వైరా: గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాపై పట్టింపు కరువైంది. కుళాయిల ద్వారా స్వచ్ఛ జలాన్ని అందించాల్సి ఉండగా.. పైపులైన్ల లీకేజీలు, క్లోరినేషన్‌పై పర్యవేక్షణ లేకుండాపోయింది. తరచూ లీకేజీలతో మురుగు, వ్యర్థ జలాలు పైపులైన్లలోకి చేరి.. అవే సరఫరా అవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్నిచోట్ల పైపులైన్ల వద్ద నిలిచిన మురికి నీటిని చూస్తే.. మనం తాగేది ఈ జలాలేనా..? అని ఒళ్లు జలదరించాల్సిన పరిస్థితి నెలకొంది.
నీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కిట్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మూలన పడ్డాయి. గ్రామీణ ప్రజలందరికీ రక్షిత తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో 2009లో అప్పటి ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి తాగునీటిని పరీక్షించే నీటికిట్లను పంపిణీ చేసింది. ఒక్కో కిట్టుకు రూ.3వేలు వెచ్చించింది. 2011–15 వరకు నాలుగు దశల్లో సర్పంచ్‌లతోపాటు కార్యదర్శులకు, వాటర్‌మెన్లకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇప్చించారు. కానీ.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక, వీటిని ఉపయోగించడం పై పూర్తిస్థాయి అవగాహన లేక నిరుపయోగంగా మారాయి.
నీటి సరఫరా అస్తవ్యస్తం..
గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు లేవు. పైపులైన్లు, గేట్‌వాల్వ్‌లు లీకేజీ అ యినప్పుడు వ్యర్థ జలాలు పైపులైన్లలోకి చేరుతున్నాయి. మినరల్ వాటర్ కొనలేని వారు.. ఈ జలాలనే తాగాల్సి వస్తోంది. నీటి ట్యాం కుల్లో పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పొడి వేసి చేతులు దులుపుకుంటున్నారు. తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే ఆ నీటి ని తాగడానికి ఉపయోగించొద్దు.
నీటిని పరీక్షిస్తేనే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎంతుందో తెలుస్తుంది. వర్షాకాలంలో నీరు అధికంగా కలుషితమయ్యే అవకాశాలు ఉన్నందున రక్షణ చర్యలు చేపట్టి, సురక్షిత తాగు నీటిని ప్రజలకు అందించాల్సి ఉంది. ఈ విషయంలో అ«ధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఎనిమిది రకాల పరీక్షలు..
గ్రామాల్లోని చేతి పంపులు, వాటర్ ట్యాంకుల్లోని నీటి నమూనాను సేకరించి కలుషితాన్ని గుర్తించేందకు నీటి పరీక్ష కిట్లు ఉపయోగపడతాయి. ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, పీహెచ్, టోటల్ ఆల్కానిటీ టెస్టులతోపాటు సుమారు ఎనిమిది రకాల పరీక్షలు చేసి ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలి.
కొన్నిసార్లు నీళ్లు తాగలేం..
కొన్నిసార్లు పంపుల నీళ్లు బాగా మురికిగా వస్తుంటాయి. ఎంత జల్లెడ పట్టినా.. మట్టి పేరుకుపోతోంది. నలకలు బాగా వస్తున్నాయి. చిన్న పిల్లలు తాగితే.. ఏమైనా అవుతుందని భయపడుతున్నాం. – ఎస్.సుభద్ర, దాచాపురం, వైరా మండలం
అధికారులు స్పందించాలి..
గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతోంది. ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తక్షణమే అధికారులు స్పందించాలి. – కంకణాల అర్జున్‌రావు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment