నిధులు ఢమాల్
=ఏటా ఖర్చు రూ.కోట్లు
=నాణ్యతకు తూట్లు
=ఒక్క వానకే రోడ్లన్నీ ఛిద్రం
=నరకప్రాయంగా మారిన ప్రయాణం
=సీజన్ తప్పుతున్న పనులు.. జనానికి అగచాట్లు
ఒకటీ రెండూ కాదు.. ఏటా రూ.200 కోట్లు ‘కొట్టుకు’పోతున్నాయి.. ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు వెచ్చించినా రోడ్ల పరిస్థితి ‘తారు’మారవుతోంది.. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో దాదాపు 30 శాతం నిధులు రోడ్లకే కేటాయింపు.
సాక్షి, సిటీబ్యూరో: ఇంతచేసినా.. ఒక్క వానకే రోడ్లన్నీ గుంతలు.. గోతులు.. రెండు చినుకులు పడితే చెరువులు.. కాస్త తెరిపినివ్వగానే కళ్లలో దుమ్ముధూళి.. నగరంలో ఏ మూలన చూసినా పట్టుమని కిలోమీటరు మేర కూడా ఒక్క రహదారీ సవ్యంగా ఉన్న దాఖలాల్లేవు. ఇటీవల వర్షాలకు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎక్కడికక్కడ కంకరతేలి.. లోతైన గుంతలు.. వాహనచోదకులకు పరీక్షలు పెడుతున్నాయి. కొన్నిచోట్ల కోసుకుపోయి ప్రమాదకరంగా మారాయి. నగరవాసి అధ్వాన రోడ్లపై పడుతూ లేస్తూ ప్రయాణిస్తున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. పైపై పూతలు, నాణ్యతలేని మరమ్మతులతో రహదారులు ఛిద్రమై వాహనచోదకుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. రోడ్డెక్కాలంటే హడలిపోయే పరిస్థితి దాపురించింది.
నాణ్యత గాలికి..
ఏదైనా పనికి రూ.వంద ఖర్చు చేస్తే అందులో నాణ్యత ఉండేలా కనీస జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది లక్షలు, కోట్లు వెచ్చించేప్పుడు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? ఘనత వహించిన జీహెచ్‌ఎంసీ మాత్రం ఏటా రూ. కోట్లు రోడ్ల నిమిత్తం వెచ్చిస్తున్నా నాణ్యతను గాలికొదిలేస్తోంది. దీంతో నెలలు తిరిగే సరికి రోడ్లన్నిటికీ తూట్లు పడుతున్నాయి. రోడ్డు పనులు వర్షాకాలానికి ముందే చేపట్టాలి. అయితే ఏనాడూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం నిర్ణీత వ్యవధిలో పనులు చేసిన పాపాన పోవట్లేదు.
వర్షాలు ముంచుకొచ్చే తరుణంలో కోట్లు కుమ్మరించడం.. మూణ్నాళ్లకే కొట్టుకుపోతున్న నాణ్యత గురించి ప్రశ్నిస్తే వర్షానికి బీటీ నిలవదని చల్లగా చెప్పడం యంత్రాంగానికి తంతుగా మారింది. ఏటా దాదాపు రూ. 200 కోట్లకు తగ్గకుండా రోడ్ల కోసం వెచ్చిస్తున్నారు. ఇలా ఐదేళ్లుగా వెయ్యి కోట్లు రోడ్లపాల్జేసినా.. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గత వారం కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. సోమవారం ‘సాక్షి’ విజిట్‌లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ నరకానికి నకలుగా కనిపించాయి.
ఎంత వెచ్చించినా మారని స్థితిగతులు
ఈ ఏడాది ఇప్పటి వరకు రోడ్లపై రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్ నిధులతో పాటు రంజాన్, బోనాలు వంటి పండుగల పేరిట, కార్పొరేటర్ల బడ్జెట్ నుంచీ వీటిని వెచ్చించారు. అయినా రహదారుల స్థితిగతులేం మారలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం మరో వంద కోట్లయినా ఖర్చు చేస్తారు. ఏటా జరిగే తంతే ఇది. ఇవికాక జీవవైవిధ్య సదస్సు నిమిత్తం గతేడాది రూ.60 కోట్లతో పైపై పూతలు పూశారు. ప్రస్తుతం ఇవన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి.
కార్పొరేటర్ల ఫండ్
గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి రోడ్లకు మంజూరైన నిధులు రూ. 41.83 కోట్లు
ఖర్చయిన నిధులు: రూ. 26.39 కోట్లు
గ్రేటర్‌లోని మొత్తంరోడ్లు: 6411
బీటీ రోడ్లు: 2280 (ఆర్‌అండ్‌బీ పరిధిలోనివి: 189.48)
సీసీ రోడ్లు: 2080, కచ్చారోడ్లు: 1660
నేషనల్ హైవే పరిధి: 98.70