బ్యారేజీని పరిశీలించిన ‘వంశధార’ బృందం
విజయవాడ : పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ప్రకాశం బ్యారేజీని శుక్రవారం ఉదయం వంశధార ట్రిబ్యునల్ బృందం పరిశీలించింది. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాజెక్టుల వల్ల అక్కడి ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం పర్యటిస్తోంది. ఈ బృందంలో జస్టిస్ డాక్టర్ ముంకు ందం శర్మ, జస్టిస్ బి.ఎస్.చతుర్వేది, జస్టిస్ గులామ్ మహ్మద్‌తో పాటు 15 మంది న్యాయవాదులు ఉన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఎస్‌ఈ రామకృష్ణ బ్యారేజీ గురించి బృంద సభ్యులకు వివరించారు. బ్యారేజీ ప్లాన్‌ను చూపించారు.
సముద్రానికి 80 కిలోమీటర్ల ఎగువలో ప్రకాశం బ్యారేజీ ఉందని, దీనివల్ల కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతోందని మంత్రి ఉమా బృందానికి వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలవ ల్ల ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న రిజర్వాయర్లలోనే నీరులేని పరిస్థితి ఉందని బ్యారేజీ దిగువన నీరులేని ప్రాంతాన్ని చూపించారు. అనంతరం వంశధార ట్రిబ్యునల్ బృందం టూరిజం శాఖ లాంచీలో కృష్ణానదిలో పర్యటించింది.