Mixer
-
మినీ మిక్సర్: మిల్క్‌షేక్‌ల నుంచి చిన్న పిల్లల ఆహారం వరకు ఏదైనా..!
చిత్రంలోని 4 ఇన్ 1 ఎలక్ట్రిక్ మినీ గార్లిక్ చాపర్ మిక్సర్.. పిల్లలకు, పెద్దలకు భలే ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఐస్ క్రీమ్, సోయా మిల్క్, ఫ్రెష్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, మిల్క్ షేక్స్ వంటివే కాదు.. పసిపిల్లలకు మెత్తటి ఆహారం, ఫేస్ మాస్క్ కోసం మెత్తటి మిశ్రమాన్నీ తయారు చేసుకోవచ్చు. దీనిలో 3 పదునైన బ్లేడ్స్ ఉంటాయి. సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది పండ్లు, కూరగాయలతో పాటు మాంసాన్నీ కచ్చాబిచ్చాగా చేయగలదు. స్కూల్లో, ఆఫీసుల్లో, జిమ్‌లో, క్యాంపింగ్‌లో ఇలా ప్రతిచోటా.. చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని 3 నుంచి 4 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు. కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. ఈ బాటిల్ రెండువైపులా ఓపెన్ అవుతుంది. దాంతో క్లీనింగ్ సులభమవుతుంది. బాటిల్ కింద వైపు ఉన్న బటన్ని ప్రెస్ చేసుకుంటే... ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం!
కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్ కమ్ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ విక్రమ్ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్ డెకరేటివ్గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది. ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్/ఆఫ్ బటన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ప్లగ్ వీల్ అనే మరో మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్ రోలర్ మిషన్ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు. టెర్రకోటతో కొత్త బాట టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది. – దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు 70 శాతం కష్టం తగ్గింది ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం. – రాజగోపాల్, రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు వీటికే ఎక్కువ డిమాండ్ టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్ డెకరేటివ్ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు. – డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు -
బుల్లి బుజ్జాయిల కోసం.. ఈ డివైజ్ ధర 4,947 రూపాయలు
Baby Food Device: ఇంటి పని, ఆఫీస్ పనితో నిరంతరం సతమతమయ్యే న్యూ పేరెంట్స్‌కి ఈ బేబీ ఫుడ్ మేకర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడే తినడం మొదలుపెట్టిన బుల్లి బుజ్జాయిలకు పోషకాహారం చాలా అవసరం. అందుకే ఈ మేకర్ వేడివేడిగా.. పిల్లలకు నచ్చే ప్రొటీన్స్తో కూడిన ఆహారాన్ని అందిస్తుంది. ఇందులో ఆహారాన్ని ఉడికించుకోవడంతో పాటు పిల్లలు తేలికగా తినేందుకు వీలుగా ఆ ఆహారాన్ని మిక్సీ పట్టుకోవచ్చు. అందుకు అనుకూలంగా రూపొందిన మేకర్ ఇది. ఇందులో జ్యూస్, బొప్పాయి పేస్ట్, యాపిల్ పేస్ట్, బనానా పేస్ట్ వంటివి ఎన్నో పిల్లలకు నచ్చేవిధంగా సిద్ధం చేసుకోవచ్చు. అందుకు కుడివైపు ఫుడ్ సేఫ్టీ మెటీరియల్‌తో రూపొందిన ఒక జగ్ ఉంటుంది. దానిలోపలే మిక్సీ బ్లేడ్స్ ఉంటాయి. దాంతో అందులోనే ఉడికించి, అందులోనే మిక్సీ పట్టుకునే వీలుంటుంది. దాంతో ఆహారం వేడి వేడిగా ఉంటుంది. ఎడమవైపు పైభాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఉంటుంది (చిత్రంలో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది). దానిలో వాటర్ నింపుకుని.. జగ్‌లో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలు వంటివి వేసుకుని ముందువైపు ఉన్న రెగ్యులేటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీమింగ్, రీహీటింగ్, బ్లెండింగ్ వంటి ఆప్షన్స్ ఉపయోగించి ఈ మేకర్‌ను చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. ధర : 65 డాలర్లు (రూ.4,947) -
మీ చేతిలోనే ‘పవర్’.. కరెంట్ బిల్లు స్లాబ్ రేట్ల తగ్గుదలకు 10 చిట్కాలు
విద్యుత్‌ను మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ.. వృథా చేయకుండా పొదుపు చేస్తే పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లే. అనవసరంగా కరెంట్‌ను వాడకుండా పొదుపు చేయవచ్చు. తద్వారా వినియోగం యూనిట్లు తగ్గి బిల్లు స్లాబ్ రేట్లు తగ్గుతాయి. బిల్లుల రూపేణ చెల్లించే ఖర్చులు తగ్గుతాయి. మంగళవారం నుంచి 21 వరకు విద్యుత్ వారోత్సవాలు జరగనున్నాయి. కరెంటు ఆదా చేసే ఆ పది పద్ధతులు ఏంటో చూద్దాం. –సాక్షి, హన్మకొండ విద్యుత్ పొయ్యి ఆహారపదార్థాలు వండడానికి నిర్దేశించిన సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ స్టౌను ఆపేయాలి.సమతలమైన అడుగును కలిగిన వంటపాత్రలను ఉపయోగించాలి. ఎందుకంటే అవి పొయ్యిలోని కాయిల్ పూర్తిగా కప్పబడి ఉంటాయి. విద్యుత్ సద్వినియోగమై వంట త్వరగా పూర్తవుతుంది. మిక్సీలు రోజువాడే వాటిలో మిక్సీలు, గ్రైండర్లు ముఖ్యమైనవి. పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్థాలను తక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పొడులు చేయడం తగ్గించుకోవాలి. ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే గృహోపకరణాలను వాడితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫ్యాన్లు ఫ్యాన్ లేని ఇల్లు.. గది అంటూ ఉండదు. మనం ఏ గదిలో ఉంటామో అక్కడే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. అక్కడినుంచి మరో గదిలోకి వెళ్లినప్పుడు ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. రెగ్యులరేటర్‌ను కచ్చితంగా వాడాలి. ఇప్పుడు తక్కువ కరెంటు వినియోగంతో.. ధారాళంగా గాలి వచ్చే ఫ్యాన్లు వస్తున్నాయి. వాటిని వాడాలి. బల్బులు ఆర్పివేయాలి ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. బల్బులు ఆర్పివేయాలి. ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. ఎయిర్ కండిషనర్లు గది ఉష్ణోగ్రతను బట్టి దానికదే నియంత్రించుకునే పరికరాలను కొనాలి. తక్కువ చల్లదనం స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి. ఏసీతోపాటు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది. ఏసీలోని ధర్మోస్టాట్ నార్మల్ దగ్గర ఉంచాలి. లేకపోతే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. ఫ్రిజ్‌లు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం వల్ల మాన్యువల్ డీప్రాస్ట్ చేయాల్సిన ఫ్రిజ్, ఫ్రిజర్లు, ఫ్రిజ్‌లోని మోటార్ సరిగ్గా పనిచేసేందుకు శక్తిని పెంచుకుంటాయి. ఫ్రిజ్‌కు.. గోడకు మధ్య గాలి ఆడేలా కొంతస్థానాన్ని ఉంచాలి. డోర్ సరిగ్గా పట్టిందో, లేదో సరిచూసుకోవాలి. వేడిగా లేదా వెచ్చని పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మైక్రోవేవ్స్ ఓవెన్స్ ఇవి సంప్రదాయక విద్యుత్ లేదా గ్యాస్ స్టౌ కన్నా 50 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఆహారపదార్థాలు ఓవెన్లో పెట్టాక ఎంత వరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి తలుపు తెరవద్దు. అలా తెరచిన ప్రతిసారీ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్లి వేడెక్కడానికి విద్యుత్ ఖర్చవుతుంది. టీవీ టీవీ లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు అంతా ఎల్ఈడీ, ఎల్సీడీ అధునాత టెక్నాలజీతో వస్తున్నాయి. ఒక్కోసారి మనం టీవీ ఆన్‌చేసి ఇతర పనుల్లో నిమగ్నమవుతాం. అది మోగుతూనే ఉంటుంది. అలాకాకుండా మనం చూసిన తరువాత ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. ఆన్‌లో ఉంటే 10వాట్ల శక్తిని నష్టపరుస్తుంది. కంప్యూటర్లు ఉపయోగించనప్పుడు ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్లను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ఒక కంప్యూటర్, ఫ్రిజ్ కన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. స్లీప్ మోడ్ ఉండేలా సెట్టింగ్ చేయడం ద్వారా దాదాపు 40శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా ఇదేవిదంగా చేయాలి. సోలార్ వాటర్ హీటర్ చలికాలంలో వేడినీటితో స్నానం తప్పనిసరి. నీటిని వేడి చేసేందుకు విద్యుత్ హీటర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్‌ను ఉపయోగించడం ఉత్తమం. విద్యుత్ హీటర్ ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. కొంత ప్రమాదకరం కూడా. రోజువారీగా చెక్ చేసుకుంటూ పోతే సోలార్కు పెద్దగా ఖర్చు ఉండదు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి... వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. దీనివల్ల ధనాన్ని పొదుపు చేసుకున్నట్లే. వినియోగదారులు విద్యుత్ చాలా తక్కువగా వినియోగించే ఉపకరణాలు వాడాలి. టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ పొదుపు చేయడంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ముందుంది. ఇండియా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఊర్జా, స్కోచ్ అవార్డులు అందుకుంది. -ఎన్నమనేని గోపాల్‌రావు, సీఎండీ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ -
మిక్సీలో మిక్స్ చేసేసి...
♦ మహిళా స్మగ్లర్ కొత్త పోకడ ♦ అబుదాబి నుంచి 1.29 కిలోల బంగారం అక్రమ రవాణా.. ♦ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్న డీఆర్ఐ సాక్షి, హైదరాబాద్: మిక్సీ లోపలి భాగంలో ఉంచి స్మగ్లింగ్ చేస్తున్న 1.29 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న నగర మహిళ తనతో పాటు మిక్సర్ గ్రైండర్‌ను తీసుకువచ్చింది. ఈమె బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు విమానా శ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బ్యాగేజ్‌తో పాటు గ్రైండర్‌ను తనిఖీ చేశారు. మిక్సీ మోటర్ కింది భాగంలో ఉండే జిగ్ అనే ఉపకరణాన్ని తొలగించి, ఆ స్థానంలో బంగారం పెట్టి, పైన మెటల్ పూత పూసినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని మహిళను లోతుగా విచారిస్తున్నారు. 13 డ్రోన్ కెమెరాలు స్వాధీనం... శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు గురువారం 13 డ్రోన్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో వచ్చిన ఇద్దరు హైదరాబాదీలు తమ వెంట భారీ టీవీతో పాటు 2 బ్యాగుల్లో తొమ్మిది చిన్న, 4 పెద్ద డ్రోన్ కెమెరాలను తీసుకువచ్చారు. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బ్యాగులు తనిఖీ చేశారు. వీటిల్లో డ్రోన్ కెమెరాలు బయటపడ్డాయి. వీటిని విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నా, వినియోగించాలన్నా కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరి. అనుమతులు లేకుండా తీసుకువస్తున్న నేపథ్యంలో కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
మిక్సీలో బంగారం, మహిళ అరెస్ట్
హైదరాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు దొరికిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గురువారం సాయంత్రం అబుదబి నుంచి వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న లగేజిని తనిఖీ చేసిన రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు మిక్సర్ గ్రైండర్‌ను పరీక్షగా చూడగా అందులోని మోటార్లో ఉన్న దాదాపు 1.29 కేజీల బంగారం బయటపడింది. ఈ మేరకు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఆఫర్ పేరుతో అడ్డగోలు దోపిడీ
సాక్షి, గుంటూరు : తక్కువ ధరకే ఎక్కువ వస్తువులు కొనాలనే మధ్యతరగతి వినియోగదారుడి మనస్తత్వాన్ని కొన్ని వ్యాపార సంస్థలు అడ్డదారిలో నగదుగా మార్చుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల మాదిరిగా ఉండే చౌకబారు ఉత్పత్తులను తయారు చేసి అనధికారికంగా అమ్ముకుంటున్నాయి. ఈ అమ్మకాలకు సాక్ష్యంగా ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా అటు వినియోగదారుడిని, ఇటు ప్రభుత్వాన్ని ఏకబిగిన మోసం చేస్తున్నాయి. ప్రధానంగా విద్యుత్తు గృహోపకరణాలలో నాణ్యత ప్రమాణాలకు ఏమాత్రం సరితూగని వస్తువులు జిల్లాలోని పలు షాపుల్లో రాజ్యమేలుతున్నాయి. దసరా, దీపావళి పండగల ఆఫర్ల పేరుతో వీటిని వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు పలువురు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఆఫర్ల హడావుడి.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంటిలోనూ టీవీ, మిక్సీ, ఫ్యాన్లు, కూలర్లు, ఐరన్‌బాక్సులు, సెల్‌ఫోన్ చార్జర్ వంటి విద్యుత్ గృహోపకరణాలు నిత్యావసరాలుగా మారాయి. పండగ ఆఫర్ల పేరుతో వ్యాపారులు చేస్తున్న హడావుడికి వినియోగదారులు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఏటా దీపావళి వరకూ జిల్లాలో విద్యుత్ గృహోపకరణాల కొనుగోళ్లు బాగుంటాయి. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తువులు, గృహోపకరాల ధరలు అందుబాటులో లేకపోవడంతో తక్కువ ధరలో ఏదో ఒకటి కొనాలన్న అభిప్రాయానికి మద్యతరగతి వినియోగదారులు వస్తున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రముఖ కంపెనీల అనుక రణ వస్తువులు మార్కెట్లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, పొన్నూరు, రేపల్లె పట్టణాల్లోని పలు షాపుల్లో వీటిని విక్రయించేందుకు కొందరు వ్యాపారులు హంగామా చేస్తున్నారు. బాండెడ్ కంపెనీల పేరుతో ప్రచారం చేస్తూ నాసిరకం వస్తువులను విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో వీటి అమ్మకాలు జోరుగా సాగాయి. ముంబాయి తయారీ మిక్సీ రూ.1200 నుంచి రూ.1950 , హైదరాబాద్ తయారీ రూ.1600 నుంచి రూ.2 వేలకు లభ్యమవుతున్నాయి. సీలింగ్ ఫ్యాన్ ఫతేనగర్ (హైదరాబాద్) తయారీదైతే రూ.450 నుంచి రూ.600 వరకూ, వాటర్ హీటర్లు రూ.150 నుంచి ఆపైన, ఐరన్‌బాక్సులు, రూ.300 నుంచి రూ.600కు దొరుకుతున్నాయి.కొందరు వ్యాపారులు సెల్చార్జర్లు, ఇయర్ ఫోన్లు, మెమొరీ కార్డుల్ని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పండగ ఆఫర్లు ప్రకటించి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే కొటేషన్ కాపీనే బిల్లులా ఇస్తున్నారు. తక్కువ ధరకు కొన్న ఈ వస్తువులు పనిచేయడం ప్రారంభించిన వారం రోజులకే మూలన పడుతున్నాయి. అర్థం కాని లోగోలు... వినియోగదారులకు స్పష్టంగా అర్థం కాని లోగోలు, బ్రాండ్లను స్క్రీన్ ప్రింటింగ్‌తో తయారు చేస్తున్నారు. ప్రఖ్యాత కంపెనీల పేర్లకు కాస్త అటూ, ఇటుగా పేర్లు పెట్టి అందంగా ముద్రిస్తున్నారు. దుకాణంలో అడుగుపెట్టిన చదువుకున్న కొనుగోలుదారుడు కూడా వీటిని సరిగ్గా గుర్తించ లేక పోతున్నారు. గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన భూపతి ఓ షాపులో ఎగ్జాస్టర్ ఫ్యాన్ కొనుగోలు చేసి వారం రోజుల్లోనే పనిచేయక మూలన పడేశాడు. అరండల్‌పేట నాలుగో లైన్‌లోని ఓ షాప్‌లో కొన్న సెల్‌ఫోన్ రెండు రోజులకే పనిచేయడం మానేసింది. మిక్సీలు బాగు చేసే మెకానిక్‌లకు కుప్పలు తెప్పలుగా రిపేర్ ఆర్డర్లు రావడం అనుకరణ ఉత్పత్తుల చలవే. పన్ను చెల్లింపులు నిల్లు.. ఈ తరహా వ్యాపారులు విద్యుత్ గృహోపకరణాలను విక్రయించేటపుడు సాధారణ అమ్మకం పన్ను చెల్లించకపోతుండటంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయాల నష్టం వస్తోంది. బిల్లు సౌకర్యం లేకపోవడంతో ఫోరం, కోర్టుల్ని ఆశ్రయించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. అనధికార విక్రయాలను, నాసిరకం వస్తువుల్ని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో జోగుతూ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.