chardham highway project
-
Uttarakhand tunnel collapse: నిట్టనిలువుగా డ్రిల్లింగ్ మొదలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. రెండు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ప్రస్తుతానికి పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను ఆదివారం మధ్యాహ్నం మొదలు పెట్టారు. ‘మొదలెట్టి నిలువుగా 20 మీటర్లకుపైగా డ్రిల్లింగ్ చేశాం. భారీ బండలు లాంటివి అడ్డుప డకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని ఛిద్రం చేసి మార్గం సుగమం చేయాల్సి ఉంది’’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు. ‘‘ఇప్పటికి మొత్తంగా ఆరు రకాల రెస్క్యూ ప్లాన్లను అమలుచేశాం. అయినా సరే మొదటిదే అన్నింటికన్నా ఉత్తమం, సురక్షితం. సమాంతరంగా తవ్వే ప్లాన్‌ను మళ్లీ అమలుచేస్తాం. దాదాపు 62 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశాం. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో 47 మీటర్లవరకు ఉన్న మెషీన్‌ను వెనక్కి లాగాం. 15 మీటర్లు లాగాక మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నాం. 23 మీటర్లవరకు ముక్కలను తొలగించాం. మొత్తం పొడవునా బ్లేడ్ల ముక్కలను తీయడానికి ఒక రోజంతా పట్టొచ్చు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుంది’’ అని వివరించారు. ‘‘ 62 మీటర్ల శిథిలాల గుండా ఇప్పటికే 47 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. మెషీన్ బ్లేడ్లు తొలగించాక మిగతా 15 మీటర్లను మ్యాన్యువల్‌గా తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చు’’ అని ఆయన వెల్లడించారు. గత 14 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. -
Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ను తెప్పించనున్నట్లు సమాచారం. బగ్వాల్ పండుగ వారితోనూ చేసుకుందాం ‘‘డ్రిల్లింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్ ప్రాంతంలో బగ్వాల్ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. సొరంగంలో కూలింది ఎక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు. -
కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది
డెహ్రాడూన్: నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 40 మంది దాకా కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగింది. చార్దామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా నుంచి దండల్‌గాన్‌ను కలుపుతూ నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇవాళ(ఆదివారం)ఉదయం 4 గంటల ప్రాంతంలో టన్నెల్‌లోని 150 మీటర్ల పొడవున్న ఒక భాగం కుప్పకూలినట్లు పోలీసులు చెప్పారు. టన్నెల్ కూలిన వెంటనే జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. టన్నెల్ కొంత భాగం ఓపెన్ చేసి చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటికి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈలోగా వారికి ఆక్సిజన్ అందించేందుకు పైప్‌ను ఏర్పాటు చేశారు. ఇదీచదవండి..రాహుల్ ఎక్కడ? -
Uttarakhand: ఆనవాయితీ మారేనా!
ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొత్తగా రంగంలోకి దిగింది. చాలాసీట్లలో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్‌లకు మధ్యే ఉండే అవకాశం ఉన్నా... కొన్నిస్థానాల్లో ఆప్ దీన్ని ముక్కోణపు పోరుగా మారుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి 2000 నవంబర్ 9న ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడ్డ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. హిమాలయ సానువుల్లో... ప్రకృతి సౌందర్యాలతో అలరిల్లే ఈ దేవభూమిలో ప్రజాతీర్పును కోరుతున్న వేళ... ఏ పార్టీ పరిస్థితి ఏంటనేది చూద్దాం.. డబుల్ ఇంజిన్.. అభివృద్ధి మంత్రం ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార వ్యతిరేకతను అధిగమించడమనే సవాల్‌ను ఎదుర్కొంటోంది. మరోవైపు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంతో సుస్థిర పాలనను అందించలేకపోయిందనే అభిప్రాయం నెలకొంది. గత ఏడాది మార్చి 10న త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ .. నాలుగు నెలలు తిరగకముందే జూలైæ 4న ఆయన్ను కూడా మార్చేసింది. పుష్కర్‌సింగ్ ధామీని సీఎంను చేసింది. పుష్కర్ దామీ 2017లో ఏకపక్షంగా గెలిపిస్తే (70 స్థానాల్లో బీజేపీ ఏకంగా 57 నెగ్గింది) ద్విగుణీకృత ఉత్సాహంతో అభివృద్ధిపై దృష్టి పెట్టి, సుస్థిర పాలన అందించాల్సింది పోయి... అవకాశాన్ని వృథా చేసుకుందనే అభియోగాలను బీజేపీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఈసారి 60 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని.. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది. విఖ్యాత కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణం, చార్ధామ్ క్షేత్రాలుగా పేరుగాంచిన... కేదార్నాథ్, బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ... సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండేలా (హిమాలయ సానువుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి శీతాకాలంలో విపరీతమైన హిమపాతంతో కొన్ని మార్గాల్లో ప్రయాణానికి వీలుండదు) సువిశాల రహదారి నిర్మాణం, రిషికేశ్– కర్ణప్రయాగ్ రైల్వేలైను నిర్మాణం... వీటిని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. నిర్మాణంలో ఉన్న మౌలికసదుపాయాల ప్రాజెక్టులు పూర్తయితే... పర్యాటకం బాగా పుంజుకుంటుందని, పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ ఇటీవలి ఉత్తరాఖండ్ పర్యటనల్లో నొక్కిచెప్పారు. ఇది ఉత్తరాఖండ్ దశాబ్దమని అభివర్ణించారు. డబుల్ ఇంజిన్ (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే)తోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని పదేపదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. పుష్కర్‌సింగ్ ధామీ (46 ఏళ్లు) యువ ఓటర్లను ఆకర్షించగలరని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. షరామామూలే కాంగ్రెస్‌ను మరొకరు ఓడించాల్సిన పనిలేదు. చాలాసార్లు ఆ పనిని సొంత పార్టీ వాళ్లే చేస్తారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతుంటారు. వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో భంగపడ్డా... కాంగ్రెస్ నేతలు ‘తగ్గేదేలే’అంటూ అంతర్గత కుమ్ములాటల్లో ఎప్పటిలాగే బిజీగా ఉన్నారు. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు... పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సిగపట్లు జగద్విదితం. ఎంతైనా కాంగ్రెస్ సంస్కృతి కదా! ఒకరికి చెక్ పెట్టడానికి మరొకరిని ఎగదోయడం కాంగ్రెస్ పెద్దలు అనాదిగా అలవాటు చేసుకున్నదే. హరీష్ రావత్ ఉత్తరాఖండ్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కు.. మాజీ సీఎం హరీష్ రావత్. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే పార్టీ కొట్లాడుతోంది. అయితే అధిష్టానం నియమించిన మనుషుల నుంచే తనకు సహాయనిరాకరణ ఎదురవుతోందని, అస్త్రసన్యాసం చేయడం (రాజకీయాల నుంచి తప్పుకోవడం) మినహా తనకు మరోమార్గం కనపడటం లేదని కొంతకాలం కిందట రావత్ బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తర్వాత అందరినీ ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం సర్దిచెప్పి పంపింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విపక్షనేత ప్రీతమ్‌సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దేవేంద్ర యాదవ్...హరీష్‌రావత్‌ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి వీల్లేదని పట్టుబట్టడంతో పార్టీ అధిష్టానం ఎవరి పేరునూ ప్రకటించలేదు. రావత్ నాయకత్వంలో∙ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ప్రియాంకా గాంధీ ప్రచారంపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరీష్ రావత్ చాలాకాలం నుంచే బీజేపీ సీఎంలను మార్చేసి అస్థిర పరిస్థితులకు కారణమవుతోందనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. నిరుద్యోగం, దరల పెరుగుదలనూ వీలైనంతగా ఎత్తిచూపారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే ఆనవాయితీ తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ వూహకర్తలు భావిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం లేదు సుపరిపాలన నినాదం, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్, ఢిల్లీ మోడల్ అభివృద్ధి (విద్య, వైద్య సదుపాయాల మెరుగుదల) హామీలు... ఆప్ ఆధారపడుతున్న అంశాలు. అయితే ప్రత్యర్థి పార్టీలతో పోల్చినపుడు తగిన సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఆప్‌కు ప్రధానలోటు. 20 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ల పాలన చూశారు కాబట్టి ఈసారి తమకొక అవకాశం ఇవ్వాలని ఆప్ కోరుతోంది. అధికారం లోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఉద్యోగాల భర్తీ, రూ.5,000 నిరుద్యోగ భృతి, మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి. ఉత్తరాఖండ్ నుంచి భారత సైన్యంలో పెద్ద ఎత్తున జవాన్లు, అధికారులు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆప్ రిటైర్డ్ కల్నల్ అజయ్ కోథియాల్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అజయ్ కోథియాల్ ఉనికి కోసం ఉద్యమ పార్టీ పోరాటం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (యూకేడీ) కోల్పోయిన ప్రాభావాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. కాశీ సింగ్ ఐరీ నేతృత్వంలోని యూకేడీ 2007లో మూడు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతునిచ్చింది. తర్వాత 2012, 2017 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన ఈ ఉద్యమపార్టీ ఇప్పుడు ఉనికిని చాటేందుకు పోరాడుతోంది. కాశీ సింగ్ ఐరీ – నేషనల్ డెస్క్, సాక్షి -
దేశ భద్రత కోసం...
రెండు కళ్ళలో ఏది ముఖ్యం అంటే ఏం చెబుతాం? ఒక కంటినే ఎంచుకోమంటే ఏం చేస్తాం? దేశ భద్రత, పర్యావరణ పరిరక్షణ – రెండూ కీలకమే. కానీ, వాటిలో ఒక దానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలన్నప్పుడు ఏం చేయగలుగుతాం? కొన్నేళ్ళుగా వివాదాస్పదమైన ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ విషయంలో ఎదురైన చిక్కుప్రశ్న ఇదే. చివరకు, దేశ భద్రతా ప్రయోజనాల వైపే సర్వోన్నత న్యాయస్థానం కొంత మొగ్గాల్సి వచ్చింది. సున్నితమైన భారత – చైనా సరిహద్దులో అవసరాన్ని బట్టి త్వరితగతిన సైన్యాన్ని మోహరించడానికి వీలుగా హిమాలయాల్లోని 3 జాతీయ రహదారులను వెడల్పు చేయడం కీలకమని రక్షణ శాఖ భావిస్తోంది. ఆ వాదనకు సమ్మతించిన జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు జడ్జీల సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ప్రభుత్వం కోరినట్టు చార్ధామ్ ప్రాజెక్టును మంగళవారం అనుమతించింది. రోడ్ల వెడల్పు 5.5 మీటర్లే ఉండాలంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో మునుపటి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాన్ని సవరించి, 10 మీటర్లకు ఓకే చెప్పింది. అయితే, పర్యావరణాన్ని విస్మరించరాదని కోర్టు పేర్కొనడం కొంత ఉపశమనం. గతంలో ‘హై పవర్డ్ కమిటీ’ ఇచ్చిన సిఫార్సులను పాటించేలా, తీవ్ర పర్యావరణ ఉల్లంఘనలు జరగకుండా చూసేలా ఓ పర్యవేక్షణ సంఘాన్ని కోర్టు నియమించింది. ఇది పర్యావరణవాదుల పోరాటానికి కొంతలో కొంత ఊరట. రూ. 12 వేల కోట్ల ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ 900 కిలోమీటర్ల రహదారులకు సంబంధించినది. తాజాగా రోడ్ల వెడల్పుకు కోర్టు అనుమతించిన 3 జాతీయ రహదారులూ (రిషీకేశ్ నుంచి మనా, రిషీకేశ్ నుంచి గంగోత్రి, తనక్‌పూర్ నుంచి పిథోరాగఢ్) ఆ ‘చార్ధామ్ హైవే ప్రాజెక్ట్’లో భాగమే. చైనాతో మన దేశానికి ఉన్న ఉత్తర సరిహద్దుకు ఈ మూడు రహదారులూ దారి తీస్తాయి. ఇప్పుడిక సైకిల్ ప్రయాణానికి వీలు కల్పించే ‘పేవ్డ్ షోల్డర్’ ఇరువైపులా ఉండేలా రెండు లేన్ల (డీఎల్పీఎస్) వెడల్పాటి రోడ్లుగా ఈ హైవేలను అభివృద్ధి చేస్తారు. సైనిక దళాల అవసరాల రీత్యా ఈ విస్తరణ తప్పదని రక్షణ శాఖ మాట. సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఈ మాటను విస్మరించలేమని కోర్టు తన తీర్పులో పేర్కొనడం గమనార్హం. మొదట్లో చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్ నాలుగు పుణ్యక్షేత్రాలు బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేలా యాత్రికుల కోసం ఉద్దేశించినది. 2016 డిసెంబర్లో ప్రధాని మోదీ ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. 2013 నాటి ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇది నివాళి అన్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్ ఆది నుంచి వివాదాస్పదమే. హిమాలయ పర్వతాల్లో వేల సంఖ్యలో వృక్షాలను కొట్టివేస్తే కానీ, రోడ్ల విస్తరణ సాధ్యం కాదు. జీవ్యావరణ రీత్యా సున్నితమైన ఈ ప్రాంతంలో ఇప్పటికే 25 వేలకు పైగా చెట్లను కొట్టేశారట. పర్యావరణవాదుల వ్యతిరేకత అందుకే. దానికి తగ్గట్టే కోర్టులోనూ ఇబ్బందులు తలెత్తాయి. పర్యావరణ అనుమతుల్లో, నిబంధనల్లో ఉల్లంఘనలపై దుమారం రేగింది. 2018 సెప్టెంబర్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టుకు ఓకే అన్నా, అదే అక్టోబర్‌లో సుప్రీమ్ స్టే ఇచ్చింది. అసలు పర్వతప్రాంతాల్లో రోడ్ల వెడల్పు 5.5 మీటర్లు మించరాదన్నది 2018లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్. మునుపటి సుప్రీమ్ ధర్మాసనం ఆ మాటనే సమర్థించింది. 2020 డిసెంబర్‌కి వచ్చేసరికి పరిస్థితి మారింది. చైనా సరిహద్దుల దాకా వెళ్ళే ఈ మూడు హైవేలకూ వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. సైనిక అవసరాల కోసం రోడ్ల వెడల్పును 10 మీటర్లకు పెంచాలని రక్షణ శాఖ కోరింది. లడఖ్ ప్రాంతంలో చైనాతో సాగుతున్న ఘర్షణల దృష్ట్యా ఆ అభ్యర్థన న్యాయమైనదే. అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ సహా సరిహద్దుల వెంట చైనా జనావాస నిర్మాణాల నేపథ్యంలో ప్రేక్షకపాత్ర పోషించలేం. వెరసి, 26 మంది సభ్యుల హై పవర్ కమిటీలో మెజారిటీ వర్గీయులు అంగీకరించినట్టే, సుప్రీమ్ సైతం ఇప్పుడు దేశ రక్షణ రీత్యా ప్రాజెక్టుకు ఓకె చెప్పింది. నిజానికి, ఒక్క చార్ధామ్ రోడ్ ప్రాజెక్టే కాదు... హిమాలయ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న భవన నిర్మాణాలతో భారీ పర్యావరణ నష్టం జరుగుతోంది. చార్‌ధామ్‌పై కోర్టుకెళ్ళిన ఎన్జీవో ‘సిటిజెన్స్ ఫర్ గ్రీన్ డూన్’ దీనిపైనా స్వరం పెంచింది. ఢిల్లీ – డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే కోసం గణేశ్‌పూర్ – డెహ్రాడూన్ పొడుగూతా ముందస్తు అనుమతి లేకుండా చెట్ల నరికివేయడాన్ని ఆపాలంటూ న్యాయస్థానం తలుపు తట్టింది. ఆ ఆవేదన సరైనదే. కానీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చార్ధామ్ రోడ్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపక ముందే, డెహ్రాడూన్, దాని పరిసర ప్రాంతాల్లో దురాశాపరుల చేతుల్లో అధిక శాతం చెట్లు, పచ్చదనం నాశనమయ్యాయి. ఇష్టారాజ్యంగా సాగిన భవన నిర్మాణాలు, చెట్ల నరికివేతతో వేసవి విడుదులైన డెహ్రాడూన్, ముస్సోరీ లాంటివి ఒకప్పటి ఆహ్లాద వాతావరణాన్ని పోగొట్టుకున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఇష్టారాజ్యపు నిర్మాణాలతో చెట్లు పోయి, రాళ్ళు పట్టు కోల్పోయి కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. అలా చూస్తే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమే. కానీ, విదేశీ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ భద్రతే అతి ముఖ్యం కాకమానదు. ఆ అనివార్యత అర్థం చేసుకోదగినదే. ఇప్పుడిక చేయాల్సిందల్లా– వీలైనంత తక్కువ పర్యావరణ నష్టంతో రహదారి నిర్మాణమే! పాలకుల బాధ్యత అది. సుప్రీమ్ అన్నట్టు దేశ భద్రత, పర్యావరణం రెంటినీ సమతూకం చేసుకోవాలి. అదే ఇటు దేశంతో పాటు ప్రకృతికీ శ్రీరామరక్ష! -
చార్ధామ్ హైవే ప్రాజెక్టుకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని వ్యూహాత్మక చార్ధామ్ హైవే ప్రాజెక్టు డబుల్‌లేన్ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. జాతీయ భద్రతకు ఇటీవలి కాలంలో పలు సవాళ్లు ఎదురయ్యాయని, సరిహద్దుల్లోకి వేగంగా సైనిక బలగాలను తరలించడానికి ఈ రహదారి విస్తరణ అవసరమని వ్యాఖ్యానించింది. సాయుధ బలగాలకు అవసరమైన మౌలి క సదుపాయాల విషయంలో న్యాయస్థానం మరో సారి సమీక్ష చేపట్టలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రాజెక్టుపై నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక అందజేసేందుకు మాజీ జడ్జి జస్టిస్ సిక్రి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ప్రాజెక్ట్‌లో క్యారేజ్ వే వెడల్పు 5.5 మీట ర్లు ఉండేలా 2018 సర్క్యులర్‌ను అనుసరించా లంటూ 2020న సుప్రీం ఇచ్చిన ఆదేశాలను సవరించాలం టూ రోడ్డు రవాణా, రహదారుల శాఖ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ తీర్థయాత్రాస్థలాలను కలుపుతూ ఏడాదంతా రాకపోకలు సాగిం చేందుకు వీలుగా కేంద్రం రూ.12వేల కోట్ల ఖర్చు తో 900 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. -
ఏం చెప్పానో గుర్తుంచుకుంటా: మోదీ
-
ఏం చెప్పానో గుర్తుంచుకుంటా: మోదీ
ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఒక్క ఇంజన్ ఉంటే చాలదని, రెండు ఇంజన్లు కావాలని, వాటిలో ఒకటి ఢిల్లీ ఇంజన్ అయితే మరొకటి డెహ్రాడూన్‌దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో చార్ధామ్ హైవే అభివృద్ధి ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను తప్పుడు హామీలు ఇవ్వనని, ఏం చెప్పానో గుర్తుంచుకుంటానని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రసంగం సాగింది. తనకు ఇక్కడివారు అందరి మీద ఒక ఫిర్యాదు ఉందని, 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇక్కడకు వచ్చినప్పుడు మైదానం సగమే నిండిందని, కానీ ఇప్పుడు వేలాది మంది కనిపిస్తున్నారని, దాన్నిబట్టి చూస్తే ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం ఇక ఏమాత్రం ఆగే పరిస్థితి లేనట్లుందని అన్నారు. కేదార్నాథ్ దుర్ఘటనలో మరణించిన వారికి నివాళిగానే చార్ధామ్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. హడావుడిగా చేపట్టే పనులు కేవలం రాజకీయాల కోసమే తప్ప అభివృద్ధి కోసం కాదని, ప్రజలకు అన్ని విషయాలూ తెలుసని అన్నారు. కేదార్నాథ్, బదరీనాథ్ యాత్రకు వచ్చినవాళ్లంతా ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారని మోదీ చెప్పారు. తన ప్రభుత్వం పేదల కోసమే ఉందని, ఉత్తరాఖండ్‌కు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్‌ను అవకాశాల గనిగా మారుస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తాను పేదల కోసం పనిచేస్తున్నానా.. ధనవంతుల కోసమా అని ప్రజలను ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు 40 ఏళ్లుగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించాయని, కానీ తన ప్రభుత్వంలోనే దాన్ని అమలుచేశానని తెలిపారు. రిబ్బన్లు కట్ చేయడానికి, క్యాండిళ్లు వెలిగించడానికి తాను ప్రధాని కాలేదని చెప్పారు. నల్లధనం మీద తాను యుద్ధం ప్రకటించానని, ఈ యుద్ధంలో మీ అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు. అసలు సమస్య నల్లధనం కాదని, కొంతమంది మనసులే నల్లగా ఉన్నాయని అదే అసలు సమస్య అని చెప్పారు. అవినీతి, దోపిడీ అంతమైతేనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. తాము నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం, డ్రగ్ మాఫియా, మానవుల అక్రమరవాణా అన్నింటిపైనా ఒక్క నోట్ల రద్దుతోనే వేటు వేశామని ఆయన చెప్పారు.