
పాముకాటుతో మృతిచెందిన విద్యార్థిని వైష్ణవి
మదనపల్లె టౌన్ :
కురబలకోట మండలంలో బుధవారం రాత్రి విషసర్పం కాటేయడంతో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం కనకదాస్‌నగర్‌లో నివాసముంటున్న ప్రకాష్, ఈశ్వరమ్మ దంపతులకు మోహన్, వైష్ణవి (10) పిల్లలు ఉన్నారు. వినాయక చవితి పండుగ కోసం వీరంతా తంబళ్లపల్లెలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో బుధవారం రాత్రి బయలుదేరారు. కురబలకోట మండలం దొమ్మన్నబావి సమీపంలోకి వెళ్లగానే వర్షం కురవడంతో అందరూ ఓ చెట్టుచాటుకు వెళ్లారు. అక్కడున్న ఒక విషసర్పం స్థానికంగా వైష్ణవిని కాటేసింది. గమనించిన తల్లిదండ్రులు బాలికను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి వెళ్లాలని వైద్యులు తెలపడంతో వారు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వైష్ణవి మృతి చెందింది. కురబలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.