
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది.
తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు.
ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రికమండేషన్‌తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్‌రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్‌తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి.
చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు.
కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది.