
ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొత్తగా రంగంలోకి దిగింది. చాలాసీట్లలో ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్‌లకు మధ్యే ఉండే అవకాశం ఉన్నా... కొన్నిస్థానాల్లో ఆప్ దీన్ని ముక్కోణపు పోరుగా మారుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి 2000 నవంబర్ 9న ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడ్డ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. హిమాలయ సానువుల్లో... ప్రకృతి సౌందర్యాలతో అలరిల్లే ఈ దేవభూమిలో ప్రజాతీర్పును కోరుతున్న వేళ... ఏ పార్టీ పరిస్థితి ఏంటనేది చూద్దాం..
డబుల్ ఇంజిన్.. అభివృద్ధి మంత్రం
ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికార వ్యతిరేకతను అధిగమించడమనే సవాల్‌ను ఎదుర్కొంటోంది. మరోవైపు ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంతో సుస్థిర పాలనను అందించలేకపోయిందనే అభిప్రాయం నెలకొంది. గత ఏడాది మార్చి 10న త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ .. నాలుగు నెలలు తిరగకముందే జూలైæ 4న ఆయన్ను కూడా మార్చేసింది. పుష్కర్‌సింగ్ ధామీని సీఎంను చేసింది.
పుష్కర్ దామీ
2017లో ఏకపక్షంగా గెలిపిస్తే (70 స్థానాల్లో బీజేపీ ఏకంగా 57 నెగ్గింది) ద్విగుణీకృత ఉత్సాహంతో అభివృద్ధిపై దృష్టి పెట్టి, సుస్థిర పాలన అందించాల్సింది పోయి... అవకాశాన్ని వృథా చేసుకుందనే అభియోగాలను బీజేపీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఈసారి 60 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని.. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తోంది.
విఖ్యాత కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణం, చార్‌ధామ్ క్షేత్రాలుగా పేరుగాంచిన... కేదార్‌నాథ్, బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ... సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండేలా (హిమాలయ సానువుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి శీతాకాలంలో విపరీతమైన హిమపాతంతో కొన్ని మార్గాల్లో ప్రయాణానికి వీలుండదు) సువిశాల రహదారి నిర్మాణం, రిషికేశ్– కర్ణప్రయాగ్ రైల్వేలైను నిర్మాణం... వీటిని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
నిర్మాణంలో ఉన్న మౌలికసదుపాయాల ప్రాజెక్టులు పూర్తయితే... పర్యాటకం బాగా పుంజుకుంటుందని, పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రధాని మోదీ ఇటీవలి ఉత్తరాఖండ్ పర్యటనల్లో నొక్కిచెప్పారు. ఇది ఉత్తరాఖండ్ దశాబ్దమని అభివర్ణించారు. డబుల్ ఇంజిన్ (కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే)తోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని పదేపదే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. పుష్కర్‌సింగ్ ధామీ (46 ఏళ్లు) యువ ఓటర్లను ఆకర్షించగలరని బీజేపీ నమ్మకం పెట్టుకుంది.
షరామామూలే
కాంగ్రెస్‌ను మరొకరు ఓడించాల్సిన పనిలేదు. చాలాసార్లు ఆ పనిని సొంత పార్టీ వాళ్లే చేస్తారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతుంటారు. వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో భంగపడ్డా... కాంగ్రెస్ నేతలు ‘తగ్గేదేలే’అంటూ అంతర్గత కుమ్ములాటల్లో ఎప్పటిలాగే బిజీగా ఉన్నారు. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు... పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సిగపట్లు జగద్విదితం. ఎంతైనా కాంగ్రెస్ సంస్కృతి కదా! ఒకరికి చెక్ పెట్టడానికి మరొకరిని ఎగదోయడం కాంగ్రెస్ పెద్దలు అనాదిగా అలవాటు చేసుకున్నదే.
హరీష్ రావత్
ఉత్తరాఖండ్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కు.. మాజీ సీఎం హరీష్ రావత్. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే పార్టీ కొట్లాడుతోంది. అయితే అధిష్టానం నియమించిన మనుషుల నుంచే తనకు సహాయనిరాకరణ ఎదురవుతోందని, అస్త్రసన్యాసం చేయడం (రాజకీయాల నుంచి తప్పుకోవడం) మినహా తనకు మరోమార్గం కనపడటం లేదని కొంతకాలం కిందట రావత్ బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తర్వాత అందరినీ ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం సర్దిచెప్పి పంపింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విపక్షనేత ప్రీతమ్‌సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దేవేంద్ర యాదవ్...హరీష్‌రావత్‌ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి వీల్లేదని పట్టుబట్టడంతో పార్టీ అధిష్టానం ఎవరి పేరునూ ప్రకటించలేదు. రావత్ నాయకత్వంలో∙ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ప్రియాంకా గాంధీ ప్రచారంపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరీష్ రావత్ చాలాకాలం నుంచే బీజేపీ సీఎంలను మార్చేసి అస్థిర పరిస్థితులకు కారణమవుతోందనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. నిరుద్యోగం, దరల పెరుగుదలనూ వీలైనంతగా ఎత్తిచూపారు. ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే ఆనవాయితీ తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ వూహకర్తలు భావిస్తున్నారు.
సంస్థాగత నిర్మాణం లేదు
సుపరిపాలన నినాదం, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్, ఢిల్లీ మోడల్ అభివృద్ధి (విద్య, వైద్య సదుపాయాల మెరుగుదల) హామీలు... ఆప్ ఆధారపడుతున్న అంశాలు. అయితే ప్రత్యర్థి పార్టీలతో పోల్చినపుడు తగిన సంస్థాగత నిర్మాణం లేకపోవడం ఆప్‌కు ప్రధానలోటు. 20 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ల పాలన చూశారు కాబట్టి ఈసారి తమకొక అవకాశం ఇవ్వాలని ఆప్ కోరుతోంది. అధికారం లోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఉద్యోగాల భర్తీ, రూ.5,000 నిరుద్యోగ భృతి, మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి. ఉత్తరాఖండ్ నుంచి భారత సైన్యంలో పెద్ద ఎత్తున జవాన్లు, అధికారులు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆప్ రిటైర్డ్ కల్నల్ అజయ్ కోథియాల్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
అజయ్ కోథియాల్
ఉనికి కోసం ఉద్యమ పార్టీ పోరాటం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (యూకేడీ) కోల్పోయిన ప్రాభావాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. కాశీ సింగ్ ఐరీ నేతృత్వంలోని యూకేడీ 2007లో మూడు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతునిచ్చింది. తర్వాత 2012, 2017 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన ఈ ఉద్యమపార్టీ ఇప్పుడు ఉనికిని చాటేందుకు పోరాడుతోంది.
కాశీ సింగ్ ఐరీ
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment