ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అప్పుడే ‘పానీ’పట్టు యుద్ధాలు మొదలయ్యూరుు. తాగునీటి కోసం జనాలు అల్లాడాల్సి వస్తోంది. గుక్కెడు నీటి కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేపట్టక తప్పటం లేదు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం..రిజర్వాయర్లు అడుగంటడం..కిన్నెరసాని, పాలేరు తదితర జలాశయూలు నిండుకోవడంతో పల్లెలు దాహంతో కొట్టుమిట్టాడుతున్నారుు. టేకులపల్లి మండలం సులానగర్ , బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామస్తులు దాహార్తి తీర్చుకోవడం కోసం ఆందోళనబాట పట్టారు. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటి జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానించినా.. కలెక్టర్ ఇలంబరితి ఆదేశాలు జారీ చేసినా ప్రజల క‘న్నీటి’ని తూడ్చడంలో మాత్రం నిర్లక్ష్యం వెంటాడుతూనే ఉంది.
ఖరీఫ్, ఈ రబీలో వర్షాభావం.. రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోతుండటం.. జిల్లాలో ఈ వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంటోంది. ప్రధాన రిజర్వాయర్లు అడుగంటుతుండటంతో మంచినీటికి ఇబ్బందులు తప్పట్లేదు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పాలేరు, వైరా రిజర్వాయర్లను సాగర్ జలాలతో నింపాల్సి ఉంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు మంచినీరు అందించే కిన్నెరసానికి అవుట్ ప్లో ఎక్కువగా లేకపోవడం.. ఈ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చనుంది.
వెయ్యికి పైగా నివాస ప్రాంతాల్లో దాహం.. దాహం..
జిల్లాలో 41 మండలాల్లో 2,671 నివాస ప్రాంతాలకు 1,637 ఆవాసాలకు మాత్రమే మంచినీరు అందుతుంది. 1,030 ఆవాసాల్లో మంచినీటి ఇబ్బందులు ఉన్నాయి. జిల్లాలో చేతి పంపులు 19,663 ఉండగా నేరుగా మంచినీటి సరఫరా చేసే పథకాలు 718 ఉన్నాయి. చిన్న తరహా మంచి నీటి పథకాలు 364, రక్షిత మంచినీటి పథకాలు 1,335, సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలు 24 ఉన్నాయి. ఇన్ని ఉన్నా వర్షాభావ పరిస్థితులతో చేతి పంపులు ఎండిపోవడం, వాగుల్లో నీరు లేకపోవడంతో మంచినీటి పథకాలు వట్టిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచినీటి బోర్లు ఇప్పటికే నీళ్లు లేక ఎండిపోయాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 449 బోర్లు నిరుపయోగంగా ఉన్నట్లు గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నీటి వనరులు ఉన్న చోట పైపులైన్ల లికేజీలకు కొన్నేళ్లుగా మరమ్మతులు లేవు.
ఈ నేపథ్యంలో ఈనెల 17 నుంచి ఆయా శాఖ అధికారులు జిల్లాలో క్రాష్ ప్రోగ్రామ్ ( తక్కువ కాలంలో వేగంగా మరమ్మతులు)ను తీసుకున్నారు. మరమ్మతులు వెంటనే చేస్తేనే ఉన్న నీటి వనరుల ద్వారా ఏజెన్సీలోని గిరిజనులకు గుక్కెడు నీళ్లు అందనున్నాయి. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ముందే తీసుకోవాల్సిన ఉన్నా అధికారులు ఈనెలలోనే ప్రారంభించడంపై విమర్శలు వస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం నగరానికి, వైరా రిజర్వాయర్ నుంచి బోడేపూడి సుజల స్రవంతి పథకం ద్వారా 70 గ్రామాలకు, కిన్నెరసాని ద్వారా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు మంచినీటి అందిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం ఈ రిజర్వాయర్లలో ఆశించిన స్థాయిలో నీటి మట్టం లేదు. దీంతో మంచినీటి ఎద్దడిని తలుచుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
‘గూడెం’..పాల్వంచలోకటకట.. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్ట క్రమేణా తగ్గుతోంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి కూడా నేటికి పూడికతీతపై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దృష్టి సారించక పోవడంతో పాటు వర్షాభావంతో నీటి నిల్వల స్థాయి పడిపోతోంది. రిజర్వాయర్ నీటిమట్టం స్థాయి పైకి కనిపిస్తున్నప్పటికీ అడుగున భారీ స్థాయిలో మట్టి, ఇసుక పేరుకు పోయి ప్రాజెక్టు నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గి ప్రాజెక్టుపై ఆధారపడే కర్మాగారాలైన కేటీపీఎస్, నవభారత్, ఎన్‌ఎండీసీ కర్మాగారాలకు నీటి సరఫరా సరిపోని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలకు ఈ నీరే జీవనాధారం. పాల్వంచ మున్సిపాలిటీ, మండల పరిధిలోని గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. కరకవాగు, గాజులగూడెంకు ఇటీవల మంచినీటి పైపులైన్లు వేసినా కూడా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా శేఖరంబంజర, మంచికంటి నగర్, పాలకోయతండా, పేటచెరువు, పిల్లవాగు, కుంటినాగులగూడెం, గుడిపాడు, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, వనమా కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రిజర్వాయర్ సామర్ధ్యం 407 అడుగులు. ప్రస్తుత సామర్థ్యం 387 అడుగులు. కొత్తగూడెంలో కూడా శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా కావడం లేదు. పైపులైన్లకు మరమ్మతులు లేకపోవడంతో వచ్చే నీరు కూడా వృథాగా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగూడెం పట్టణం అంతా నాలుగు రోజులకోసారి కిన్నెరసాని నీటిని విడుదల చేస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
వైరాలో రెండు రోజులకోసారి..
వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.4 అడుగులు ప్రస్తుతం రిజర్వాయర్‌లో 7 అడుగుల మేర నీరు ఉన్నది. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 23 వేల ఎకరాల సాగులో పలు పంటలను రైతులు సాగు చేశారు. రిజర్వాయర్ నుంచి 6 మండలాలకు బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం ద్వారా వైరా, కొణిజర్ల, తల్లాడ, ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల పరిధిలో 70 గ్రామాలకు ప్రతి రోజు కోటి లీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకున్నా ముందుగా పైపులైన్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైరాలో మాత్రం రెండు రోజులకు ఓసారి తాగునీటిని విడుదల చేస్తున్నారు. గ్రామాలకు వెళ్ళే పైపులైన్లు లీకేజిలు ఉండటంతో పూర్తి స్థాయిలో తాగునీరు అందే అవకాశం లేదు.
ఖమ్మం నగరానికి పొంచి ఉన్న ప్రమాదం..
పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 16.80 అడుగులు. రిజర్వాయర్‌కు నాగార్జున సాగర్ నుండి తక్కువ నీరు రావటం, రిజర్వాయర్ నుండి రెండోజోన్ పరిధి, పాలేరు కాలువ పరిధిలో పంటలకు సాగునీటి కోసం 5400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటంతో రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుంది. వేసవి రావడంతో ఖమ్మం నగర ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీటిని అందించాల్సి ఉంది. పాలేరు నీటిని ఆ నియోజకవర్గంలోని 150 గ్రామాలకు తాగునీటికోసం సరఫరా చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి సరఫరా పెంచకపోతే 15 రోజుల్లో రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిగా తగ్గే ప్రమాదం ఉంది. రిజర్వాయర్‌ను పూర్తిగా నింపకపోతే వచ్చే వేసవిలో ప్రధానంగా ఖమ్మం నగరానికి మంచినీరు అందదు.