Kurabalakota
-
టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం!
కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్ కమ్ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ విక్రమ్ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్ డెకరేటివ్గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది. ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్/ఆఫ్ బటన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ప్లగ్ వీల్ అనే మరో మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్ రోలర్ మిషన్ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు. టెర్రకోటతో కొత్త బాట టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది. – దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు 70 శాతం కష్టం తగ్గింది ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం. – రాజగోపాల్, రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు వీటికే ఎక్కువ డిమాండ్ టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్ డెకరేటివ్ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు. – డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు -
నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!
కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్ నూరాసాబ్ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్‌వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట) యువతరం చదువులపై దృష్టి నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం. – మోదీన్ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది. – కమాల్‌సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె అభివృద్ధి బాటపడుతోంది ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది – సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది. – హైదర్‌వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె -
శభాష్.. పది నిమిషాల్లోనే ఆరోగ్య శ్రీ కార్డు అందించిన డిజిటల్ అసిస్టెంట్
కురబలకోట (చిత్తూరు జిల్లా): పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టి శభాష్ అనిపించుకుంది తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ఎర్రబల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మానస. ఎర్రబల్లె సచివాలయ పరిధిలోని సింగన్నగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు యశ్వంత్ (4)కు బోన్ కేన్సర్. కుటుంబసభ్యులు చికిత్స కోసం ఇటీవల బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదని వైద్యం చేయడానికి అక్కడి వైద్యులు నిరాకరించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయం స్థానిక సర్పంచ్ ఉప్పతి నాగరత్న ఈశ్వర్‌కు తెలియడంతో ఎర్రబల్లె సచివాలయానికి చేరుకుని డిజిటల్ అసిస్టెంట్ మానసను సంప్రదించారు. ఆమె విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు చిన్నారి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి.. పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. గతంలో నెలలపాటు తిరిగినా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేది కాదని, ఇప్పుడు నిమిషాల్లో కార్డు చేతికందిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తామని తెలిపారు. -
మట్టి బొమ్మే ఆ ఊరికి ఊపిరి
ప్రాణంలేని మట్టి బొమ్మలే ఆ ఊరికి ఊపిరి పోశాయి. ఆ ఊరిలో పురుడు పోసుకున్న టెర్రకోట బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇక్కడి కళాకారుల ఖ్యాతిని చాటాయి. సుమారు మూడు దశాబ్దాలకు ముందు పుట్టిన ఆ కళ క్రమంగా విస్తరిస్తోంది. ఈ కళాకారులు చేతులను మంత్రదండాలుగా మార్చి మట్టికి రూపు తెచ్చారు. అలా రూపుదిద్దుకున్న బొమ్మలే ఆ పల్లెకు పేరు ప్రఖ్యాతులతోపాటు సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆ ఊరే కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె. సాక్షి, కురబలకోట(చిత్తూరు): టెర్రకోట కుండలు, బొమ్మలు అంటేనే తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె. బొమ్మల ఊరుగా పేరు గాంచింది. ఏ ఇంటి ముందు చూసినా రకరకాల బొమ్మలు కళకళలాడుతూ కన్పిస్తాయి. హైవేపై రాకపోకలు సాగించే వివిధ ప్రాంతాల వారు వీటి కోసం ఆగుతారు. ప్రాణం లేని బొమ్మలు మనుషులతో భావాలను పంచుకుంటున్నట్లుగా కనిపిస్తాయి. 1983లో రిషివ్యాలీ స్కూల్ టీచర్ విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ పొందుతోంది. ఈ ఊరు మొత్తం టెర్రకోట బొమ్మలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. టెర్రకోట బొమ్మలే ఆ ఊరి సౌందర్యం టెర్రకోట బొమ్మలు తొలుత ఊపిరి పోసుకుంది కంటేవారిపల్లెలోనే. ఇక్కడ 32 కుటుంబాలు ఉన్నాయి. 155 మంది హస్త కళాకారులున్నారు. డీఆర్డీఏ శిక్షణ కేంద్రం ఉంది. హైవే రోడ్డుపక్కనే ఈ ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా ఈ కళకు కలిసొచ్చింది. టెర్రకోట సౌందర్యం ఇక్కడి కళాకారుల ఖ్యాతిని నలుదిశలా చాటిచెబుతోంది. వీరు తయారు చేయడమే కాకుండా కలకత్తా, గోరఖ్‌పూర్, ఢిల్లీ, అహమ్మదాబాద్, లక్నో, చెల్లి గూడ తదితర ప్రాంతాల నుంచి కూడా నాణ్యమైన బొమ్మలను తెప్పించి, వాటికి అదనపు అలంకరణలు జోడించి, తుది మెరుగులు దిద్ది, వ్రికయిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన కుముద్‌బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్ లాంటి వారు ఈ ఊరిని సందర్శించారు. కళాకారులను మెచ్చుకున్నారు. చేతులే మంత్ర దండాలు కళాకారుల చేతులే మంత్ర దండాలుగా పనిచేస్తాయి. రకరకాల బొమ్మలను ఇట్టే చేస్తారు. ఇక్కడి టెర్రకోట కళ జిల్లాలోని అంగళ్లు, పలమనేరు, సదుం, కాండ్లమడుగు, కణికలతోపు, బి.కొత్తకోట, తెట్టు, చెన్నామర్రి, సీటీఎం, ఈడిగపల్లె తదితర గ్రామాలకు విస్తరించింది. వీళ్లంతా కంటేవారిపల్లెలో నేర్చుకున్నవారే. ఇక్కడి వారు తరచూ శిక్షణ పొందుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ట్రెండ్‌ను పసిగట్టి వ్యాపారం చేస్తున్నారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళుతున్నారు. మరో వైపు సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతి రూపంగా ఈ మట్టిబొమ్మలు నిలుస్తున్నాయి. సీజన్ బట్టి వ్యాపారం పండగలు, సీజన్ బట్టి వ్యాపారాన్ని చేస్తున్నాం. చవితికి వినాయక బొమ్మలు, దీపావళికి ప్రమిదలు, దసరాకు దుర్గ విగ్రహాలు, అక్కగార్ల ఉత్సవాలకు అక్కదేవతలు ఇలా కాలాన్ని బట్టి అవసరమైన వాటిని తయారు చేస్తున్నాం. వంటపాత్రలు, సాధారణ బొమ్మలు ఎప్పుడూ ఉంటాయి. రూ.20 నుంచి రూ. 2వేలు వరకు వెలగల బొమ్మలు, కుండలు ఉన్నాయి. – రామచంద్ర, టెర్రకోట కళాకారుడు, కంటేవారిపల్లె తిరుమలలో స్టాల్స్ కేటాయించాలి టెర్రకోట బొమ్మలు, కుండలతోపాటు బాలాజీ ఇతర హిందూ దేవుళ్ల బొమ్మల అమ్మకానికి తిరుమలలో స్టాల్స్ కేటాయించాలి. టీటీడీ చొరవ చూపాలి. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్టాల్స్ కేటాయిస్తే ఈ కళ కూడా విశ్వ వ్యాప్తం కావడానికి అవకాశం ఉంది. మరింతగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. – ఎ. భారతి, టెర్రకోట కళాకారిణి, కంటేవారిపల్లె, -
సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్
సాక్షి,చిత్తూరు : ‘సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం.. సీతామాలచ్చిమంటే... శ్రీలక్ష్మి అవతారం..’ అరే ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే అన్పిస్తుంది కదూ..అవును ఇది సీతామాలక్ష్మి సినిమా పాట. పెద్ద తరం వారికి బాగా తెలుసు. 1978లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట వింటే మనసు పులకరి స్తుంది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. కళాతపస్వి కె.విశ్వనా«థ్ దర్శకత్వంలో హీరో చంద్రమోహన్, హీరోయిన్గా తాళ్లూరి రామేశ్వరి నటించారు. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా..కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..’అనే పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు కురబలకోట రైల్వేస్టేషన్లో తీశారు. వంకాయల సత్యనారాయణ స్టేషన్ మాస్టర్‌గా హీరో హీరోయిన్లపై ఈ పాట రసరమ్యంగా సాగింది. రైల్వేస్టేషన్లో అద్భుతంగా చిత్రీకరించారు. దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్‌ను సీతామాలక్ష్మి స్టేషన్‌గా వ్యవహరిస్తున్నా రు. ఆనాటి స్టేషన్ ఆధునీకరణలో రూపురేఖలు మారినా ఆ సినిమా ఊహలు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు. ఈ సినిమా టీవీలో వస్తే ఈ ప్రాంతంలో ఇంటిల్లిపాది కూర్చుని చూడటం పరిపాటిగా మారింది. -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రియురాలు ఇంటిలో ప్రియుడు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్ఐ నెట్టికంఠయ్య కథనం మేరకు.. అంగళ్లు గ్రామం చింతయ్యగారి కోటకు చెందిన శశికుమార్ (21), అదే గ్రామంలోని కమతంపల్లెకు చెందిన ఓ బాలిక (17) ఏడాదిగా ప్రేమలో పడ్డారు. అబ్బాయి ఇంటర్ చదివి ఖాళీగా ఉంటున్నాడు. అమ్మాయి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు దండించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అమ్మాయి మైనర్ కావడంతో వారు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అప్పటినుంచి అమ్మాయి అతనికి దూరంగా ఉండసాగింది. ఆమె ఎదురుపడినా మాట్లాడకపోవడంతో మనోవ్యధకు గురైన అబ్బాయి ఆదివారం మధ్యాహ్నం నేరుగా అమ్మాయి ఇంటికే వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. తనతో మాట్లాడకపోతే చనిపోతానని హెచ్చరించాడు. ఆమె ఎప్పటిలా మాట్లాడనని చెప్పి ఇంట్లోని మరో గదిలోకి వెళ్లింది. అతను అక్కడే కొక్కీకి ప్రియురాలి పైట చెంగు (స్కార్ప్)తో ఉరి వేసుకున్నాడు. అమ్మాయి వెళ్లి చూసేటప్పటికి అతను మృతి చెంది ఉండడంతో వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కూలి పనులకు వెళ్లిన వారు వెంటనే ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డను అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయే ఇంట్లో ఉరివేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నెట్టి కంఠయ్య తెలిపారు. -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడు మృతి
-
స్త్రీ నిధి డబ్బులు గోల్మాల్
రూ. 10 లక్షలు పక్కదారి పట్టించిన వెలుగు సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు సభ్యుల ఫిర్యాదు కురబలకోట : మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన డ్వాక్రా (వెలుగు) గ్రూపు రుణాలు పక్కదారి పడుతున్నాయి. కురబలకోట మండలంలోని బండపల్లె, ఎర్రజానివారిపల్లె, నందిరెడ్డిగారిపల్లె, చేనేతనగర్, గౌనివారిపల్లె తదితర గ్రామాల్లోని గ్రూపుల్లో వెలుగు (డ్వాక్రా) సిబ్బంది రూ.10లక్షల వరకు చేతి వాటం చూపారు. బుధవారం వెలుగు సిబ్బంది నిర్వాకంపై డ్వాక్రా గ్రూపు సభ్యులు నిరసన తెలిపారు. సభ్యుల కథనం మేరకు.. అంగళ్లు గ్రామం బండపల్లె పరిసర గ్రామాల్లో వెంకటేశ్వర, లక్ష్మి, శ్రీవినాయక, విఘ్నేష్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షల వరకు స్త్రీనిధి, బ్యాంకు రుణాల నిధులు స్వాహా అయ్యాయి. రెండు రోజుల కిందట గ్రూపు సభ్యులు లెక్కలు చూశారు. అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి. ఓ గ్రూపు అకౌంట్ నుంచి ఏకంగా రూ.7 లక్షలను మరొకరి ఖాతాకు సంఘమిత్ర ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసినట్లు స్పష్టమైంది. వెలుగులో పనిచేస్తున్న సంఘమిత్ర ఈ నిధులను స్వాహా చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీకి గ్రూపు సభ్యులు ఫిర్యాదు పత్రం పంపారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. -
ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య
కురబలకోట : ప్రియురాలిని హత్య చేసి ప్రియుడూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో గురువారం సంచలనం కలిగించింది. ముదివేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు... తెట్టుకు చెందిన గాయత్రి (30)కి నిమ్మనపల్లె మండలం వెంకటాపురానికి చెందిన రెడ్డెప్పతో 15 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెడ్డెప్ప ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గాయత్రి పిల్లలను తీసుకుని తెట్టులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. పిల్లలను అక్కడే ఉంచి మదనపల్లె టమాటా మార్కెట్లో కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు మార్కెట్లో కూలి పనులు చేస్తున్న తెట్టుకు చెందిన యానాది శ్రీనివాసులు (40)తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. అతనికి పెళ్లి కాలేదు. ఏడాదిన్నరగా వీరు నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్లుగా గాయత్రి వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని శ్రీనవాసులు అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమె మండలంలోని అంగళ్లు సమీపంలోని కోల్డ్ స్టోరేజి వెనుక మైదానంలో చెట్టు కింద దారుణ హత్యకు గురైంది. అదే రోజు శ్రీనివాసులు కూడా తెట్టులోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయత్రిని హత్య చేసిన తర్వాత శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గాయత్రికి, శ్రీనివాసులుకు నయం కాని జబ్బు ఉందని, వివాహేతర సంబంధాలతో ఇది ఇతరులకు కూడా వ్యాపిస్తుందన్న కారణంగా ఆమెను హత్య చేసినట్లు యానాది శ్రీనివాసులు పేరుతో ఉన్న సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయత్రి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. లెటర్ రాసిందెవరు? గాయత్రి హత్యకు గురైన స్థలంలో బయట పడ్డ లెటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయత్రికి గాని, ఆమె ప్రియుడు యానాది శ్రీనివాసులుకు గాని చదువు రాదు. ఈ క్రమంలో లెటర్ రాయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసులు తనకు తెలిసిన వారి వద్ద ముందుగా రాయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
పాముకాటుతో విద్యార్థిని మృతి
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో బుధవారం రాత్రి విషసర్పం కాటేయడంతో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం కనకదాస్నగర్లో నివాసముంటున్న ప్రకాష్, ఈశ్వరమ్మ దంపతులకు మోహన్, వైష్ణవి (10) పిల్లలు ఉన్నారు. వినాయక చవితి పండుగ కోసం వీరంతా తంబళ్లపల్లెలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బుధవారం రాత్రి బయలుదేరారు. కురబలకోట మండలం దొమ్మన్నబావి సమీపంలోకి వెళ్లగానే వర్షం కురవడంతో అందరూ ఓ చెట్టుచాటుకు వెళ్లారు. అక్కడున్న ఒక విషసర్పం స్థానికంగా వైష్ణవిని కాటేసింది. గమనించిన తల్లిదండ్రులు బాలికను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి వెళ్లాలని వైద్యులు తెలపడంతో వారు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వైష్ణవి మృతి చెందింది. కురబలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నవ పరిశోధకులు
ఏ దేశ అభివృద్ధి అయినా శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఇందుకనుగుణంగా భావి ఇంజినీర్లు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్, ఎస్‌వీటీఎం ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు వివిధ పరిశోధనలతో తమ గమనాన్ని చాటుకుంటున్నారు. - కురబలకోట ⇒ సమాజ ప్రగతికి ఇవే మూలం ⇒ ప్రతిభ చాటుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు గుండెజబ్బును ఇట్టే పసిగట్టవచ్చు.. గుండెజబ్బుతో చాలామంది సతమతం అవుతున్నారు. ఇలాంటి జబ్బును పెద్దగా ఖర్చు లేకుండానే ఇట్టే పసిగట్టే యంత్రాన్ని ఎస్‌వీటీఎం ఇంజినీరింగ్ విద్యార్థి హరినాథ్ కనుగొన్నారు. సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, ఏఆర్ఎం, మైక్రో కంట్రోలర్ పరికరాన్ని చేశారు. ఎంబెడెడ్ టెక్నాలజీతో జీఎస్‌కు అనుసంధానం చేశారు. ఈ పరికరాన్ని ఏ వ్యక్తికి తాకించినా హృదయ స్పందనలు తెలిసిపోతాయి. సెల్‌ఫోన్‌కు సందేశం పంపిస్తుంది. సెల్లో కూడా కన్పిస్తుంది. ఈప్రాజెక్టు కింద దీన్ని తయారు చేయడం ఆరు వేలు దాకా అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండానే ముందుగా గుండెజబ్బులు కనిపెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. - గుండెజబ్బులు కనుగొనే ప్రాజెక్టు గురించి చూపుతున్న హరినాథ్ బ్యాంకు లాకర్ సేఫ్ ఇటీవల కాలంలో దొంగలు ఎక్కువగా బ్యాంకులను కొల్లగొడుతున్నారు. వివిధ సెక్యూరిటీ విధానాలున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా లాకర్లును తెరచి సొమ్ము దోచుకెళుతున్నారు. ఫేస్ రికగ్జైజింగ్, లోకలెజైషన్ సిస్టమ్ ద్వారా లోపాలను సరి చేసి ప్రాజెక్టును రూపొందించారు మదనపల్లె సమీపంలోని అంగళ్లు ఎస్‌వీటీఎం ఎంటెక్ విద్యార్థి పి.హేమలత. దీని ద్వారా లాకర్లలోని సొమ్ము దొంగల చేతికి చిక్కకుండా రెండు విధాలుగా రక్షణ కల్పించవచ్చు. ఒకటి లాకర్ యజమాని ముఖాన్ని గుర్తించడం.. రెండోది శబ్దగ్రహణం. హెచ్ఎఆర్ఆర్ ఆల్లారిథం సాయంతో కొన్ని ముఖ కవళికలను పొందుపరుస్తారు. తర్వాత ఎప్పుడు అక్కడికి వెళ్లినా ముఖాన్ని గుర్తిస్తుంది. దీన్ని డేటాబేస్‌లో సరిపోల్చుతుంది. రెండు కలిస్తే జీఎస్ఎం ద్వారా మెసేజ్ పంపుతుంది. అప్పడు మనం మెసేజ్‌లో వచ్చిన దాన్ని పలికితే లాక్ తెరుచుకుంటుంది. దొంగలు తెరవాలన్నా సాధ్యం కాదు. ఇలాంటివి బ్యాంక్ లాకర్స్, లై బ్రరీల్లో వాడుతారు. - ప్రాజెక్టు గురించి వివరిస్తున్న హేమలత చక్కెర శాతం లేని బియ్యం ముందు కాలంలో దంపుడు బియ్యం తిని ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పడు బియ్యానికి పాలిష్ పెట్టడం, రసాయనిక ఎరువుల వల్ల విటమిన్లు లోపం వ్యాధులకు దారి తీస్తోంది. మిట్స్ ఎంటెక్ విద్యార్థి పి. మేఘశ్యామ్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ప్యాడీ ప్రాజెక్టులో తక్కువ ఖర్చుతో వడ్లను బియ్యంగా మార్చవచ్చు. నూకలు కూడా కావు. ఈయంత్రం నుంచి వచ్చిన బియ్యానికి పాలిషింగ్ కూడా ఉండదు. ఈ బియ్యంతో రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం. దీని ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆధాయం పొందవచ్చు. - వడ్లను బియ్యంగా మార్చే మిషన్‌తో మేఘశ్యామ్ నాణ్యమైన ఇంజెక్షన్ సిరంజీలు సాధారణంగా ఇంజెక్షన్ సిరంజీలు ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో తరచూ లోపాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టి నాణ్యత పెంచేందుకు మిట్స్ ఎంటెక్ విద్యార్థి కె.రాఘవేంద్ర కాశ్యప్ తన ప్రాజెక్టులో కనుగొన్నాడు. ఇంజెక్షన్ మోల్డింగ్‌లో పారామీటర్ యంత్రం ద్వారా ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఉన్న లోపాన్ని గుర్తించి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆ ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచుతుంది. దీన్ని ఎక్కువగా ఫాక్టరీలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో బ్యాటరీలను ఉంచి పంపడానికి ఎక్కువగా వాడుతారు. - ఇంజెక్షన్ మోల్డింగ్ యంత్రాన్ని చూపుతున్న రాఘవేంద్ర కాశ్యప్ మిట్స్ పరిశోధనలకు నిలయం మిట్స్ కళాశాలలో పరిశోధన (ఆర్అండ్డీ) ఏర్పాటు చేశాం. ఇసీఈ, మెకానికల్, సీఎస్సీ, ఎంబీఏ, ఇంగ్లిషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాధ్స్లపై పరిశోధనలకు అనువుగా ఉంది. పీహెచ్‌డీలు చేయాలనుకునే వారికి ఇది తోడ్పడుతుంది. అనంతపురం జేఎన్టీయూ పరిధిలోనే ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా మిట్స్ పరిశోధన కేంద్రం గుర్తింపు పొందింది. - ఎన్.విజయభాస్కర్ చౌదరి, కరస్పాండెంట్, మిట్స్ కళాశాల, అంగళ్లు ప్రపంచంతో పోటీ పడాలి అత్యాధునిక ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలి. నూతన ఆలోచనలతో ప్రపంచస్థాయిలో పోటీ పడాలి. నిరంతర సాధనతో భావి శాస్త్రవేత్తలుగా రాణిస్తారు. తద్వారా గుర్తింపు వస్తుంది. మానవాళి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వాటికి ఉపయోగపడే వాటికి ఆదరణ ఎక్కువ. దేశంలో పరిశోధకులను మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. - కె.శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఎస్‌వీటీఎం, విశ్వం విద్యా సంస్థలు, అంగళ్లు -
బాబు టూర్ ... స్కూళ్లకు సెలవు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కురబలకోటలో ఈ రోజు జరిగే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో బాబు పాల్గొనున్నారు. అయితే ఆ కార్యక్రమానికి భారీగా ప్రజలను తరలించేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలోని చిత్తూరు, మదనపల్లె డివిజన్లలోని వివిధ స్కూళ్లకు చెందిన దాదాపు 400 బస్సులను ఉన్నతాధికారులు తీసుకున్నారు. బస్సులు లేకుంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్కూల్ యాజమాన్యం ఉన్నతాధికారులు తెలిపారు. దాంతో సదరు డివిజన్లలో పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించారు.