అమ్మకు బెయిల్ ఎందుకు రాలేదు?
ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ఆమెకు షరతులతో కూడిన బెయిలిచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. బెయిల్ ఇస్తే తన క్లయింటు దేశం విడిచి వెళ్లిపోరని, సాక్షులను ప్రభావితం చేయరని దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన రాం జెఠ్మలానీ బల్లగుద్ది మరీ వాదించారు. అయినా.. అమ్మకు బెయిల్ రాలేదు. అసలు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కారణాలే ఏమీ లేవని ఈ కేసు విచారించిన జస్టిస్ ఎ.వి. చంద్రశేఖర స్పష్టం చేశారు. అవినీతి అనేది మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని, దానివల్ల ఆర్థిక సమతౌల్యం దెబ్బతింటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, గతంలో గడ్డిస్కాంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రాం జెఠ్మలానీ గుర్తు చేశారు. కానీ జడ్జి మాత్రం.. అలా బెయిల్ రావడానికి ముందు పది నెలల పాటు లాలూ జైల్లోనే ఉన్నారు కదా అని న్యాయమూర్తి ఆయనకు దీటుగా సమాధానమిచ్చారు. అవినీతి కేసులు త్వరితగతిన విచారించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని కూడా జస్టిస్ చంద్రశేఖర అన్నారు. అవినీతి అనేది సమాజానికి వ్యతిరేకమని కూడా సుప్రీంకోర్టు 2012లో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.