సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రేమ ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రియురాలు ఇంటిలో ప్రియుడు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ నెట్టికంఠయ్య కథనం మేరకు.. అంగళ్లు గ్రామం చింతయ్యగారి కోటకు చెందిన శశికుమార్ (21), అదే గ్రామంలోని కమతంపల్లెకు చెందిన ఓ బాలిక (17) ఏడాదిగా ప్రేమలో పడ్డారు. అబ్బాయి ఇంటర్ చదివి ఖాళీగా ఉంటున్నాడు. అమ్మాయి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు దండించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అమ్మాయి మైనర్ కావడంతో వారు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
అప్పటినుంచి అమ్మాయి అతనికి దూరంగా ఉండసాగింది. ఆమె ఎదురుపడినా మాట్లాడకపోవడంతో మనోవ్యధకు గురైన అబ్బాయి ఆదివారం మధ్యాహ్నం నేరుగా అమ్మాయి ఇంటికే వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. తనతో మాట్లాడకపోతే చనిపోతానని హెచ్చరించాడు. ఆమె ఎప్పటిలా మాట్లాడనని చెప్పి ఇంట్లోని మరో గదిలోకి వెళ్లింది. అతను అక్కడే కొక్కీకి ప్రియురాలి పైట చెంగు (స్కార్ప్)తో ఉరి వేసుకున్నాడు. అమ్మాయి వెళ్లి చూసేటప్పటికి అతను మృతి చెంది ఉండడంతో వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కూలి పనులకు వెళ్లిన వారు వెంటనే ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డను అమ్మాయి తల్లిదండ్రులే చంపేశారని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయే ఇంట్లో ఉరివేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment