నేటినుంచి ఎడమకాల్వ ఆధునీకరణ పనులు
సాగర్ నీటి విడుదల
నిలిపివేయడంతో నిర్ణయం
{పధాన కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ల పనులకు శ్రీకారం
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో ఆధునీకరణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సాగర్ ఆధునీకరణ కోసం కేటాయించిన నిధుల్లో మిగిలి ఉన్న రూ.700 కోట్లతో వీలైనన్ని ఎక్కువ పనులు చేపట్టాలని నిర్ణయించారు. జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యేనాటికి పనులు పూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులు ఉన్నారు. నిజానికి సాగర్ ఆధునీకరణను 2008 ఫిబ్రవరిలో రూ. 4,444.41 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇందులో వరల్డ్ బ్యాంకు నుంచి 48 శాతం నిధులు అందనుండగా, మిగతా 52 శాతం నిధులను రాష్ట్రం సమకూర్చాల్సి ఉంటుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ వాటా రూ.1,576.94 కోట్లుగా తేలగా అందులో 2014 వరకు 659.06 కోట్లు ఖర్చు చేసినట్లుగా తేల్చారు. ఇక గతేడాది మరో రూ.126.66 కోట్లతో పనులు చేపట్టగా... ఇంకా రూ.700 కోట్లతో చేపట్టాల్సిన పనులు మిగిలిఉన్నాయి. ఈ మొత్తం పనులను 2016 జూన్ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణీత అవసరాల మేరకు నీటి విడుదల గురువారంతో ముగియడంతో ప్రస్తుతం పనుల ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారు. రెండు నెలల వ్యవధిలో 8 ప్యాకేజీల పరిధిలోని 25 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ల పనితో పాటు 4 ఎత్తిపోతల పథకాల ఆధునికీరణను వేగవంతం చేసేందుకు అధికారులు నిర్ణయించారు.