తీర్పుపై అనుమానాలు
కర్ణాటకపై విపక్షాల ఒత్తిడి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోఅన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిత్వాన్ని సవాలు చేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా అప్పీలు కోసం ఆరాటపడుతున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరం చేసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తాజా తీర్పుతో ఖంగుతిన్నాయి. ఇంత పెద్ద కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి. కాం గ్రెస్, డీఎంకే, పీఎంకే తదితర పార్టీలు ఏకంగా కోర్టు తీర్పునే అనుమానిస్తూ బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం ప్రారంభించాయి. జయపై వెలువడిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కర్నాటక ప్రభుత్వ న్యాయవాది పీవీ ఆచార్య సైతం అభిప్రాయపడుతున్న తరుణంలో రాష్ట్రంలోని విపక్షాల నేతలు వంత పాడుతున్నారు.అయితే అప్పీలు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రకటించారు.
అప్పీలు చేయాల్సిందే: కరుణ
జయ కేసులో సుప్రీం కోర్టులో అప్పీలు చేయాల్సిందేనని డీఎంకే అధినేత కరుణానిధి కర్నాటక ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జయ ఆస్తులను లెక్కకట్టిన తరువాతే న్యాయమూర్తి గున్హ తన తీర్పులో శిక్షను విధించారని అన్నారు. అయితే అవే ఆస్తులను తాజా తీర్పులో మరోలా లెక్కకట్టడాన్ని కరుణ తప్పుపట్టారు. తీర్పు సైతం ముందుగానే రాసిపెట్టుకుని చివరిరోజుల్లో కొన్ని మార్పులు చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సుప్రీంలో అప్పీలుతోనే సాధ్యమని కరుణ కర్ణాటక ప్రభుత్వానికి విన్నవించారు.
తీర్పుపై ఏమా అవసరం: ఇళంగోవన్
18 ఏళ్లపాటూ సాగిన కేసులో ప్రత్యేక కోర్టు చెప్పిన తీర్పుపై జయ చేసుకున్న అప్పీలును మూడునెలల్లోగా ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రశ్నించారు. అదే స్థాయిలో అత్యవసర తీర్పు ఎందుకని ఆయన అన్నారు. మరో ఆరు నెలలు సాగి ఉంటే వాస్తవాలు వెల్లడయ్యేవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుకు, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆకాశం, పాతాళంకు ఉన్న వ్యత్యాసం ఉన్నందున కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేయాలని ఆయన కోరారు.
సుప్రీంలో అప్పీలు చేస్తా: స్వామి
జయ తాజా తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తానని జయ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రధాన పిటిషన్ దారుడైన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సైతం మంగళవారం ప్రకటించారు. జయ ఆస్తుల విషయంలో తాజా తీర్పులో పేర్కొన్న లెక్కలు తప్పుల తడకలని ఆయన అన్నారు. తొందరపడి పీఠం ఎక్కితే ముఖ్యమంత్రిగా జయ మళ్లీ రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయమే తలదించుకునే తీర్పు: విజయకాంత్
ప్రజలకు సేవచేయడమే ప్రజాప్రతినిధి కర్తవ్యం అనే నీతి బోధను న్యాయమూర్తి గున్హ తన తీర్పులో బోధించారని డీఎండీకే అధినేత విజయకాంత్ అన్నారు. అయితే అదే కేసులో తాజాగా వెలువడిన తీర్పు ప్రజలను నిరంతర ఆవేదనకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఒకనీతి, ధన, రాజకీయ బలమున్నవారికి ఒకనీతా అని ప్రజల మనస్సులో ఆలోచనలను రేకెత్తించిందని ఆయన అన్నారు. న్యాయమే తలదించుకునేలా వెలువడిన తీర్పుకు కాలమే బదులుచెప్పగలదని ఆయన వ్యాఖ్యానించారు.
తీర్పుపై అనుమానాలు : రాందాస్
జయను నిర్దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి కుమారస్వామి చూపిన కారణాలు ఎంతమాత్రం హేతుబద్దంగా లేవని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు. తీర్పులో పేర్కొన్న అంశాలు సైతం అనుమానాలకు తావిస్తున్నందున కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని, సుప్రీం తీర్పు వెలువడే వరకు తాజా తీర్పుపై నిషేధం విధించాలని ఆయన కోరారు.
అప్పీలు ఉండదు : మదురై ఆధీనం
జయ కేసులో కర్నాటక ప్రభుత్వ అప్పీలుకు పోదని మదురై ఆధీనం స్వామి ధీమా వ్యక్తం చేశారు. మంచి నేతలను నిర్లక్ష్యం చేయడమో, బహిష్కరించడమో ఎంతమాత్రం కూడదని అనే భావనతోనే తీర్పుపై కర్నాటక మౌనం పాటిస్తున్నదని అన్నారు. తాజా తీర్పుపై కర్ణాటక అప్పీలుకు వెళ్లదు, వెళ్లలేదని న్యాయనిపుణుల అభిప్రాయమని స్వామి చెప్పారు.
అప్పీలుపై ఒత్తిడి
Published Wed, May 13 2015 3:31 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement