సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అమ్మ జయలలితకు ప్రత్యక్షంగా వారసులు ఎవరూ లేరని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోపు వేదనిలయాన్ని పూర్తిగా ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకుంటామన్నారు. వేద నిలయంలో రహస్య గదులు, అండర్ గ్రౌండ్‌లో ప్రత్యేక గదులు ఉన్నాయా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం నిరాకరించారు.
చెన్నై పోయెగార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక మందిరంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనం స్వాధీనానికి తగ్గ కసరత్తుల్ని చెన్నై జిల్లా కలెక్టర్ అన్భుసెల్వన్ చేపట్టారు. ఆయన నేతృత్వంలో ఇరవై మందితో కూడిన బృందం ఆ వేదనిలయంలో పరిశీలనలు జరుపుతూ వస్తున్నది. ఇప్పటికే ఆ భవనం, స్థలం వివరాలు, ఆస్తి విలువ లెక్కింపు తదితర ప్రక్రియలు ముగించారు. ఇక, ఆ నిలయంలోని రెండు గదుల్ని ఆదాయ పన్ను శాఖ వర్గాలు సీజ్ చేసి ఉండడంతో, అందులో ఏమున్నదోనన్న పరిశీలన సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఆ నిలయంలో పరిశీలన అనంతరం అన్భు సెల్వన్ మీడియాతో మాట్లాడారు.
జయలలిత ఆస్తులకు తామంటే తాము వారసులు అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అలాగే, తానే అమ్మ బిడ్డనంటూ బెంగళూరుకు చెందిన అమృత తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జయలలితకు ప్రత్యక్షంగా ఎలాంటి వారసులు లేరని కలెక్టర్ అన్భుసెల్వన్ స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలిత నివాసం విలువ లెక్కింపు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, ఆ భవనాన్ని పూర్తిగా ప్రభుత్వం గుప్పెట్లోకి నాలుగు నెలల్లోపు తీసుకుంటామన్నారు. ఆ తదుపరి స్మారక మందిరంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా అమ్మకు వారసులు ఎవరు లేరని, అయినా, తమ నిబంధనల మేరకు అన్ని ప్రక్రియలు ముగించినానంతరం పబ్లిక్ నోటీసు జారీ చేయడం జరుగుతుందన్నారు. అప్పుడు ఎవరైనా ఆక్షేపణ వ్యక్తం చేసినా, ఆధారాలతో వచ్చినా ఆ సమయంలో అందుకు తగ్గ నిర్ణయాలతో లెక్కింపుకు తగ్గట్టు వెల కట్టడం జరుగుతుందన్నారు.
ఆదాయ పన్ను శాఖ వర్గాలు తమకు సహకరిస్తామని చెప్పారని, ఆ రెండు గదుల్ని త్వరితగతిన తమకు అప్పగిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, పలు ప్రశ్నల్ని సంధించగా ఆయన దాట వేత ధోరణి అనుసించారు. చివరగా వేదనిలయంలో రహస్య గదులు ఉన్నట్టు, పాతాళంలోనూ గదులు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయే, వాటిని చూశారా అని ప్రశ్నించగా కాస్త తడబాటు అనంతరం ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment