జయలలితతో కర్ణాటకకు కష్టాలు!
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డిఎంకె అధినేత్రి, పురచ్చితలైవి(విప్లవ వనిత) జయలలిత వల్ల కర్ణాటక ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో శాంతిభద్రతల సమస్య తలెత్తనుంది. దాంతో ఆమెను తమిళనాడు రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. ఆ తరువాత ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జయలలితను కర్ణాటక జైలులోనే కొనసాగిస్తే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ కర్ణాటక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక అందింది. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఆదివారం సమావేశమయ్యారు. జయలలితను చూసేందుకు నిత్యం పరప్పన అగ్రహార జైలు వద్దకు వేలాదిగా తమిళులు చేరుకుని ఏదో ఒకరూపంలో గొడవలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడ కూడా ఆమెకు బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను తమిళనాడులోని జైలుకు తరలించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం.
**