అనంతమైన నక్షత్రాలకు, కోట్ల కొలది గ్రహాలను నెలవు ఈ విశ్వం. అందులో మరో గ్రహానికి చెందిన ఓ అరుదైన వజ్రం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వజ్రం కొనుగోలు చేయాలంటే రూపాయలు, డాలర్లలోనే కాదు క్రిప్టో కరెన్సీలో కూడా చెల్లింపులు చేయవచ్చు. ఇంతకీ ఈ వజ్రం ఎక్కడిది? ఎవరు అమ్మకానికి పెట్టారు ? ధర ఎంత అనే వివరాలు మీ కోసం..
ఫిబ్రవరిలో
ఖగోళంలో మరో గ్రహానికి చెందినదిగా చెప్పబడుతున్న అరుదైన వజ్రాన్ని సోత్‌బే సంస్థ వేలానికి పెడుతోంది. 2022 ఫిబ్రవరిలో ఈ వజ్రాన్ని లండన్‌లో వేలం వేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వజ్రం విశేషాలను దుబాయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోత్‌బే సంస్థ ప్రదర్శించింది.
అన్నింటా 5
భూమికి చెందని ఈ అరుదైన వజ్రాన్ని ది ఎనిగ్మా అని పిలుస్తున్నారను. ఈ వజ్రం 555.55 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉంది. అంతేకాదు ఈ వజ్రానికి 55 ముఖాలు ఉన్నాయి. న్యూమరాలజీ పరంగా ఇలా అనేక 5 అంకె కలిసి రావడం చాలా అరుదని వజ్రాల నిపుణులు అంటున్నారు. కార్బనాడోగా పేర్కొనే నల్లని వజ్రాలు చాలా అరుదుగా లభిస్తుంటాయని.. ఇప్పటి వరకు భూమ్మిద నల్లని వజ్రాలు కేవలం బ్రెజిల్, సెంట్రల్ ఆఫ్రికాలోనే దొరికాయని సోత్‌బే తెలిపింది.
గ్రహ శకలం నుంచి
ది ఎనిగ్మా వజ్రం భూమ్మిద లభించే మెటీరియల్‌తో రూపొందలేదని, గ్రహ శకలాలు భూమిని తాకినప్పుడు ఇక్కడి వాతవారణ పరిస్థితుల కారణంగా ఘనీభవించి, వేడేక్కి, ఆవిరై ఇలా పలు రకాలైన రసాయన మార్పులకు లోనై ఈ నల్లని వజ్రం ఏర్పడిందని సోత్‌బే పేర్కొంది. అయితే ఈ వజ్రం భూమ్మిది ఏ ప్రాంతంలో లభించిందనే వివరాలు ఆ సంస్థ వెల్లడించలేదు.
రూ. 50 కోట్లు
ది ఎనిగ్మా డైమండ్ వజ్రం వేలంలో ప్రారంభ ధర 5 మిలియన్ పౌండ్లు నిర్ణయించారు. డాలర్లలో ఈ వజ్రం 6.8 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.50 కోట్లు)గా ఉంది. వజ్రాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న వారు సాధారణ నగదుతో పాటు క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేసినా అంగీకరిస్తామని సోత్‌బే చెబుతోంది. దండిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఈ అరుదైన వజ్రాన్ని సొంతం చేసుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment