‘గ్రేటర్’ నిర్లక్ష్యం ఖరీదు రూ.160 కోట్లు
- గడువులోగా పూర్తికాని నాలాల ఆధునీకరణ పనులు
- మురిగిపోయిన నిధులు
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
- ఇదీ జీహెచ్‌ఎంసీఅధికారుల తీరు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చినుకు పడితే వణుకే. బస్తీ వాసులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. మళ్లీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్. అయినా వరదముంపు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన నాలాల ఆధునీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో కేంద్రం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా కేటాయించిన రూ. 266 కోట్లలో దాదాపు రూ. 160 కోట్ల రూపాయలు మురిగిపోయాయి.
వర్షం కురిసిన ప్రతిసారీ బస్తీలు నీట మునగడానికి.. రహదారులు చెరువులుగా మారడానికి కారణమవుతున్న పలు నాలాలను ఆధునీకరించడమొక్కటే పరిష్కారమని భావించారు. నాలాలను ఆధునీకరిస్తే వర్షపునీరు సాఫీగా ప్రయాణిస్తుందని, తద్వారా వరద ముంపు తగ్గుతుందని భావించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్రం సైతం నాలాల ఆధునీకరణ పనుల కోసం రూ. 266 కోట్లు మంజూరు చేసింది. అందులో దాదాపు రూ. 106 కోట్లు మాత్రమే జీహెచ్‌ఎంసీ ఖర్చు చేయగలిగింది.
మిగతా రూ. 160 కోట్లు ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయి. వాస్తవానికి 2011 నాటి కే ఈ ఆధునీకరణ పనులు పూర్తికావాల్సి ఉండగా, పలుమార్లు పొడిగింపు ఇచ్చారు. అంతిమంగా 2014 మార్చి నెలాఖరుతో ఈ గడువు ముగిసిపోయింది. దీంతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా నిధులందినా ఆశించిన ప్రయోజనం నెరవేరకుండా పోయింది. నాలాల ఆధునీకరణ పనుల్లో కీలకమైన
భూసేకరణ ఈ పనులకు ప్రధాన ఆటంకంగా మారింది. దాంతో 70 కి.మీ. మేర నాలాలను విస్తరించి ఆధునీకరించాల్సి ఉండగా, అందులో దాదాపు 25 కి.మీ. మేర పనులు మాత్రమే జరిగాయి. మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలాయి. నాలాల ఆధునీకరణ కోసం మొత్తం 2,416 ఆస్తుల్ని సేకరించాల్సి ఉండగా.. గడువు ముగిసేనాటికి దాదాపు 800 ఆస్తులు మాత్రమే సేకరించగలిగారు. అంటే.. దాదాపు మూడింట రెండొంతుల ఆస్తుల సేకరణే పూర్తయింది. దీంతో.. ఆధునీకరణ పనులూ ఆగిపోయాయి.
ప్రోత్సాహకాలిచ్చినా...
నాలాల ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు కేంద్రం ఏడేళ్లు గడువు ఇచ్చినప్పటికీ.. పనులు పూర్తి చేయలేక పోయారు. తీరా ఆర్నెల్ల ముందు మాత్రం భూసేక రణ కోసం లబ్ధిదారులకు తగిన ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయినప్పటికీ గడువు తక్కువగా ఉండటంతో ఆశించిన ఫలితం కనిపించలేదు. భూసేకరణ కు ఆర్నెల్ల క్రితం ప్రకటించిన కొత్త ప్యాకేజీ ఇలా ఉంది.
భూసేకరణలో భూమి కోల్పోయే వారికి మిగిలే భూమి 50 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా పక్కా ఇల్లు.
ఉన్న ఇల్లు కోల్పోయి.. ప్రభుత్వం కే టాయించే పక్కా ఇంటికి వెళ్లేవారికి నెలకు రూ. 10 వేల వంతున ఆర్నెల్ల పాటు రూ. 60 వేల వేతనం.
కాంట్రాక్టర్ల టెండరు ప్రీమియంను ఐదు నుంచి 10 శాతానికి పెంచారు.