చిన్నారి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డును అందజేస్తున్న సర్పంచ్ నాగరత్న ఈశ్వర్, ఎర్రబల్లె సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మానస
కురబలకోట (చిత్తూరు జిల్లా): పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టి శభాష్ అనిపించుకుంది తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ఎర్రబల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ మానస. ఎర్రబల్లె సచివాలయ పరిధిలోని సింగన్నగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు యశ్వంత్ (4)కు బోన్ కేన్సర్. కుటుంబసభ్యులు చికిత్స కోసం ఇటీవల బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆరోగ్యశ్రీ కార్డు లేదని వైద్యం చేయడానికి అక్కడి వైద్యులు నిరాకరించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయం స్థానిక సర్పంచ్ ఉప్పతి నాగరత్న ఈశ్వర్‌కు తెలియడంతో ఎర్రబల్లె సచివాలయానికి చేరుకుని డిజిటల్ అసిస్టెంట్ మానసను సంప్రదించారు. ఆమె విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు చిన్నారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి.. పది నిమిషాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. గతంలో నెలలపాటు తిరిగినా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేది కాదని, ఇప్పుడు నిమిషాల్లో కార్డు చేతికందిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment