టెంబర్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) చిన్న చిన్న అవరోధాలు ఉన్నా, వ్యాపారాలు పుంజుకుంటాయి. కష్టాన్ని నమ్ముకుని ఫలితాలను సాధిస్తారు. చిరకాలంగా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్తగా వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటారు. భవిష్యత్ అవసరాల కోసం, ఆర్థిక భద్రత కోసం మరింత సంపదను కూడబెట్టాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెడతారు. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కొత్తగా ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిలోనే మార్పులు చేపట్టడం వంటి పనులకు శ్రీకారం చుడతారు. త్వరగా పనులు పూర్తి కావాలనే ఆతృతతో ఇతరులపై కోపతాపాలకు గురవుతారు. సురక్షితంగా ఆశించిన గమ్యానికి చేరాలంటే నిదానమే ప్రధానమనే మాటను గుర్తుంచుకోవడం మేలు. లక్ష్య సాధన కోసం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. లక్కీ కలర్: నీలం మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. ఊహించని కొన్ని సంఘటనలు ఆశ్చర్యంలో పడేస్తాయి. బాధ్యతలను గుర్తించి పనిచేస్తే జీవితం సుఖమయంగా మారుతుందని గ్రహిస్తారు. భావసారూప్యత గల వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి. మరింత స్పష్టత కోసం, ఆశించిన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం అవసరమైన సమాచార సేకరణ దిశగా కృషి చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) దివ్యమైన స్ఫూర్తితో, వివేకంతో తలచిన పనులను పూర్తి చేస్తారు. సంధి దశలో ఉన్న మీరు వాస్తవిక దృక్పథాన్ని అలవరచుకుంటారు. పని ఒత్తిడిని తగ్గించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవడం మేలు. భవిష్యత్తును నిర్మించుకునే కీలక దశ ఇది. పాత గాయాలను మరచి, ప్రేమ సంబంధాలలో శాంతి సామరస్యాలకు చొరవ తీసుకుంటారు. లక్కీ కలర్: ఇటుక రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సవాలుగా స్వీకరిస్తారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ సూత్రాన్ని పాటించండి. మీ ప్రవర్తనలో ఏదీ అతి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. లక్కీ కలర్: మట్టి రంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) కోరుకున్నవి అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దు. అడిగినవి తప్పకుండా పొందగలరు. అనవసరపు ఆందోళనలను, మానసిక అలజడిని అదుపు చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. శక్తులన్నీ కోల్పోయినట్లు నిస్తేజంగా మారుతారు. ఈ పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ద్వారా ఊరట పొందగలరు. లక్కీ కలర్: వెండి రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మార్పు కోసం ఎదురు చూస్తున్న మీకు కెరీర్లో అద్భుతమైన అవకాశం అందివస్తుంది. భవిష్యత్తుపై ఊహా లోకాల్లో తేలిపోతూ కాలం గడిపేయడం మంచిది కాదని గుర్తిస్తారు. వర్తమానమే భవిష్యత్తుకు పునాది అని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. కాస్త ఉత్సాహం, ఉత్తేజం కోరుకుని విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ప్రేమ వ్యవహారాల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అవివాహితులకు పెళ్లిళ్లు కుదిరే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. మీ ఆకర్షణ శక్తి కారణంగా బంధు మిత్రులందరూ మీ చుట్టూ చేరతారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అందివచ్చిన అవకాశాలను గరిష్టస్థాయిలో ఉపయోగించుకుంటారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వచ్చిన లాభాల కంటే చేసే పని మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అనాయాసంగానే పెద్దపెద్ద పనులను అవలీలగా పూర్తిచేస్తారు. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితం సుఖమయంగా సాగుతుంది. లక్కీ కలర్: లేత నారింజ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) పరిస్థితులు అనివార్యంగా అదుపు తప్పుతాయి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం క్షేమం. ఆత్మనియంత్రణ ఆత్మ గౌరవానికి భంగకరం కాదని తెలుసుకుంటారు. ఒంటరిగా గడుపుతారు. అపార్థాలకు గురవు తారు. అందరూ మిమ్మల్ని తిరస్కరిస్తున్న ట్లుగా భావించి బాధపడతారు. ఒక పరిచిత వ్యక్తి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురవుతారు. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) జీవితంలో పెద్దగా ప్రత్యామ్నాయాలు ఉండవని గ్రహిస్తారు. ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. తీరిక సమయాన్ని ఆత్మావలోకనం కోసం వినియోగించుకుంటారు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొనడం కొంత ఊరటనిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి భావసారూప్యం గల భాగస్వామి తారసపడతారు. నూతనోత్తేజం పొందడానికి ఒంటరిగా దూరప్రయాణాలకు వెళతారు. లక్కీ కలర్: ఊదా మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వృత్తి వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీల్లో వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ స్వీకరించి అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. మనసుకు నచ్చిన తోడు దొరుకుతుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో డోలాయమాన పరిస్థితుల్లో ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడతారు. లక్కీ కలర్: ముదురు పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
ప్ర'గతులు'
- ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు - వేలాదిగా పింఛన్‌దారుల తొలగింపుపై విమర్శలు - కొండపిలో ‘జన్మభూమి -మా ఊరు’ లాంఛన ప్రారంభం నేడు శంకర్రావు వయస్సు 70 ఏళ్లు. రేషన్ కార్డులో తక్కువ వయస్సు నమోదైందని అతను ప్రభుత్వ పింఛన్ తీసుకోవడానికి అనర్హుడట. వయస్సు ధ్రువీకరణకు వైద్యుల దగ్గరకెళితే..మేమెలా నిర్ధారిస్తామని చెప్పి పంపారు. గత నాలుగేళ్లుగా ఠంచనుగా పింఛన్ పొందినా ప్రస్తుత సర్కారు వేసిన అనర్హత వేటుతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. శ్రీనివాసరావు ‘సదరమ్’ శిబిరంలో వికలాంగుడిగా అన్ని పరీక్షలు చేయించుకుని నాలుగేళ్లుగా ధ్రువీకరణ పత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. సర్వే అధికారులు వచ్చినప్పుడు వికలాంగ ధ్రువీకరణ పత్రం లేదంటూ అతన్ని ప్రభుత్వ పింఛన్పొందేందుకు అనర్హుడిగా ప్రకటించారు. సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేక అతను ఆశలొదిలేసుకున్నాడు. సావిత్రమ్మ భర్త చనిపోయి ఏళ్లు గడిచాయి. అప్పట్లో తహశీల్దార్, గ్రామసర్పంచి పంచనామా జరిపి మరణ ధ్రువీకరణ పత్ర మిచ్చారు. ఇప్పుడేమో అది పనికిరాదంటూ ... వితంతు పింఛన్ తీసుకోవడానికి అనర్హురాలిగా సావిత్రమ్మ పేరును జాబితాలో నుంచి తొలగించారు. కొత్తగా ఆర్డీవో కార్యాలయం ద్వారా ధ్రువీకరణ తెచ్చుకోవాలట. ఇప్పటికప్పుడు సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే, ఖర్చు రూ.వేలల్లో భరించాల్సి రావడంతో ఆర్థికస్థోమత లేని ఆమె మౌనంగా ఉంది. సాక్షి, ఒంగోలు: గాంధీ జయంతి రోజునే ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల సర్వే పూర్తయింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.500 తీసుకునే పింఛన్‌దారులు ఇకనుంచి నెలనెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు అర్హతను బట్టి లబ్ధిపొందనున్నారు. ఇందుకోసం గత కొద్దిరోజులుగా జిల్లాలో అధికారులు, ప్రత్యేకంగా నియమించిన సర్వే కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హుల పేర్లను తొలగించి.. అర్హుల జాబితాను తయారు చేశాయి. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత తదితర పింఛన్లు పొందుతున్న వారు ఇప్పటివరకు 3.12 లక్షల మంది ఉన్నారు. వీరిలో 34 వేల మందికిపైగా పేర్లను అనర్హుల జాబితాలోకి చేర్చారు. మరో రెండు వేల మంది ధ్రువపత్రాలకు సంబంధించి పరిశీలన ప్ర‘గతులు' కొనసాగుతోంది. కమిటీల్లో అధికారపార్టీ నేతలుండటంతో ఇష్టానుసారంగా అర్హులను తొలగించి.. తమ కార్యకర్తలు, అనుచరులకు లబ్ధిచేకూర్చడానికే పనిచేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగించిన జాబితాలో సుమారు 20 వేల మందికిపైగా పింఛన్‌దారులకు ఆధార్కార్డుల్లేవని తొలగించగా, మరికొందరికి వయస్సు తక్కువని, కొందరు వితంతువులు, వికలాంగులు కాదని, చేనేత కార్మికులే కాదంటూ తమకు నచ్చని పేర్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిధిలోని అత్యధిక గ్రామాల్లో కొందరిపై పనిగట్టుకుని కక్షపూరితంగా తొలగించారంటూ.. నిరుపేద (బీపీఎల్) కేటగిరీ కాదని, మరికొందరు గ్రామంలో ఉండకుండా వెళ్లిపోయారంటూ .. ఇలా రకరకాల కారణాలతో పింఛన్‌దారులను అర్హులజాబితాలో నుంచి తొలగించారు. సుజలం ఎలా..? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆరంభంలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం, ఐదువేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క ప్లాంటుకు రూ.2 లక్షల (వెయ్యిలోపు జనాభా) నుంచి రూ.4 లక్షలు (మూడువేల లోపు జనాభా) వరకు ఖర్చవుతోందని అంచనా వేశారు. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలుండగా, వీటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. ఇందుకుగాను 818 ఆర్వోప్లాంట్లు పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు. దాతలెవరూ ముందుకురాకపోవడం, కొన్ని రాజకీయ సమస్యల నేపథ్యంలో తొలిదశ లో మండలానికొకటి చొప్పున 56 ఆర్వోప్లాంట్లు అమల్లోకి తెస్తున్నట్లు జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం ..దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని రెండ్నెల్లకిందట స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి విడతలవారీగా జిల్లాలోని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర దాతలతో జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు, కలెక్టర్ జేఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్‌లు సమావేశాలు నిర్వహించారు. ఎన్నిసార్లు సమీక్షించినా.. సమావేశాలు పెట్టినా.. వారినుంచి అనుకున్నంత స్పందన రాలేదు. అక్టోబర్ రెండు నాటికి జిల్లాలో 56 ప్లాంట్లు అమల్లోకి తేవాలని అనుకున్నా... అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్క కొండెపి నియోజకవర్గంలో 9 ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కాగా .. ఆ నియోజకవర్గంలోని అనకర్లపూడి గ్రామంలోని ప్లాంటును మంత్రి సిద్ధా రాఘరావు గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నిధులివ్వని ‘జన్మభూమి - మా ఊరు’ రోజుకో గ్రామంలో ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గురువారం నుంచి ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఎ. కరికాలవలన్ను నియమించింది. మండలంలో 14 గ్రామాలుంటే ఒక బృందం, 25 గ్రామాలుంటే రెండు, అంతకు మించితే మూడు బృందాలుగా అధికారులను ఇప్పటికే విభజించారు. ఒంగోలు నగరంలో రోజుకు నాలుగుచోట్ల, చీరాల, మార్కాపురం, కందుకూరుల్లో రోజుకు మూడుచోట్ల సభలకు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి ఎంపీడీవో, తహశీల్దార్, కమిషనర్, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తారు. బ్యానర్లు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులతో ప్రచారం కల్పించాలి. పింఛన్ల పంపిణీతో పాటు ప్రజల సమస్యలకు తక్షణపరిష్కారాలు చూపేందుకు అధికారులు పనిచేయాలి. అయితే, జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల కాకుండా అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అధికారుల అంతర్మథనం. జిల్లాకోరోజు పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు .. ‘ప్రకాశం’ పర్యటనలో రెండు నియోజకవర్గాలు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది.