సొరంగం వద్ద ఆదివారం కొనసాగుతున్న తవ్వకం çపనులు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. రెండు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ప్రస్తుతానికి పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను ఆదివారం మధ్యాహ్నం మొదలు పెట్టారు.
‘మొదలెట్టి నిలువుగా 20 మీటర్లకుపైగా డ్రిల్లింగ్ చేశాం. భారీ బండలు లాంటివి అడ్డుప డకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని ఛిద్రం చేసి మార్గం సుగమం చేయాల్సి ఉంది’’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు.
‘‘ఇప్పటికి మొత్తంగా ఆరు రకాల రెస్క్యూ ప్లాన్‌లను అమలుచేశాం. అయినా సరే మొదటిదే అన్నింటికన్నా ఉత్తమం, సురక్షితం. సమాంతరంగా తవ్వే ప్లాన్‌ను మళ్లీ అమలుచేస్తాం. దాదాపు 62 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశాం. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో 47 మీటర్లవరకు ఉన్న మెషీన్‌ను వెనక్కి లాగాం. 15 మీటర్లు లాగాక మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి.
ప్లాస్మా, గ్యాస్ కట్టర్‌లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నాం. 23 మీటర్లవరకు ముక్కలను తొలగించాం. మొత్తం పొడవునా బ్లేడ్ల ముక్కలను తీయడానికి ఒక రోజంతా పట్టొచ్చు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుంది’’ అని వివరించారు. ‘‘ 62 మీటర్ల శిథిలాల గుండా ఇప్పటికే 47 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది.
మెషీన్ బ్లేడ్లు తొలగించాక మిగతా 15 మీటర్లను మ్యాన్యువల్‌గా తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చు’’ అని ఆయన వెల్లడించారు. గత 14 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు సిల్‌క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment