జయ బెయిల్పై శుక్రవారం వాదనలు
న్యూఢిల్లీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జయ బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం శుక్రవారం వాదనలు విననుంది. బెంగళూరు హైకోర్టు బెయిల్ నిరాకరించటంతో జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తోంది. జైలు ఆమెకు నాలుగేళ్లు జైలుతో పాటు వందకోట్ల జరిమానా విధించింది.
మరోవైపు జయలలితను సొంత రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఆమెకు సుప్రీంలో కూడా చుక్కెదురు అయితే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అధికారులు ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చెప్పినట్లు సమాచారం. దాంతో ఆమెను తమిళనాడు జైలుకు తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.