
ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడు. ఆయనకు విపరీతమైన కోపం. ప్రతిదానికీ ఇంట్లోవాళ్ల మీదా, బయటివాళ్ల మీదా అరిచేవాడు. ఈ కోపగొండి స్వభావం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఒక స్నేహితుడి సలహా మీద, ఒక ఊళ్లో ఒక గురువును సంప్రదించడానికి వెళ్లాడు. గురువు శాంతంగా కూర్చునివున్నాడు. చేతులు జోడించి నమస్కరించి, ‘గురూజీ, నన్ను నేను నియంత్రించుకోలేనంత కోపం వస్తుంటుంది నాకు. అది తగ్గడానికి ఏమైనా పరిష్కారం సూచించండి’ అని అడిగాడు. గురువు ఎంతో మృదువుగా, ‘నీ సమస్య విచిత్రంగా ఉన్నదే! ఏదీ, నన్నో సారి చూడనీ’ అన్నాడు.
అతడికి అర్థం కాలేదు. అయోమయంగా ముఖం పెట్టి, ‘అంటే నేను దాన్ని ఇప్పుడు మీకు చూపలేను’ అని చెప్పాడు. ‘మరి నాకు ఎప్పుడు చూపగలుగుతావు?’ అడిగాడు గురువు అంతే మెత్తగా. ఆయన ముఖంలో ఏ వ్యంగ్యమూ లేదు. ‘అంటే... అది నాకు అనూహ్యంగా వస్తుంది’ అన్నాడతను. ‘ఊహూ. అట్లా అయితే అది నీ అసలైన స్వభావం కాదన్నమాట’ వివరించే ధోరణిలో చెప్పాడు గురువు. ‘అది నీ అసలైన స్వభావమే అయితే నాకు ఎప్పుడంటే అప్పుడు చూపగలిగేవాడివి. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు అది నీ దగ్గర లేదు. దీని గురించి ఆలోచించు’.
Comments
Please login to add a commentAdd a comment