మట్టి బొమ్మే ఆ ఊరికి ఊపిరి | Kantevari palle Famous For Terrakota Dolls Chittoor | Sakshi
Sakshi News home page

‘టెర్రకోట’కు పుట్టినిల్లు

Published Thu, Sep 19 2019 11:16 AM | Last Updated on Thu, Sep 19 2019 11:20 AM

Kantevari palle Famous For Terrakota Dolls Chittoor - Sakshi

ప్రాణంలేని మట్టి బొమ్మలే ఆ ఊరికి ఊపిరి పోశాయి. ఆ ఊరిలో పురుడు పోసుకున్న టెర్రకోట బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇక్కడి కళాకారుల ఖ్యాతిని చాటాయి. సుమారు మూడు దశాబ్దాలకు ముందు పుట్టిన ఆ కళ క్రమంగా విస్తరిస్తోంది. ఈ కళాకారులు చేతులను మంత్రదండాలుగా మార్చి మట్టికి రూపు తెచ్చారు. అలా రూపుదిద్దుకున్న బొమ్మలే ఆ పల్లెకు పేరు ప్రఖ్యాతులతోపాటు సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆ ఊరే కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె. 

సాక్షి, కురబలకోట(చిత్తూరు): టెర్రకోట కుండలు, బొమ్మలు అంటేనే తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె. బొమ్మల ఊరుగా పేరు గాంచింది. ఏ ఇంటి ముందు చూసినా రకరకాల బొమ్మలు కళకళలాడుతూ కన్పిస్తాయి. హైవేపై రాకపోకలు సాగించే వివిధ ప్రాంతాల వారు వీటి కోసం ఆగుతారు. ప్రాణం లేని బొమ్మలు మనుషులతో భావాలను పంచుకుంటున్నట్లుగా కనిపిస్తాయి. 1983లో రిషివ్యాలీ స్కూల్‌ టీచర్‌ విక్రమ్‌ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ పొందుతోంది. ఈ ఊరు మొత్తం టెర్రకోట బొమ్మలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 

టెర్రకోట బొమ్మలే ఆ ఊరి సౌందర్యం
టెర్రకోట బొమ్మలు తొలుత ఊపిరి పోసుకుంది కంటేవారిపల్లెలోనే. ఇక్కడ 32 కుటుంబాలు ఉన్నాయి. 155 మంది హస్త కళాకారులున్నారు. డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రం ఉంది. హైవే రోడ్డుపక్కనే ఈ ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా ఈ కళకు కలిసొచ్చింది. టెర్రకోట సౌందర్యం ఇక్కడి కళాకారుల ఖ్యాతిని నలుదిశలా చాటిచెబుతోంది. వీరు తయారు చేయడమే కాకుండా కలకత్తా, గోరఖ్‌పూర్, ఢిల్లీ, అహమ్మదాబాద్, లక్నో, చెల్లి గూడ తదితర ప్రాంతాల నుంచి కూడా నాణ్యమైన బొమ్మలను తెప్పించి, వాటికి అదనపు అలంకరణలు జోడించి, తుది మెరుగులు దిద్ది, వ్రికయిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు  రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన కుముద్‌బెన్‌ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్‌ లాంటి వారు ఈ ఊరిని సందర్శించారు. కళాకారులను మెచ్చుకున్నారు. 

చేతులే మంత్ర దండాలు
కళాకారుల చేతులే మంత్ర దండాలుగా పనిచేస్తాయి. రకరకాల బొమ్మలను ఇట్టే చేస్తారు. ఇక్కడి టెర్రకోట కళ జిల్లాలోని అంగళ్లు, పలమనేరు, సదుం, కాండ్లమడుగు, కణికలతోపు, బి.కొత్తకోట, తెట్టు, చెన్నామర్రి, సీటీఎం, ఈడిగపల్లె తదితర గ్రామాలకు విస్తరించింది. వీళ్లంతా కంటేవారిపల్లెలో నేర్చుకున్నవారే. ఇక్కడి వారు తరచూ శిక్షణ పొందుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ట్రెండ్‌ను పసిగట్టి వ్యాపారం చేస్తున్నారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళుతున్నారు. మరో వైపు సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతి రూపంగా ఈ మట్టిబొమ్మలు నిలుస్తున్నాయి.

సీజన్‌ బట్టి వ్యాపారం
పండగలు, సీజన్‌ బట్టి వ్యాపారాన్ని చేస్తున్నాం. చవితికి వినాయక బొమ్మలు, దీపావళికి ప్రమిదలు, దసరాకు దుర్గ విగ్రహాలు, అక్కగార్ల ఉత్సవాలకు అక్కదేవతలు ఇలా కాలాన్ని బట్టి అవసరమైన వాటిని తయారు చేస్తున్నాం. వంటపాత్రలు, సాధారణ బొమ్మలు ఎప్పుడూ ఉంటాయి. రూ.20 నుంచి రూ. 2వేలు వరకు వెలగల బొమ్మలు, కుండలు ఉన్నాయి. 
 – రామచంద్ర, టెర్రకోట కళాకారుడు, కంటేవారిపల్లె 

తిరుమలలో స్టాల్స్‌ కేటాయించాలి
టెర్రకోట బొమ్మలు, కుండలతోపాటు బాలాజీ ఇతర హిందూ దేవుళ్ల బొమ్మల అమ్మకానికి తిరుమలలో స్టాల్స్‌ కేటాయించాలి. టీటీడీ చొరవ చూపాలి. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్టాల్స్‌ కేటాయిస్తే ఈ కళ కూడా విశ్వ వ్యాప్తం కావడానికి అవకాశం ఉంది. మరింతగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. 
 – ఎ. భారతి, టెర్రకోట కళాకారిణి, కంటేవారిపల్లె,

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement