ప్ర'గతులు'
- ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు
- వేలాదిగా పింఛన్‌దారుల తొలగింపుపై విమర్శలు
- కొండపిలో ‘జన్మభూమి -మా ఊరు’ లాంఛన ప్రారంభం నేడు
శంకర్రావు వయస్సు 70 ఏళ్లు. రేషన్ కార్డులో తక్కువ వయస్సు నమోదైందని అతను ప్రభుత్వ పింఛన్ తీసుకోవడానికి అనర్హుడట. వయస్సు ధ్రువీకరణకు వైద్యుల దగ్గరకెళితే..మేమెలా నిర్ధారిస్తామని చెప్పి పంపారు. గత నాలుగేళ్లుగా ఠంచనుగా పింఛన్ పొందినా ప్రస్తుత సర్కారు వేసిన అనర్హత వేటుతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
శ్రీనివాసరావు ‘సదరమ్’ శిబిరంలో వికలాంగుడిగా అన్ని పరీక్షలు చేయించుకుని నాలుగేళ్లుగా ధ్రువీకరణ పత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. సర్వే అధికారులు వచ్చినప్పుడు వికలాంగ ధ్రువీకరణ పత్రం లేదంటూ అతన్ని ప్రభుత్వ పింఛన్‌పొందేందుకు అనర్హుడిగా ప్రకటించారు. సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేక అతను ఆశలొదిలేసుకున్నాడు.
సావిత్రమ్మ భర్త చనిపోయి ఏళ్లు గడిచాయి. అప్పట్లో తహశీల్దార్, గ్రామసర్పంచి పంచనామా జరిపి మరణ ధ్రువీకరణ పత్ర మిచ్చారు. ఇప్పుడేమో అది పనికిరాదంటూ ... వితంతు పింఛన్ తీసుకోవడానికి అనర్హురాలిగా సావిత్రమ్మ పేరును జాబితాలో నుంచి తొలగించారు. కొత్తగా ఆర్డీవో కార్యాలయం ద్వారా ధ్రువీకరణ తెచ్చుకోవాలట. ఇప్పటికప్పుడు సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే, ఖర్చు రూ.వేలల్లో భరించాల్సి రావడంతో ఆర్థికస్థోమత లేని ఆమె మౌనంగా ఉంది.
సాక్షి, ఒంగోలు: గాంధీ జయంతి రోజునే ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పింఛన్ల సర్వే పూర్తయింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రూ.500 తీసుకునే పింఛన్‌దారులు ఇకనుంచి నెలనెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు అర్హతను బట్టి లబ్ధిపొందనున్నారు. ఇందుకోసం గత కొద్దిరోజులుగా జిల్లాలో అధికారులు, ప్రత్యేకంగా నియమించిన సర్వే కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హుల పేర్లను తొలగించి.. అర్హుల జాబితాను తయారు చేశాయి. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత తదితర పింఛన్లు పొందుతున్న వారు ఇప్పటివరకు 3.12 లక్షల మంది ఉన్నారు. వీరిలో 34 వేల మందికిపైగా పేర్లను అనర్హుల జాబితాలోకి చేర్చారు. మరో రెండు వేల మంది ధ్రువపత్రాలకు సంబంధించి పరిశీలన ప్ర‘గతులు' కొనసాగుతోంది.
కమిటీల్లో అధికారపార్టీ నేతలుండటంతో ఇష్టానుసారంగా అర్హులను తొలగించి.. తమ కార్యకర్తలు, అనుచరులకు లబ్ధిచేకూర్చడానికే పనిచేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగించిన జాబితాలో సుమారు 20 వేల మందికిపైగా పింఛన్‌దారులకు ఆధార్‌కార్డుల్లేవని తొలగించగా, మరికొందరికి వయస్సు తక్కువని, కొందరు వితంతువులు, వికలాంగులు కాదని, చేనేత కార్మికులే కాదంటూ తమకు నచ్చని పేర్లను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిధిలోని అత్యధిక గ్రామాల్లో కొందరిపై పనిగట్టుకుని కక్షపూరితంగా తొలగించారంటూ.. నిరుపేద (బీపీఎల్) కేటగిరీ కాదని, మరికొందరు గ్రామంలో ఉండకుండా వెళ్లిపోయారంటూ .. ఇలా రకరకాల కారణాలతో పింఛన్‌దారులను అర్హులజాబితాలో నుంచి తొలగించారు.
సుజలం ఎలా..?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి ఆరంభంలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనీసం, ఐదువేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని అందించాలని భావించారు. ఇప్పటికే పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క ప్లాంటుకు రూ.2 లక్షల (వెయ్యిలోపు జనాభా) నుంచి రూ.4 లక్షలు (మూడువేల లోపు జనాభా) వరకు ఖర్చవుతోందని అంచనా వేశారు. జిల్లాలో వెయ్యికి పైగా గ్రామాలుండగా, వీటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్స్) ఉన్నాయి. ఇందుకుగాను 818 ఆర్వోప్లాంట్లు పెట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు.
దాతలెవరూ ముందుకురాకపోవడం, కొన్ని రాజకీయ సమస్యల నేపథ్యంలో తొలిదశ లో మండలానికొకటి చొప్పున 56 ఆర్వోప్లాంట్లు అమల్లోకి తెస్తున్నట్లు జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడించారు. ఈ పథకానికి ఎలాంటి నిధులు విదల్చని ప్రభుత్వం ..దాతలను సమీకరించి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని రెండ్నెల్లకిందట స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పట్నుంచి విడతలవారీగా జిల్లాలోని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర దాతలతో జిల్లామంత్రి సిద్ధా రాఘవరావు, కలెక్టర్ జేఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్‌లు సమావేశాలు నిర్వహించారు.
ఎన్నిసార్లు సమీక్షించినా.. సమావేశాలు పెట్టినా.. వారినుంచి అనుకున్నంత స్పందన రాలేదు. అక్టోబర్ రెండు నాటికి జిల్లాలో 56 ప్లాంట్లు అమల్లోకి తేవాలని అనుకున్నా... అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక్క కొండెపి నియోజకవర్గంలో 9 ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కాగా .. ఆ నియోజకవర్గంలోని అనకర్లపూడి గ్రామంలోని ప్లాంటును మంత్రి సిద్ధా రాఘరావు గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
నిధులివ్వని ‘జన్మభూమి - మా ఊరు’
రోజుకో గ్రామంలో ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో గురువారం నుంచి ఈ నెల 21 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రత్యేకంగా పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ ఎ. కరికాలవలన్‌ను నియమించింది. మండలంలో 14 గ్రామాలుంటే ఒక బృందం, 25 గ్రామాలుంటే రెండు, అంతకు మించితే మూడు బృందాలుగా అధికారులను ఇప్పటికే విభజించారు. ఒంగోలు నగరంలో రోజుకు నాలుగుచోట్ల, చీరాల, మార్కాపురం, కందుకూరుల్లో రోజుకు మూడుచోట్ల సభలకు ఏర్పాటు చేసుకోవాలి.
వీటికి ఎంపీడీవో, తహశీల్దార్, కమిషనర్, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తారు. బ్యానర్లు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులతో ప్రచారం కల్పించాలి. పింఛన్‌ల పంపిణీతో పాటు ప్రజల సమస్యలకు తక్షణపరిష్కారాలు చూపేందుకు అధికారులు పనిచేయాలి. అయితే, జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల కాకుండా అభివృద్ధిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అధికారుల అంతర్మథనం. జిల్లాకోరోజు పర్యటిస్తానని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు .. ‘ప్రకాశం’ పర్యటనలో రెండు నియోజకవర్గాలు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది.