
నీటికోసం హాస్టల్ విద్యార్థుల పాట్లు
కుల్కచర్ల: మండల కేంద్రంలోని గిరిజన వసతిగృహంలో నీళ్లు లేక విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేవగానే కాలకృత్యాలకు, స్నానాలకు, బట్టలు ఉతుక్కోవడానికి నీళ్లు అవసరం. హాస్టల్‌లోని బోరు ఎండిపోయినా వార్డెన్ పట్టంచుకోవడం లేదు. దీంతో ఉదయం లేవగానే విద్యార్థులు బకెట్ పట్టుకుని ఎక్కడ బోర్‌వెల్‌లో నీరు కనిపిస్తే అక్కడికి పరుగులు తీస్తున్నారు. అక్కడ క్యూలైన్‌లో నిలబడి బకెట్‌తో నీళ్లు తెచ్చుకుంటున్నారు. కుల్కచర్ల గిరిజన వసతిగృహంలో 4 నుంచి 10 వ తరగతి వరకు 300 మంది విద్యార్ధులు ఉండి చదువుకుంటున్నారు. వసతిగృహంలో నీళ్లు లేకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. ప్రతిరోజు చేతిపంపు దగ్గర నీటికోసం ఆ హాస్టల్ విద్యార్థులే కనిపిస్తున్నారు. చాలామంది విద్యార్ధులు వారానికోసారి ఇంటికి వెళ్లి ఒకేసారి దస్తులు శుభ్రం చేసుకొని వస్తున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతిగృహంలో నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.