సాక్షి, జనగామ: ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆపద మొక్కుల మాదిరిగా కొందరు ఏదేదో చెబుతారు.వాళ్ళ మాటలు నమ్మితే మోసపోయి గోస పడుతాం. ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం ఓటు అని.. అందుకే ఆలోచించి ఓటేయాలని జనగామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
‘‘జనగామలో ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉండేవి. గతంలో కరెంట్ కోతలు తప్ప ఏం ఉండేది కాదు. కరువుతో అల్లాడుతున్నామని చెబుతుంటే నాకు దుఃఖం ఆగలేదు. అప్పటి పరిస్థితి చూసి బచ్చన్నపేటలో ఏడ్చాను. తెలంగాణలో గులాబీ జెండా ఎగరగానే.. దేవాదులకు శంకుస్థాపన చేసి చంద్రబాబు మోసం చేశారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు నాలుగు నెలలు మథనం చేశాం. ఆర్థిక పరిస్థితిపై చర్చలు చేశాం.
ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది?. కరెంట్ కష్టాలు లేవు. నీటి కొరత లేదు. పుట్లకొద్ది పంటలు పండుతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా.. జనగామలో మాత్రం రాదు. పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే ప్రాంతం జనగామనే. రాష్ట్రం ఏర్పడ్డాక.. భువనగిరి, జనగామలు గ్రోత్‌కారిడార్లు అయ్యాయి. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి అని ప్రసంగించారు కేసీఆర్.
భూమిపై హక్కులు రైతులకే ఉండాలి. రైతుల బాధలు నాకు తెలుసు. అందుకే భూములపై అధికారుల అధికారం తొలగించాం. మీ భూమి మీద అధికారం మీకే(రైతుల్ని ఉద్దేశించి..) ఇచ్చాం. నా ప్రాణం పోయినా సరే అది మారనివ్వను. ధరణిని తీసి కాంగ్రెస్ వాళ్లు బంగాళాఖాతలో కలిపేస్తారట. ధరణిని కాదు.. కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. వీఆర్‌ఏలు వస్తారు. మళ్లీ ఆగం అవుతారు. వ్యవసాయానికి కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తారట. 24 కరెంట్ కొనసాగాలంటే.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి అని ప్రజలను కోరారాయన.
ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించేవారిని నమొద్దు. ఓటు మన తలరాత మారుస్తుంది.. ఆలోచించి ఓటు వేయండి. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించి ఓటేయండి. వందకు వంద శాతం జనగామ అభివృద్ధి జరిగి తీరుతుంది. జనగామ లో ఏం జరగాలనుకున్నామో.. అవన్నీ జరుగుతాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా.. అన్ని పనులు చేస్తాం అని జనగామ సభకు హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి కేసీఆర్ కోరారు.
తన ప్రసంగానికి ముందు.. ముందు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్. పొన్నాలతో పాటు పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఎమ్మెల్యే కాకముందే సమస్యలను ప్రస్తావించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్.. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారుగా ఉన్నాడు అనుకున్నా... ఇంత హుషారు అనుకోలేదు. పల్లా కంటే ముత్తిరెడ్డే నయం.చిన్న చిన్న ఇబ్బందులతో ముత్తిరెడ్డి కి బదులు పల్లా ను ఎన్నికల బరిలో నిలిపాం. ఎన్నికల ముందే పల్లా చాటబారతం అంత లిస్టు ఇచ్చిండు అని కేసీఆర్ చమత్కరించారు. అయితే.. అవన్నీ నెరవేర్చదగ్గ హామీలేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. హామీలన్నీ నెరవేరుస్తామని, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని సీఎం కేసీఆర్ సభా వేదికగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment