కురబలకోట : ప్రియురాలిని హత్య చేసి ప్రియుడూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో గురువారం సంచలనం కలిగించింది. ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు... తెట్టుకు చెందిన గాయత్రి (30)కి నిమ్మనపల్లె మండలం వెంకటాపురానికి చెందిన రెడ్డెప్పతో 15 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెడ్డెప్ప ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గాయత్రి పిల్లలను తీసుకుని తెట్టులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. పిల్లలను అక్కడే ఉంచి మదనపల్లె టమాటా మార్కెట్‌లో కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు మార్కెట్‌లో కూలి పనులు చేస్తున్న తెట్టుకు చెందిన యానాది శ్రీనివాసులు (40)తో సన్నిహిత సంబంధం ఏర్పడింది.
అతనికి పెళ్లి కాలేదు. ఏడాదిన్నరగా వీరు నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్లుగా గాయత్రి వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని శ్రీనవాసులు అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమె మండలంలోని అంగళ్లు సమీపంలోని కోల్డ్ స్టోరేజి వెనుక మైదానంలో చెట్టు కింద దారుణ హత్యకు గురైంది. అదే రోజు శ్రీనివాసులు కూడా తెట్టులోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
గాయత్రిని హత్య చేసిన తర్వాత శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గాయత్రికి, శ్రీనివాసులుకు నయం కాని జబ్బు ఉందని, వివాహేతర సంబంధాలతో ఇది ఇతరులకు కూడా వ్యాపిస్తుందన్న కారణంగా ఆమెను హత్య చేసినట్లు యానాది శ్రీనివాసులు పేరుతో ఉన్న సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయత్రి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
లెటర్ రాసిందెవరు?
గాయత్రి హత్యకు గురైన స్థలంలో బయట పడ్డ లెటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయత్రికి గాని, ఆమె ప్రియుడు యానాది శ్రీనివాసులుకు గాని చదువు రాదు.
ఈ క్రమంలో లెటర్ రాయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసులు తనకు తెలిసిన వారి వద్ద ముందుగా రాయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య
Published Fri, Oct 21 2016 2:56 AM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM
Advertisement
Advertisement