న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల నిధుల్లో పారదర్శకత కోసం కేంద్రం తెచ్చిన ‘ఎలక్టోరల్ బాండ్ పథకం’ మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. బాండ్లు కొనుగోలు చేసేవారు కచ్చితంగా భారతీయపౌరులై లేదా భారత వ్యాపార సంస్థలైనా అయి ఉండాలి. తొలి దశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైల్లోని ఎస్‌బీఐ ప్రధాన కేంద్రాల ద్వారా వీటిని జారీ చేస్తారు. ‘2018 తొలి త్రైమాసికానికి సంబంధించి మార్చి నెలలో ఈ పథకం తొలి ఇష్యూ ప్రారంభం కానుంది. మార్చి 1 నుంచి 10 వరకు ఎలక్టోరల్ బాండ్ల తొలి విడత అమ్మకం జరుగుతుంది.
ఈ బాండ్లను అర్హతగల రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ల ద్వారా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా కానీ, సంయుక్తంగా గానీ, ఇతరులతో కలిసైనా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు’ అని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ బాండ్ జారీచేసిన 15రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ సమయం దాటిన తర్వాత ఈ బాండ్ ద్వారా ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీల ఖాతాలోకీ ఈ డబ్బులు జమకావు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కన్నా ఎక్కువ ఓట్లు పొందిన గుర్తింపుపొందిన రాజకీయపార్టీలన్నీ ఈ బాండ్లను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment