ఆఫర్ పేరుతో అడ్డగోలు దోపిడీ
Published Mon, Oct 14 2013 4:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : తక్కువ ధరకే ఎక్కువ వస్తువులు కొనాలనే మధ్యతరగతి వినియోగదారుడి మనస్తత్వాన్ని కొన్ని వ్యాపార సంస్థలు అడ్డదారిలో నగదుగా మార్చుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల మాదిరిగా ఉండే చౌకబారు ఉత్పత్తులను తయారు చేసి అనధికారికంగా అమ్ముకుంటున్నాయి. ఈ అమ్మకాలకు సాక్ష్యంగా ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా అటు వినియోగదారుడిని, ఇటు ప్రభుత్వాన్ని ఏకబిగిన మోసం చేస్తున్నాయి. ప్రధానంగా విద్యుత్తు గృహోపకరణాలలో నాణ్యత ప్రమాణాలకు ఏమాత్రం సరితూగని వస్తువులు జిల్లాలోని పలు షాపుల్లో రాజ్యమేలుతున్నాయి. దసరా, దీపావళి పండగల ఆఫర్ల పేరుతో వీటిని వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు పలువురు వ్యాపారులు సిద్ధమయ్యారు.
ఆఫర్ల హడావుడి..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంటిలోనూ టీవీ, మిక్సీ, ఫ్యాన్లు, కూలర్లు, ఐరన్‌బాక్సులు, సెల్‌ఫోన్ చార్జర్ వంటి విద్యుత్ గృహోపకరణాలు నిత్యావసరాలుగా మారాయి. పండగ ఆఫర్ల పేరుతో వ్యాపారులు చేస్తున్న హడావుడికి వినియోగదారులు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఏటా దీపావళి వరకూ జిల్లాలో విద్యుత్ గృహోపకరణాల కొనుగోళ్లు బాగుంటాయి. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తువులు, గృహోపకరాల ధరలు అందుబాటులో లేకపోవడంతో తక్కువ ధరలో ఏదో ఒకటి కొనాలన్న అభిప్రాయానికి మద్యతరగతి వినియోగదారులు వస్తున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రముఖ కంపెనీల అనుక రణ వస్తువులు మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ, పొన్నూరు, రేపల్లె పట్టణాల్లోని పలు షాపుల్లో వీటిని విక్రయించేందుకు కొందరు వ్యాపారులు హంగామా చేస్తున్నారు.
బాండెడ్ కంపెనీల పేరుతో ప్రచారం చేస్తూ నాసిరకం వస్తువులను విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో వీటి అమ్మకాలు జోరుగా సాగాయి. ముంబాయి తయారీ మిక్సీ రూ.1200 నుంచి రూ.1950 , హైదరాబాద్ తయారీ రూ.1600 నుంచి రూ.2 వేలకు లభ్యమవుతున్నాయి. సీలింగ్ ఫ్యాన్ ఫతేనగర్ (హైదరాబాద్) తయారీదైతే రూ.450 నుంచి రూ.600 వరకూ, వాటర్ హీటర్లు రూ.150 నుంచి ఆపైన, ఐరన్‌బాక్సులు, రూ.300 నుంచి రూ.600కు దొరుకుతున్నాయి.కొందరు వ్యాపారులు సెల్‌చార్జర్లు, ఇయర్ ఫోన్లు, మెమొరీ కార్డుల్ని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పండగ ఆఫర్లు ప్రకటించి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే కొటేషన్ కాపీనే బిల్లులా ఇస్తున్నారు. తక్కువ ధరకు కొన్న ఈ వస్తువులు పనిచేయడం ప్రారంభించిన వారం రోజులకే మూలన పడుతున్నాయి.
అర్థం కాని లోగోలు...
వినియోగదారులకు స్పష్టంగా అర్థం కాని లోగోలు, బ్రాండ్లను స్క్రీన్ ప్రింటింగ్‌తో తయారు చేస్తున్నారు. ప్రఖ్యాత కంపెనీల పేర్లకు కాస్త అటూ, ఇటుగా పేర్లు పెట్టి అందంగా ముద్రిస్తున్నారు. దుకాణంలో అడుగుపెట్టిన చదువుకున్న కొనుగోలుదారుడు కూడా వీటిని సరిగ్గా గుర్తించ లేక పోతున్నారు. గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన భూపతి ఓ షాపులో ఎగ్జాస్టర్ ఫ్యాన్ కొనుగోలు చేసి వారం రోజుల్లోనే పనిచేయక మూలన పడేశాడు. అరండల్‌పేట నాలుగో లైన్‌లోని ఓ షాప్‌లో కొన్న సెల్‌ఫోన్ రెండు రోజులకే పనిచేయడం మానేసింది. మిక్సీలు బాగు చేసే మెకానిక్‌లకు కుప్పలు తెప్పలుగా రిపేర్ ఆర్డర్లు రావడం అనుకరణ ఉత్పత్తుల చలవే.
పన్ను చెల్లింపులు నిల్లు..
ఈ తరహా వ్యాపారులు విద్యుత్ గృహోపకరణాలను విక్రయించేటపుడు సాధారణ అమ్మకం పన్ను చెల్లించకపోతుండటంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయాల నష్టం వస్తోంది. బిల్లు సౌకర్యం లేకపోవడంతో ఫోరం, కోర్టుల్ని ఆశ్రయించలేక వినియోగదారులు నష్టపోతున్నారు. అనధికార విక్రయాలను, నాసిరకం వస్తువుల్ని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిద్రావస్థలో జోగుతూ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
Advertisement
Advertisement