అమ్మ సీఎం అయ్యేనా? | dmk demand jaya case judgment Stay appeal on Supreme Court | Sakshi
Sakshi News home page

అమ్మ సీఎం అయ్యేనా?

Published Wed, May 13 2015 8:23 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

అమ్మ సీఎం అయ్యేనా? - Sakshi

అమ్మ సీఎం అయ్యేనా?

*అప్పీలుపై అన్నాడీఎంకేలో ఆందోళన
*17న సీఎంగా ప్రమాణ స్వీకారమని ప్రచారం
*అధికారికంగా నోరువిప్పని అన్నాడీఎంకే


కేసుల చిక్కుముడి వీడిపోయింది, ఇక అమ్మ ముఖ్యమంత్రి కావడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా తీర్పుపై స్టే విధించాలని, అప్పీలు చేయాలని విపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో అమ్మ సీఎం అయ్యేనా అని అనుమానిస్తున్నారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి:కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని భావించనవారు అప్పీలుకు పోవడం న్యాయవ్యవస్థలో సహజం. కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు జైలు శిక్ష విధించినపుడు హైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా బైటపడ్డారు. ఇపుడు అప్పీలు వ్యవహారం విపక్షాల వంతుకు వచ్చింది. జయ నిర్దోషిగా బైటపడితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న పార్టీలన్నీ అప్పీలు కోసం పట్టుపడుతున్నాయి. ఈ తరుణంలో తొందరపడి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టరాదని జయ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. తాజా తీర్పు వెలువడి రెండురోజులు గడిచినా అన్నాడీఎంకే నుంచి ఇంతవరకు ఒక్క అధికారిక ప్రకటన వెలువడక పోవడం వెనుక అప్పీలుపై ఆందోళనే కారణమని అంటున్నారు.

జయ కేసులో తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, కొందరు మంత్రులతో కలిసి జయ నివాసానికి వె ళ్లినా ఆమె నేరుగా మాట్లాడలేదనే సంగతి మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇంటి ప్రాంగణంలోని ఇంటర్‌కమ్ ఫోన్ ద్వారా మాత్రమే పన్నీర్ సెల్వం బృందాన్ని పలకరించి పంపివేసినట్లు నిర్ధారణగా తెలిసింది. వెంటనే సీఎం పీఠం ఎక్కేందుకు జయ సిద్ధంగా లేరని, అప్పీలుపై ఆందోళన చెందుతున్నారని ఈ సంఘటన వల్ల భావించాల్సి వస్తోంది. సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఉన్న తరుణంలో తొందరపడి సీఎం పీఠం ఎక్కి మరోసారి అవమానం పాలుకావాల్సి వస్తుందని జయ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పీలుపై కర్ణాటక ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన అనంతరమే సీఎం పగ్గాలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.

అనధికార సమాచారంతో ఉరకలు:
జయను సీఎంగా చూడాలని అన్నాడీఎంకే నేతలు అనధికార సమాచారంతో ఉరకలు వేస్తున్నారు. అనధికార సమాచారం ప్రకారం... ఈనెల 13వ తేదీన రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం అవుతారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ చెన్నై విడిచివెళ్లరాదని ఆదేశాలు ఆందాయి. 14వ తేదీన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసి ఇందుకు దారితీసిన కారణాలతో గవర్నర్‌ను కలుస్తారు.

అదేరోజు పార్టీ కార్యాలయంలో సమావేశమై శాసనసభాపక్ష నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ వివరాలను 14 లేదా 15 వ తేదీన గవర్నర్ కే రోశయ్యకు సమర్పించగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను గవర్నర్ ఆహ్వానిస్తారు. తమిళులు అత్యంత శుభదినంగా భావించే నిండు అమవాస్యరోజైన 17వ తేదీన ముఖ్యమంత్రిగా జయ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమెతోపాటూ మరో  30 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఆరునెలల్లోగా అమ్మ శాసనసభ్యురాలిగా గెలిచేందుకు శ్రీరంగం, ఆండిపట్టి, తిరుచెందూరు స్థానాలు ప్రచారంలో ఉన్నాయి.

వచ్చే ఏడాది 2016న సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆరునెలల్లో రెండుసార్లు ఎన్నిక ఎందుకని భావించి ముందస్తు ఎన్నికలకు జయ మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ఈ ఐదునెలల కాలంలో అత్యంత ఆకర్షణీయమైన కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న తరువాత జయ ప్రభుత్వాన్ని రద్దుచేయగలదని అంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రిగా జయ ఐదోసారి పదవీ ప్రమాణం చేయడం ద్వారా సీఎంగా డీఎంకే అధినేత కరుణానిధి సాధించిన రికార్డును సమం చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement