- వసతుల్లేక ఆసక్తి చూపని విద్యార్థులు
- సీట్ల భర్తీకి వార్డెన్లు, మేట్రిన్ల పాట్లు
యలమంచిలి/యలమంచిలి రూరల్ : కనీస వసతులు లేని ప్రభుత్వ వసతి గృహాలపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతోంది. ఫలితంగా విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ కావడం లేదు. వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులను చేర్చుకోవడానికి వార్డెన్లు, మేట్రిన్లు పాఠశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదోవిధంగా వసతి గృహాల్లో విద్యార్థులను చేర్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలతో వార్డెన్లు, మేట్రిన్లు గ్రామాల బాట పట్టారు.
అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులను వసతి గృహాల్లో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో 78 ఎస్‌సీ వసతి గృహాల్లో 8,200 ఖాళీలు ఉండగా ఇప్పటివరకు 5,500 ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల మంది ఎస్‌సీ విద్యార్థులు చదువుతున్నారు. శిథిల భవనాలకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు అంతంతమాత్రంగా ఉండడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగడం లేదు.
శిథిల భవనాల్లో....
యలమంచిలి ఎస్‌సీ నం.1,2 వసతి గృహాల్లో 100 మంది విద్యార్థులు రెండు గదుల్లో ఉంటున్నారు. భోజనాలు, చదువులు, పడక అన్నీ ఆ గదిలోనే. ఇరుకు గదుల్లో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రెండు వసతి గృహాల్లో 200 మంది విద్యార్థులను చేర్చుకోవలసి ఉంది. విద్యార్థుల కొరత కారణంగా నం.1 ఎస్‌సీ వసతి గృహాన్ని కార్యాలయంగా వినియోగిస్తున్నారు. రెండు వసతి గృహాల విద్యార్థులను ఒకే వసతిగృహంలో ఉంచారు.
స్నానాలు, మరుగుదొడ్ల ఇబ్బందులు
వసతి గృహాల్లో విద్యార్థులు స్నానాలు, మరుగుదొడ్లకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు తక్కువగా ఉండడంతో పలువురు విద్యార్థులు వసతి గృహాల పరిసరాలను మరుగుదొడ్లుగా వినియోగిస్తున్నారు. ఇక స్నానాలకు గదులు చాలక ఆరుబయటే స్నానాలు చేయవలసి వస్తోంది.
విద్యా ప్రమాణాల్లేవు...వసతి గృహాల్లో
విద్యార్థులకు విద్యాప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. పాఠశాల నుంచి వసతి గృహాలకు చేరుకుంటున్న విద్యార్థులకు ఉదయం సాయంత్రం పాఠ్యాంశాలపై సరైన శిక్షణ లేకపోవడంతో విద్యలో మిగిలిన విద్యార్థులకంటే వెనుకబడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులకు సాయంత్రం పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే వీరికి నెలకు రు.1000 మాత్రమే ఇస్తుండడంతో ఉపాధ్యాయులు ఆసక్తి కనబరచడంలేదు. దీంతో విద్యార్థులు పాఠశాలలో బోధించిన పాఠ్యాంశాలతో సరిపెట్టుకోవలసి వస్తోంది.
రుచిలేని ఆహారం
వసతి గృహాల్లో ఉదయం అల్పాహారంతో పాటు రాత్రి భోజనం పెడుతున్నారు. పలు వసతి గృహాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వార్డెన్లు, మేట్రిన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అల్పాహారం, భోజనాల్లో నాణ్యత లేకపోయినా విద్యార్థులు పెదవి విప్పడం లేదు. తల్లిదండ్రులకు, అధికారులకు ఫిర్యాదు చేయవద్దని వార్డెన్లు, మేట్రిన్లు విద్యార్థులకు హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నా పాఠశాల డైరీ...
ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలను పూర్తిచేయడానికి సాంఘిక సంక్షేమ శాఖ ఈ ఏడాది నా పాఠశాల డైరీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. కార్యక్రమంలో వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ప్రగతిని తెలిపే డైరీని విద్యార్థులకు అందజేశారు. విద్యార్థి వ్యక్తిగత సమాచారంతో పాటు వసతిగృహాల్లో ప్రవేశ మార్గదర్శక సూచనలు, విద్యార్థులకు కల్పించబడే సదుపాయాల గురించి వివరించారు.