దారి మళ్లుతున్న నిధులు
పేరుకే పనులు...పైపై మెరుగులు
గడువు ముగిసినా మంజూరయ్యే బిల్లులు
ఏటా ఇదే తంతు
సిటీబ్యూరో: బోనాల పండుగ వస్తోందంటే ఆబాలగోపాలంలో చెప్పలేని సంతోషం. గ్రేటర్‌లోని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు మరికొంచెం ఎక్కువ సంబరం. అందరికీ పండుగ ఆనందాన్ని తీసుకొస్తే... కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల ఇళ్లకు నిధులను కూడా మోసుకొస్తుంది. అదీ విశేషం. బోనాల పేరిట ఏటా విడుదలయ్యే కోట్లాది రూపాయలు పనుల పేరుతో పక్కదారి పడుతున్నాయి.ఏనాడూ ఎక్కడా పూర్తి స్థాయిలో పనులు చేసిన పాపాన పోవడం లేదు. అక్కడక్కడా చేసిన కొద్దిపాటి పనుల్లోనూ నాణ్యత డొల్ల. పండుగలు ముంచుకొచ్చాక పనులు ప్రారంభించడం.. పైపై పూతలతో మమ అనిపించడం పరిపాటిగా మారింది. బోనాల నిధులను ఎవరి శక్తి మేరకు వారు ఇష్టానుసారం ‘దారి’ మళ్లిస్తున్నారు. గతంలో కార్పొరేటర్లు ఉన్నప్పుడు వారి హవా నడిచేది. ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీలు, కాంట్రాక్టర్లు ఎవరికి తోచిన పనులకు వారు బోనాల పేరిట ‘ఉపయోగించే’ పనిలో పడ్డారు.
నిధులు మాయం
ఏటా బోనాల సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రహదారుల మరమ్మతులు, సున్నాలు వేయడం, షాబాద్ ఫ్లోరింగ్, విద్యుత్ దీపాల వంటి పనులు చేయడం పరిపాటి. ఈ ఏడాది బోనాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం రూ.10 కోట్లు ప్రకటించగా... దాదాపు రూ.11.50 కోట్లు ఖర్చు చూపారు. పండుగ నాటికే ఈ పనులు చేయాల్సి ఉండగా... ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగిస్తున్నారు. పూర్తయినట్లు చెబుతున్న వాటిల్లోనూ నిజంగా ఎన్ని చేశారో... ఎన్నింటికి బిల్లులు మాత్రమే చూపారో కాంట్రాక్టర్లు, అధికారులకే తెలియాలి. అంతకుముందు సంవత్సరమూ ఇదే తంతు. చేయని పనులు చేసినట్లు చూపారు. బోనాల పేరిట అప్పట్లో రూ.5 కోట్లు మంజూరు కాగా... పండుగ పూర్తయ్యేసరికి అందులో సగం పనులు మాత్రమే చేశారు. మిగతా నిధులను ఆ తర్వాత బిల్లులతో పొందారు. గత ఏడాది అంతకు రెట్టింపు నిధులు కేటాయించారు. ఆ పనులు ఇంకా ‘చేస్తున్నారు’.
తోచిన చోట పనులు...
బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద.. గుడులకు వెళ్లే మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిధులతో వివిధ పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు. గత సంవత్సరం దీన్ని గుర్తించిన కమిషనర్ సోమేశ్ కుమార్ బోనాల నిధులతో ఇతర పనులు చేయవద్దని ఆదేశించారు. అయినా ఆచరించిన వారే లేరు.తాజాగా మరోసారి ఇదే తంతు మొదలైంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగిశాయి. కానీ.. అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. వచ్చేవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగనున్నాయి. మిగిలిన కొద్దిపాటి వ్యవధిలో ఏమేరకు పనులు చేస్తారో అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి.
వివరాలు ఉండవు
బోనాలకు సంబంధించిన పనులు జోన్లు, సర్కిళ్ల వారీగా జరుగుతున్నందున ఏ మేరకు చేశారో ఎప్పటికప్పుడు వివరాలు ప్రధాన కార్యాలయానికి అందడం లేదు. నాణ్యతపై పెద్దగా పట్టింపు కూడా లేకపోవడంతో నిధుల దుబారాకు మార్గమేర్పడింది. ఎప్పటిలాగే ఈసారీ పండుగల పేరిట నిధుల కైంకర్యానికి తెర లేచింది. చాలా సర్కిళ్లలో కాంట్రాక్టులు పూర్తయ్యాయో లేదో కూడా తెలియదు. సమయం ముంచుకొచ్చాక మమ అనిపిస్తారన్న మాట.
బోనం పండుగ... జేబులు నిండగా!
Published Tue, Jul 28 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM
Advertisement
Advertisement