వజ్రాల బేహారి | Funday story world in this week | Sakshi
Sakshi News home page

వజ్రాల బేహారి

Published Sun, Sep 9 2018 12:46 AM | Last Updated on Sun, Sep 9 2018 12:46 AM

Funday story world in this week - Sakshi

ఒక ముఖ్యమైన వ్యవహారం– ఆ రాత్రి నన్ను చాన్సరీ లేన్‌ వద్ద వుండేలా చేసింది. కొంచెం తలనొప్పిగా కూడా ఉండటం వల్ల ఇతరత్రా ఏ పనిమీదా మనసు పోలేదు.     ఆ రోజు ఆకాశం నిర్మలంగా, మనోజ్ఞంగా ఉంది. నది గట్టు వైపు అడుగులేశాను. నల్లని నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్న దీపాల తళుకులు– వాటర్లూ వంతెన ఆర్చి కన్నా ఎత్తులో కనిపిస్తూ– తీరం హద్దునుచూపిస్తున్నాయి. కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ, వేడెక్కిన మెదడును చల్లార్చుకో సాగాను.   ‘ఈ  రాత్రి వెచ్చగా వుంది కదూ?’ ఎవరిదో కంఠస్వరం వినబడితే అటు చూశాను ఒక బక్కపల్చటి వ్యక్తి పిట్టగోడ నానుకొని నిల్చున్నాడు. అతని ముఖం దీనాతిదీనంగా, కళావిహీనంగా వుంది. మాసిపోయిన అతని కోటు కాలరు పైకి లేచి వుండి, గొంతు చుట్టూ బిగించబడి వుంది. అతడు ధరించిన దుస్తులు పేదరికానికి ప్రతీకగా ఉన్నాయి. కుతూహలంగా చూశానతని వైపు. అతనికి నాతో ఏం పని? డబ్బు యాచించడానికా? లేక తన దీన చరిత్ర వినిపించడానికా? నుదురు, కళ్లు అతడు తెలివైన వాడని తెలియజేస్తున్నాయి. ‘అవును.’ అని సమాధానమిచ్చాను.
 
‘మానసిక విశ్రాంతి పొందాలంటే లండన్‌కు మించిన ప్రదేశం మరొకటి ఉండదు. రోజంతా వ్యాపార వ్యవహారాలతో అలసిన గుండెల్ని సేదతీర్చడానికి, బాధ్యతలను ఒకసారి సింహావలోకనం చేసుకోవడానికి ఇంతకంటే అనువైన చోటు మరెక్కడుంటుందో నాకు తెలియదు’ అన్నాడు. వాక్యానికీ వాక్యానికీ మధ్య దీర్ఘ విరామమిచ్చి మాట్లాడాడు. ‘మీరు, ఈ భూప్రపంచంలో తినడానికి కూడా తిండి దొరకని అభాగ్య వ్యధిత జీవితాల గురించి, ఒక్క పెన్నీ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి వెనుదీయని మనుషుల గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరముంది. లేకుంటే మీరు ఈ లోకంలో అనామకునిగా మిగిలిపోతారు. నాలాగే తల చెడుపుకొని, మానసికంగా విసిగి వేసారి, ఎన్నో కష్టాలు పడిన వ్యక్తిగా నాకనిపించడం లేదు మీరు. ఈ మానవ సమాజం– డబ్బు, పేరు ప్రతిష్టలు, సంఘంలో పలుకుబడి, హోదాల మీద ఆధారపడి– మనుగడ సాగిస్తూ ఉన్నది. ఎవరికి  తగిన వృత్తిలోకి వారు దిగిపోవడం మంచిదని చాలామంది అభిప్రాయం... కానీ నా అభిప్రాయాలూ, ఆశయాలు భిన్నమైనవి. నాకు నేను నిర్దేశించుకున్న జీవిత లక్ష్యాలు సంక్లిష్టతతో కూడుకున్నవి.  ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి గడించుకోవాలనే వాంఛ, ప్రగాఢంగా వుంది నాలో. కానీ నా జీవిత చరమాంకంలో మిగిలేది  నిరాశా నిస్పృహలు, పశ్చాతాపంతో కరిగిపోయిన నా ఈ శరీరం, వ్యధిత హృదయం తప్ప మరేమీ మిగలదేమోననిపిస్తుంది.’’ అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. నేనెప్పుడైనా నా జీవితంలో ఒక అత్యంత నికృష్ట నిరాశా జీవిని చూసి వుండటం గాని జరిగి వుంటే– ఇదుగో నా ముందు నిలుచున్నటువంటి దీన వదనుడే అయివుంటాడు. నేను బిగ్గరగా నవ్వేశాను.‘మీకు అన్ని విషయాలూ చెప్పడమే మంచిది. ఇటువంటివి ఇతరులకు చెప్పుకోవడంలో ఎంతో మానసిక సుఖముంది. అందునా మీ వంటి వారితో. నిజం చెప్పాలంటే నా వద్ద  ఒక పెద్ద వ్యాపారానికి సంబంధించిన వ్యవహారమే ఉంది. మీరూహించనంత భారీ వ్యాపారం. కానీ అందులో లెక్కలేనన్ని చిక్కులు, ఇబ్బందులు ఉన్నాయి. ఇంతదాకా వచ్చి అసలు విషయం చెప్పకపోతే ఎలా? ఎన్నో కష్టాలు పడి,  నా ఈ  చేతులతో స్వయంగా తయారు చేసినట్టి ఖరీదైన వజ్రాలున్నాయి నా వద్ద.. ’ వజ్రాలు అనే మాటను నొక్కి పలుకుతూ. ‘ఓహో! నీకిప్పుడేమీ పనీ పాటా లేనట్లుంది. అందుకే అలా మాట్లాడుతున్నావు. అవునా?‘ అన్నాను.

‘మీ వెటకారపు మాటలు నా మనసును గాయపరుస్తున్నాయి’ అని అసహనం వ్యక్తపరుస్తూ అకస్మాత్తుగా, మురికితో అట్టలు కట్టివున్న అతని కోటు గుండీలు టకాటకా విప్పాడు. ఒక దారం ఆధారంగా అతని మెడలో వేలాడుతున్న కాన్వాసు సంచిని బయటికి  తీశాడు. ఆ సంచిలోంచి ఒక గోధుమరంగులో వున్న గులకరాయిలాంటి వస్తువు నా చేతికిచ్చి...    ‘నేను భౌతిక శాస్త్రం, ఖనిజ శాస్త్రాలలో కొంచెం ప్రావీణ్యం సంపాదించాను. మీ చేతిలో వున్న గులకరాయివంటి వస్తువు ఏమిటో గుర్తించారా?... శాస్త్రీయ పద్ధతిలో, ఒక నిర్దుష్ట క్రమాన్ననుసరించి  తయారు చేసిన గోధుమరంగు షట్భుజ వజ్రం సార్‌! అతి ఖరీదైన వజ్రం!’ అని  చెప్పాడు. అది రమారమి నా బొటనవేలి అగ్రభాగమంత వుంది. వెనక్కి వంపులు తిరిగిన ఉపరితల ముఖాలతో, సహజసిధ్ధమైన షడ్భుజవజ్రం లాగానే ఉంది. నా జేబులోనుండి చిన్న కత్తి తీసుకొని దానిమీద గట్టిగా  గీరాను. ఒక్క గీతకూడా పడలేదు. నా చేతి గడియారం అద్దం మీద కూడా అలాంటి పరీక్ష చేశాను. ఆశ్చర్యంతో, నమ్మలేనట్లు అతని వంక చూశాను. అది వజ్రమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  ‘‘ఎక్కడి నుండి వచ్చింది నీకిది?‘ అడిగాన్నేను.  ‘నేనే తయారుచేశాను. దయచేసి దాన్ని నాకు వాపసిచ్ఛేయండి’ అన్నాడు.అతను ఆత్రంగా అందుకొని దాన్ని యథాస్థానంలో ఉంచి, జాకెట్‌ గుండీలను బిగించాడు. ‘నేను మీకు ఈ వజ్రాన్ని వంద పౌండ్లకు అమ్ముతాను..’ అతను వెంటనే ఆశగా గొణిగాడు.  ఆ మాటలతో నాలో మళ్ళీ అనుమానం తలెత్తింది... ఒకవేళ అది నిజంగా వజ్రమే అయివుంటే, కేవలం వంద పౌండ్లకెందుకమ్మజూపుతాడు? ఇద్దరం ఒకరి కళ్ళలోనికొకరు చూసుకొన్నాం.  

అతని ముఖంలో ఆత్రుత కనిపిస్తూ వుంది. ఆ ఆత్రుత వెనుకనున్న నిజాయితీని పసిగట్టగలిగాను. మొదట అనుమానపడినా, బాగా ఆలోచిస్తే అది అచ్చమైన వజ్రమే అని నమ్మకం కుదిరింది. పైగా ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త హెన్రీ మొయిసన్‌ తయారు చేసిన వజ్రాల గురించి నాకు కొంత తెలుసు. కానీ అవి పరిమాణంపరంగా మరీ చిన్నవి. నేను పెద్ద ధనికుణ్ణి కాను. వంద పౌండ్లు నా మొత్తం ఆదాయంలో పూడ్చలేని లోటు. పైగా వివేకవంతుడెవరూ ఆ గుడ్డివెలుతురులో,  గబ్బువాసన గొట్టే బికారిని నమ్మి, అతని వద్ద నుంచి వజ్రాన్ని కొనుగోలుచేయడు. అది అత్యంత ఖరీదైన వజ్రం. నేను తల పంకించాను. ‘మీకు ఇలాంటి విషయాలలో ఏదో కొంత అవగాహన ఉన్నట్టుంది. అందుకే నన్ను గురించి ఇంకా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. అందువలన మంచి బేరం కుదరడానికి అవకాశముంటుంది.’ అంటూ నది వైపుగా అతని వీపు తిప్పి, ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని ఒక దీర్ఘనిశ్వాసం  వదిలాడు.

‘నా పట్ల వున్న అనుమానం తొలగి, మీకు నాపై విశ్వసనీయత పాదుకొల్పాలంటే, వజ్రాలను ఏ విధంగా తయారు చేశానో మీకు చెప్పడం మంచిది’అలా మాట్లాడుతున్నప్పుడు ఇదివరకటిలా కాకుండా, అతని కంఠస్వరములో– కొంచెం సున్నితత్వం, సరళత, చదువుకున్న వాడి తరహా సంతరించుకొన్నాయి.  ‘మామూలు బొగ్గును తగినటువంటి రసాయన ద్రావణంలో ముంచి ఉద్గారాలను వేరుచేయాలి.అవసరమైనంత మేరకు వేడిచేసి, తగిన ఒత్తిడి కలిగించాలి. అప్పుడవి చిన్నచిన్న వజ్రాలుగా మారతాయి. ఎంతోమంది రసాయన శాస్త్రజ్ఞులు ఏళ్లపర్యంతం కృషి చేసి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా కచ్చితమైన నిష్పత్తిలో, నిర్దిష్టమైన ద్రావణంతో కలిపి, కచ్చితమైన ఉష్ణ ఒత్తిడిని కలిగించి బొగ్గును కరిగించలేక పోయారు. ఫలితంగా అతి చిన్న వజ్రాలు మాత్రమే ఉత్పత్తయ్యాయి. అవి సాధారణ ఆభరణాలపాటి విలువకూడా  చేయలేదు.  నేను ఈ  సమస్య పరిష్కారం కోసం అవిరామ కృషి చేశాను.  ఆఖరి రక్తపు బొట్టును సైతం ధారపోశాను. కచ్చితమైన విధానాన్ని అనుసరించి వజ్రాలు తయారుచేసే స్థాయికి చేరుకునేటప్పటికి నా వయస్సు పదిహేడు. ప్రస్తుతం నాకు ముప్పై రెండు. దాదాపు రెండు దశాబ్దాల నిర్విరామ కృషి, శక్తి సామర్థ్యాలను నా ఈ ఆశయ సాధన కోసమే వినియోగించాను. ఈ తంత్రాన్ని సరియైన పద్ధతిలో ఉపయోగించగలిగితే కోటాను కోట్ల విలువైన వజ్రాలను ఉత్పత్తి చేయవచ్చు’ అతని కళ్ళు నా వంక ఆకలితో చూస్తున్నాయి. అతను తిరిగి చెప్పసాగాడు. 

‘నేను ఇరవైఒకటో పడిలో ఉండగా నా వద్ద వెయ్యి పౌండ్లు వుండేవి. ఆ డబ్బుతో నా పరిశోధన సాగించాను.  ముఖ్యంగా బెర్లిన్‌ లో ఒకటి రెండు సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాను. ఆ తర్వాత సొంతగా చదువుకున్నాను. నా పరిశోధనల రహస్యాన్ని బయటికి పొక్కకుండా చూసుకోవడం నా శక్తికి మించిన పనైంది. ఈ విషయం మరెవరికైనా తెలిసిందంటే వారు కూడా కృత్రిమ పద్ధతుల ద్వారా వజ్రాలు చేయడం మొదలు పెడతారు. అప్పుడు వజ్రాలు విలువలేని బొగ్గు ముక్కల్లాగా పరిగణించబడతాయి. అందుకని ఒంటరిగానే నేనీ పని చేయడం తప్పనిసరైంది. మొదట్లో నాకొక చిన్న లాబరేటరీ ఉండేది. నా ప్రయోగాలన్నీ కేంటీస్‌ నగరంలో సర్వవిధాల అసౌకర్యంగా ఉన్న గదిలోనే  నిర్వహించుకొన్నాను. నేనక్కడే ఎండుగడ్డి చాపపైన, నేలమీద, ప్రయోగశాల పరికరాల మధ్యనే నిద్రపోయేవాడిని. ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది. నా దౌర్భాగ్యస్థితిని తలచుకొని నన్ను నేను అమితంగా అసహ్యించుకొనేవాడిని. సైన్సు సబ్జక్ట్‌ బోధించి అంతో ఇంతో డబ్బు ఇబ్బంది తొలగించుకుందామనుకొంటే  నాకు యూనివర్సిటీ డిగ్రీలు లేవు. సైన్సు పాఠాలు బోధించే సమర్థత నాకు లేదు. కెమిస్ట్రీ చదువుకున్నాను తప్ప ఇతరత్రా విద్యార్హతలు లేవు. అన్నింటినీ మించి అతి తక్కువ డబ్బుకోసం విలువైన నా సమయాన్ని, శ్రమను వృథా పరుచుకోవడానికి నా మనసు అంగీకరించలేదు’‘మూడేండ్ల క్రితం, లోహాల్ని కరిగించి మిశ్రమాన్ని రూపొందించే ప్రక్రియకు సంబంధించిన ముఖ్య సమస్యను పరిష్కరించగలిగాను. తుపాకీ గొట్టంలోనికి లోహమిశ్రమాన్ని బొగ్గుతో సమ్మిళితంచేసి, దట్టించి కూరాను. తరువాత అందులో నీళ్లు పోసి, గట్టిగా మూత బిగించి, తగిన స్థాయిలో వేడిచేశాను. అది పేలిపోయింది. నా గది కిటికీలను, ప్రయోగ సంబంధిత పరికరాలను చాలామేరకు ధ్వంసం చేసేసిందా పేలుడు. ఏదేమైనా, కొంచెం వజ్రపుపొడి లభించింది. ఆ సమస్య ద్వారా గడించిన అనుభవాన్ని పురస్కరించుకొని, ప్యారీస్‌ ల్యాబరేటరీస్‌లో డ్యాబ్రిస్‌ అనే రసాయన శాస్త్రజ్ఞుడు తయారుచేసిన  పొడుల గురించి చేసిన పరిశోధనలను అధ్యయనం చేశాను. డ్యాబ్రిస్‌– పకడ్బందీగా స్క్రూలతో బిగించబడి, అంత సులభంగా పేలని అత్యంత బలిష్టమైన స్టీల్‌ సిలిండర్‌ లోపల డైనమైట్‌ ను పెట్టి పేల్చాడు. రాళ్లను రేణువులుగా మార్చగలిగాడు. నేను అతని  విధానాన్ని అనుసరించి మళ్ళీ ప్రయోగం మొదలు పెట్టాను. అధిక ఉష్ణోగ్రతకు కరిగి ద్రవస్థితికి మారిన లోహమిశ్రమం మీద అత్యధిక పీడన కలిగింపజేసే సమస్యను ఒక కొలిక్కి తెచ్చాను. ఒక  స్టీలు సిలిండర్‌ సంపాదించి, నా దగ్గరున్న రసాయన సామగ్రినంతా అందులో వేసి కూరాను. దాన్నలాగే వదలిపెట్టి వాహ్యాళికెళ్ళాను.’‘అది ఇంటిని మొత్తం పేల్చేస్తుందని అనుకోలేదా?  చుట్టుపక్కల జనం ఉంటారనే స్పృహ కూడా నీకు లేకపోయిందా?‘ అని అడిగాను. 

‘సైన్సు పట్ల నాకున్న శ్రద్ధ అటువంటిది. నా గది  కింది భాగంలో వీధిలో పళ్లు అమ్ముకొనే కుటుంబం, వెనుకభాగంలో డాక్యుమెంట్‌ రైటర్, పై అంతస్తులో ఇద్దరు పూలమ్మే ఆడవాళ్ళున్నారు. కొందరు బయటికెళ్ళి వుంటారనుకొంటాను.‘నేను వెళ్ళేటప్పుడు పరిస్థితి ఎలా వుందో, తిరిగి వచ్చేటప్పటికి కూడా అలాగే ఉంది. సిలిండర్‌ పేలలేదు. తరువాత కొన్ని సమస్యలనెదుర్కొన్నాను. స్థిరమైన, స్పష్టమైన రూపురేఖలేర్పడి స్ఫటికాలు రూపొందాలంటే, కాలవ్యవధి అనే అంశం అత్యంత ప్రధానమైనది. తొందర పడితే చిన్న  చిన్న రేణువుల్లాంటివి మాత్రమే  మిగులుతాయి. సుదీర్ఘకాలం సహనంతో వేచివుంటేనే పెద్ద పెద్ద వజ్రాల్ని పొందవచ్చు. అందుకని ఆ పరికరం క్రమంగా చల్లబడేందుకు రెండేండ్ల పాటు కదిలించకూడదని నిర్ణయించుకున్నాను.అప్పుడు నా వద్ద చిల్లి గవ్వ  కూడా లేదు. ఆ యంత్రాన్ని పరిరక్షించుకోడానికీ, గది అద్దె చెల్లించడానికి, నా ఆకలి తీర్చుకోడానికి కూడా నా చేతిలో ఒక్కటంటే ఒక్క పెన్నీ కూడా లేదు. న్యూస్‌  పేపర్లమ్మాను. గుర్రాలను మేపాను. కార్లు తుడిచాను. తోపుడు బండి వాడికి సహాయకుడిగా పనిచేశాను. వారంలో ఒకసారి నాకు చేయడానికి పనేమీలేని ఒకరోజు నేనేమీ తినలేదు. ఒక యువకుడు తన గర్ల్‌ ఫ్రెండ్‌ ఎదుట మెహర్బానీ  ప్రదర్శించాలని, నాకు ఆరు పెన్నీలిచ్చాడు– అది నా అదృష్టం. ఆ డబ్బుకూడా ప్రయోగాల కోసమే ఖర్చుపెట్టాను. చివరకు,  సిలిండరును పక్కకు తీసి స్క్రూలను  ఊడదీశాను. నుసిగా మారిన పొడిని ఉలితో గోకి, ఒక ఇనుప పళ్లెంలోకి చేర్చి సుత్తితో బాగా కొట్టాను. ఇంకా నేను అనుసరించిన కొన్ని ప్రక్రియల తరువాత, చివరకు మూడు పెద్ద సైజు వజ్రాలు, అయిదు చిన్నపాటి వజ్రాలు తయారయ్యాయి.నేను నేలమీద కూర్చొని సుత్తితో బాదుతున్న సమయంలో, నా గది వాకిలి తెరుచుకొని నా పొరుగునున్న డాక్యుమెంట్‌ రైటర్‌ లోపలికొచ్చాడు. అతడు మామూలుగానే తాగిన మైకంలో ఉన్నాడు. తలుపుకానుకొని నిల్చుని  ‘నువ్వు ఈ ఇంటిని బాంబులు పెట్టి పేల్చాలని చూస్తున్నావు. ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్నాను.’  అంటూ ఏదేదో వదరుతూనే ఉన్నాడు. నేనప్పటికే జాగ్రత్త పడివున్నాను. నా ఈ రహస్యం పోలీసులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇన్నేళ్లు నేను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోతుందనుకొంటూ, ఆ డాక్యుమెంట్‌ రైటర్‌ గాడి కాలరు పట్టుకొని, కిందపడేసి తొక్కాను. తరువాత వజ్రాల్ని పోగుచేసుకొని బయటికొచ్చేశాను. పేరుపొందిన  నగల వ్యాపారస్తుని వద్ద కెళ్ళాను. అతడు నన్ను కొంచెం సేపు వేచి ఉండమని చెప్పి, పోలీసులను పిలవమని గుమాస్తాతో గుసగుసలాడడం గమనించి, నేను అప్రమత్తమై ‘వేచివుండలేన’ని చెప్పి అక్కడి నుంచి బయట పడ్డాను.

దొంగ నగలు కొనుక్కొనే ఒక దుర్మార్గుడు తారసపడ్డాడు. పరిశీలించడానికని అతని చేతికి ఒక వజ్రమిచ్చాను. వాపసిమ్మని అడిగితే, పోలీసులకు పట్టిస్తానని  బెదిరించాడు.ప్రస్తుతం నా మెడలో వెలకట్టలేని వజ్రాల సంచి కట్టుకొని పిచ్చివాడిలా తిరుగుతున్నాను. అన్నమూ, ఆశ్రయంలేక అలమటిస్తున్నాను. నమ్మతగిన వ్యక్తిగా అనిపించింది మీరొక్కరే. మీ ముఖం నాకు నచ్చింది.  ప్రస్తుతం నా పరిస్థితి చాలా దారుణంగా వుంది.’ అంటూ నా కళ్ళల్లోకి చూశాడు దీనంగా. ‘ఇటువంటి పరిస్థితులలో నేను వజ్రాన్ని కొంటానని ఎలా అనుకున్నావు? వందలకు వందలు నేను జేబులో పెట్టుకు రాను. ఇక అసలు విషయానికొస్తే, నువ్వు చెప్పిన కథ నేను పూర్తిగా నమ్మలేదు. అయినా నీకిష్టమైతే రేపు నా ఆఫీసుకొచ్చి కలుసుకో.’ అని  చెప్పాను.‘మీరు నన్ను దొంగ అనుకుంటున్నారా? నన్ను పోలీసులకు పట్టించాలనే ఈ ఎత్తు వేశారు. నేను మీ ఉచ్చులో పడను’.‘నువ్వు  దొంగవు కాదనే నమ్ముతున్నాను. ఇదిగో నా కార్డు. ముందుగా అపాయింట్మెంట్‌  తీసుకోనవసరం లేదు. ఎప్పుడైనా కలుసుకోవచ్చు’ అని చెప్పాను.అతను నామాటలు విశ్వసించి వెళ్లిపోయాడు. అదే అతణ్ని కడసారి చూడడం. నేను బయటికెళ్లినప్పుడొకసారి అతడొచ్చాడని,ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నాడని, విపరీతంగా దగ్గుతున్నాడని, ఎటువంటి సమాచారం ఇచ్చివెళ్ళలేదనీ, నా ఆఫీసులో పనిజేసే ఉద్యోగి చెప్పాడు. తరువాత ఆ వజ్రాల బేహారి మళ్ళీ కనబడలేదు.  

ఒకసారి అతడు– తనకు బ్యాంక్‌ నోట్లు తప్ప చెక్కులు పంపకూడదని  కొన్ని చిరునామాలు ఉటంకిస్తూ – రెండు ఉత్తరాలు రాశాడు. నేను బాగా ఆలోచించాను. అతడు నిజంగా పిచ్చివాడా? గులకరాళ్ళతో వ్యాపారం చేసే మోసగాడా? కృత్రిమ వజ్రాలు తయారు చేసేవాడా?    చివరిది నమ్మతగినదిగా వుంది. నేను జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకొన్నాననిపిస్తుంది. అతనేమై ఉంటాడా? అని ఆలోచించాను. బహుశా అతను మరణించి ఉంటాడు. అతడు  మేధను మథించి, కడుపుకట్టుకొని సృష్టించిన అమూల్యమైన వజ్రాలు నేలపాలైవుంటాయి. వాటిలో నా బొటనవేలి ఊర్ధ్వ భాగమంత భారీ  వజ్రం కూడా ఉంటుంది. లేకుంటే అతనింకా మెడలో హారంగా ధరించి, అతన్ని అనుమాన దృక్కులతో చూసే ప్రజలకు,  వజ్రాలను అమ్మడానికి నిరర్థక ప్రయత్నం చేస్తూ వీధులవెంబడి తిరుగుతూవుంటాడు. నా తెగింపు లేని తనాన్ని తిట్టుకొంటూ వుంటాడు.ఏళ్లతరబడి దరిద్రమనుభవించి, అతడు ఎంతో విలువైన వజ్రాలు తయారు చేశాడు. కానీ వాటివల్ల  కించిత్తు కూడా లబ్ధి పొందలేక పోయాడు. నేను ఒక్కొక్కసారి అనుకొంటుంటాను– అతనడిగిన వంద పౌండ్లు కాకపోయినా, కనీసం  ఐదు పౌండ్లు చెల్లించే  ధైర్యం చేసి వుండాల్సిందని.              
ఇంగ్లిష్‌ మూలం : హెచ్‌.జి. వెల్స్‌
అనువాదం:  శొంఠి జయప్రకాష్‌        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement