విజయానికి తొలిమెట్టు అవగాహన | awareness is the first step to success | Sakshi
Sakshi News home page

విజయానికి తొలిమెట్టు అవగాహన

Published Mon, Nov 8 2021 12:12 AM | Last Updated on Mon, Nov 8 2021 12:12 AM

awareness is the first step to success - Sakshi

అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం...

అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే  చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు.

అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి  తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి.

పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది.

ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు.

అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన  గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!!

ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం.

ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది.

విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!!

 –వ్యాఖ్యాన విశారద వెంకట్‌ గరికపాటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement