గ్రేటర్‌కు కొత్త రూపు
- పునర్విభజన...
- జనాభాకు అనుగుణంగా మార్పులు
- పెరగనున్న డివిజన్ల సంఖ్య
- రాజకీయ పార్టీల పరిస్థితి తారుమారు
- ఎన్నికల సంఘం సూచనతో రంగం సిద్ధం చేస్తున్న యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో: జీహెఎంసీలోని డివిజన్ల డీలిమిటేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. 2011 జనాభా ప్రకారం పునర్విభజన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. డివిజన్‌కు 40 వేల మంది మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అదే జరిగితే డివిజన్ల సంఖ్య పెరగడంతో పాటు ఆయా డివిజన్లలో రాజకీయ పార్టీల పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు డిసెంబర్ 3తో ముగియనుంది. ఆరు మాసాల వ్యవధి మాత్రమే ఉండడంతో డీలిమిటేషన్.. రిజర్వేషన్ల ఖరారు.. తదితర అంశాలను త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను ఆదేశించారు. రెండు వారాల కిందటే లేఖలు రాయగా ఈ విషయం గురువారం వెలుగుచూసింది.
అప్పుడూ.. ఇప్పుడూ..
2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 2001 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్లను విభజించారు. ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు 100 డివిజన్లుండగా, జీహెచ్‌ఎంసీగా ఏర్పాటయ్యాక 150 డివిజన్లు అయ్యాయి. వీటి మధ్య సమతుల్యత లేదు. కొన్ని డివిజన్లలో 20 వేల జనాభా.. మరికొన్ని డివిజన్లలో 90 వేల జనాభా ఉంది. దీంతో అభివృద్ధిలో అసమానతలు తలెత్తాయి. డివిజన్ల అభివృద్ధికి కార్పొరేటర్ల నిధులు తదితరమైనవన్నీ అన్ని డివిజన్లకు ఒకే విధంగా కేటాయిస్తున్నారు. దీంతో తక్కువ జనాభా ఉన్న డివిజన్లకు నిధులు మిగిలే పరిస్థితి ఉండగా, ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లల్లో అభివృద్ధి కుంటుపడింది.
ఈ నేపథ్యంలో.. డివిజన్లన్నింటిలోనూ జనాభా సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంది. ప్రసాదరావు కమిటీ సైతం ఇదే అంశాన్ని పేర్కొంది. ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30కి పెంచి.. అన్ని సర్కిళ్లలోనూ దాదాపు సమాన సంఖ్యలో డివిజన్లు.. జనాభా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు డివిజన్ల విభజన జరగాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ జనాభా 69,93, 262 కాగా, వీరిలో 35,76,640 మంది పురుషులు, 34,16,622 మంది మహిళలున్నారు. కాగా, ఈ జనాభాకనుగుణంగా వార్డుల పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది.
ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న డివిజన్ల సంఖ్య పెరగొచ్చు. డివిజన్ల మధ్య జనాభా పదిశాతం వరకు మాత్రం అటూ ఇటూగా ఉండవచ్చు. ఈ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ చేపట్టాల్సి ఉంది. దాదాపు 150 కుటుంబాలకు ఒక బ్లాక్ చొప్పున జీహెచ్‌ఎంసీలో ఎన్యూమరేషన్ బ్లాక్‌లున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని డీలిమిటేషన్ జరపాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీలోని సంబంధిత అధికారి తెలిపారు.
పార్టీల పరిస్థితి తారుమారు!
జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఆయా డివిజన్లలో గట్టి పట్టున్న రాజకీయ పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాతబస్తీ, కోర్ ఏరియాలో కొన్ని డివిజన్లు ఆయా పార్టీల కంచుకోటలుగా ఉన్నాయి. వాటికి బీటలు వారే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయపార్టీల స్పందన ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమైంది.
హెచ్చు.. త గ్గులు..
2001 జనాభాకు, 2011 జనాభాకు భారీగా వ్యత్యాసం ఉంది. కొన్ని డివిజన్లలోని జనాభా అప్పటికంటే బాగా తగ్గింది. మరికొన్ని డివిజన్లలో గతంలో కంటే భారీగా పెరిగింది. కోర్‌లోని డివిజన్లలో తగ్గుదల 2 శాతం నుంచి 50 శాతం వరకుండగా, శివార్లలో మాత్రం భారీ పెరుగుదల చోటు చేసుకుంది. కొన్ని డివిజన్లలో వందశాతం కంటే ఎక్కువ జనాభా పెరిగింది. జనాభా పెరిగిన డివిజన్లు దాదాపు 30 వరకుండగా, జనాభా తగ్గిన డివిజన్లు దాదాపు 20 ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ వివరాలు నమోదయ్యాయి.
డివిజన్‌కు 40 వేల జనాభా..
ఒకొక్క డివిజన్ పరిధిలో 40 వేల మంది జనాభా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. పునర్వ్యవస్థీకరణ, డివిజన్ల ఏర్పాటు విధివిధానాలపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి వర్తమానం అందలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ దఫా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. 2009లో 150 వార్డులకు ఎన్నికలు జరిగినప్పుడు బీసీ జనరల్‌కు 33, బీసీ మహిళలకు 17, మహిళలు (జనరల్‌కు) 28 డివిజన్లు కేటాయించారు. ఓపెన్ కేటగిరీలో 58 డివిజన్లు ఉన్నాయి.
జనాభా తగ్గిన డివిజన్లు
మూసారాంబాగ్, చాంద్రాయణ గుట్ట, కుర్మగూడ, సలీంనగర్, పత్తర్‌గట్టి, గౌలిపురా, ఫతేదర్వాజ, శాలిబండ, ఘాన్సిబజార్, జాంబాగ్, గన్‌ఫౌండ్రి, సుల్తాన్‌బజార్, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, ముషీరాబాద్, గాంధీనగర్, సోమాజిగూడ, శ్రీనగర్‌కాలనీ, సీతాఫల్‌మండి, బన్సీలాల్‌పేట, అడ్డగుట్ట.
పెరిగిన డివిజన్లు..
కొత్తపేట, మన్సూరాబాద్, కర్మాన్‌ఘాట్, చంపాపేట, సరూర్‌నగర్, ఆర్‌కేపురం, కంచన్‌బాగ్, తలాబ్‌చంచలం, శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, టోలిచౌకి, వెంగళ్రావునగర్, బంజారాహిల్స్, రహ్మత్‌నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట, చందానగర్, కేపీహెచ్‌బీకాలనీ, మోతీనగర్, హైదర్‌నగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, సూరారంకాలనీ, జీడిమెట్ల, తార్నాక.