Byareji brightness
-
బ్యారేజీని పరిశీలించిన ‘వంశధార’ బృందం
విజయవాడ : పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ప్రకాశం బ్యారేజీని శుక్రవారం ఉదయం వంశధార ట్రిబ్యునల్ బృందం పరిశీలించింది. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాజెక్టుల వల్ల అక్కడి ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం పర్యటిస్తోంది. ఈ బృందంలో జస్టిస్ డాక్టర్ ముంకు ందం శర్మ, జస్టిస్ బి.ఎస్.చతుర్వేది, జస్టిస్ గులామ్ మహ్మద్‌తో పాటు 15 మంది న్యాయవాదులు ఉన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఎస్ఈ రామకృష్ణ బ్యారేజీ గురించి బృంద సభ్యులకు వివరించారు. బ్యారేజీ ప్లాన్‌ను చూపించారు. సముద్రానికి 80 కిలోమీటర్ల ఎగువలో ప్రకాశం బ్యారేజీ ఉందని, దీనివల్ల కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతోందని మంత్రి ఉమా బృందానికి వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలవ ల్ల ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న రిజర్వాయర్లలోనే నీరులేని పరిస్థితి ఉందని బ్యారేజీ దిగువన నీరులేని ప్రాంతాన్ని చూపించారు. అనంతరం వంశధార ట్రిబ్యునల్ బృందం టూరిజం శాఖ లాంచీలో కృష్ణానదిలో పర్యటించింది. -
రెండు గంటలు ట్రాఫిక్ స్తంభన
ప్రకాశం బ్యారేజీపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు నరకం అనుభవించారు. బ్యారేజీని పరిశీలించేందుకు వంశధార ట్రిబ్యునల్కమిటీ సభ్యులు రావడంతో కొద్దిసేపు ఇరువైపులా రాకపోకలు నిలిపివేశారు. కమిటీ పరిశీలన అనంతరం వాహనాలను వదలడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. కమిటీ సభ్యులు, మంత్రి దేవినేని ఉమా వాహనాలతో పాటు అంబులెన్స కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. రెండు గంటలు ట్రాఫిక్ స్తంభన ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక అంబులెన్స్‌లో మహిళ ప్రసవ వేదన అనుభవించింది. అయినా.. పోలీసులు అరగంట వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేయలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ సతీష్ చంద్ర , మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్నారు. -
మారిన కృష్ణా నది సరిహద్దులు
చిక్కిపోయిన కృష్ణమ్మ వరదలతో దిశ మారిన ప్రవాహం కొత్తగా ఏర్పడిన గ్రామాలు కృష్ణానది కాలక్రమేణా చిక్కిపోతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నది ప్రవాహ పరిస్థితికి, ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది. నది వెడల్పు పది కిలోమీటర్ల మేర కుంచించుకుపోయి ఎన్నో గ్రామాలు కొత్తగా ఏర్పడ్డాయి. నీటి ప్రవాహం దిశ మారిన నేపథ్యంలో పలు ప్రాంతాలు నదిలో కలిసి కనుమరుగయ్యాయి. విజయవాడ : పూర్వం కృష్ణా నదిని కృష్ణ వేణిగా పిలిచేవారు. కృష్ణా నదికి గుంటూరు జిల్లా వైపు ఉన్న కాలువను పేకమ్మగా వ్యవహరించేవారు. ఇది ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద మొదలై రాయపూడి, వెలగపూడి, మందడం, ఎర్రబాలెం మీదుగా ప్రవహించి మంగళగిరి వద్ద ఉన్న ట్రంక్ రోడ్డును దాటి తుంగభద్రలో కలిసేది. అయితే ప్రస్తుతం నది ప్రవాహం ఇలా లేదు. తుపానులు, వరదలు, ఉప్పెనుల, భూకంపాలు, భూమిలో ఏర్పడిన సహజసిద్ధ మార్పులతో నది ప్రవాహ స్వరూపం మారిపోయింది. గతంలో మంగళగిరి ట్రంక్ రోడ్డు వరకు కృష్ణానది విస్తరించి ఉండేది. కృష్ణానది ఆయకట్టు రికార్డుల్లో సైతం మంగళగిరి ట్రంక్ రోడ్డును నది హద్దుగా పేర్కొన్నారు. వరదలు వచ్చిన సమయంలో మంగళగిరి వద్ద నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండేది. అమరావతి సమీపంలోని వైకుంఠపురం నుంచి మంగళగిరి వరకు కృష్ణా నది ప్రవహించేది. కొత్త గ్రామాల ఏర్పాటు సుమారు 13వ శతాబ్దానికి పూర్వం తుళ్లూరు మండలంలోని అనేక గ్రామాలు ఉన్న ప్రాంతం కృష్ణానదిలో అంతర్భాంగా ఉండేది. చరిత్రలో ఆయా గ్రామాల ప్రస్థావన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. వైకుంఠపురం వద్ద మొదలైన కృష్ణానది మంగళగిరి వద్ద తుంగభద్రలో కలిసేది. హరిశ్చంద్రపురం, వెలగపూడి, వెంకటాయపాలెం, తాళ్లయపాలెం, లింగాయపాలెం, మందడం తదితర గ్రామాలు ప్రస్తుతం ఉన్న చోట గతంలో కృష్ణానది ప్రవహించేది. నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో విశాలమైన భూభాగం ఏర్పడింది. 15వ శతాబ్దం తర్వాత వలస వచ్చినవారు ఆ భూభాగంలో నివసించడంతో ఈ గ్రామాలు ఏర్పడ్డాయి. దరణి కోట రాజుల హయాంలో ఉద్దండరాయునిపాలెం ఏర్పడింది. 15 వశతాబ్దం తర్వాత కోట గణపతి దేవుడి ప్రధాని ప్రోలి నాయకుని తండ్రి ఉద్దండరాయుని పేరుతో ఈ గ్రామం ఏర్పడింది.కోట కేతరాజు ఇద్దరు భోగపత్నుల తండ్రి ఎర్రమనాయుడు పేరుతో ఎర్రబాలెం ఏర్పడిందని చరిత్ర పేర్కొంటోంది.పల్నాటి యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో పాల్గొన వీరులు అనేక మంది కృష్ణాయపాలెం, వెంకటాపురం ప్రాంతాలకు వలసవచ్చారు. వారిలో హరిజనుడు వెంకటపాలెం, యాదవుడు కృష్ణాయపాలెం ఏర్పాటు చేశారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. -
సాగు జాగు !
అరకొరగా నీటి విడుదల గత ఏడాది ఆగస్టు 10 నాటికి 4.43 లక్షల ఎకరాల్లో వరిసాగు ఈ ఏడాది 82 వేల ఎకరాల్లోనే.. మచిలీపట్నం : కృష్ణాడెల్టా రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులు నిండినా దిగువకు అరకొరగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా బ్యారేజీ నుంచి 6300 క్యూసెక్కులు విడుదల చేశారు. రోజుకు 16 వేలకు పైగా క్యూసెక్కులు విడుదల చేస్తేనే శివారు ప్రాంతాలకు సాగునీరందే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద బుధవారం నాటికి 9.2 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇది 12 అడుగులకు చేరితేనే పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ ఈఈ గంగయ్య చెప్పారు. బుధవారం రైవస్ కాలువకు 3003 క్యూసెక్కులు, బందరు కాలువకు 1011, ఏలూరు కాలువకు 1021, కేఈబీ కాలువకు 1008 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అరకొరగా నీటిని విడుదల చేయడంతో రైతుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో పూర్తిస్థాయిలో సాగునీటిని కాలువలకు విడుదల చేసేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వరినాట్లు పూర్తయ్యేదెప్పటికో.. గత ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి జిల్లాలో 4.43 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది కేవలం 82 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు, మిగిలిన 5.52 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. ఆగస్టు ఆశించిన మేర వర్షం కురవలేదు. కాలువలకు నీరు విడుదల కాలేదు. జిల్లాలోని పలు మండలాల్లో 22,500 ఎకరాల్లో వేసిన వరి నారుమళ్లు నీరందక ఎదుగుదల లోపించి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అరకొరగా నీటిని విడుదల చేస్తుండటంతో శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరడానికి మరో నాలుగు రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలకు నీరందించేందుకు కాలువల వెంటే తిరుగుతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు. పశ్చిమకృష్ణాలో ప్రత్యామ్నాయం వైపు దృష్టి... ఆగస్టు 15 నాటికి వరినాట్లు పూరి కాకుంటే 120 రోజుల వ్యవధిలో కోతకు వచ్చే 1010, 1001 వరి వంగడాలను రైతులు సాగు చేయాల్సిందేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బీపీటీ 5204 వరి వంగడం 145 రోజులకు కోతకు వస్తుందని, సెప్టెంబరులో వరినాట్లు వేయాల్సి వస్తే ఈ రకం సాగు చేసేందుకు సమయం చాలదని అంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి పంటకు ప్రత్యామ్నాయం లేదని, తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే వంగడాలనే సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమకృష్ణా ప్రాంతంలోని తిరువూరు, నూజివీడు, కంచికచర్ల, గంపలగూడెం, బాపులపాడు మండలాల్లో వరికి బదులుగా మొక్కజొన్న సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 1.40 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరగాల్సి ఉండగా వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో ఇంకా విత్తడం పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. నూజివీడు తదితర ప్రాంతాల్లో వేరుశనగ సాగు ఇంకా ప్రారంభం కాలేదని సెప్టెంబరులో ఈ సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారుల అంచనాగా ఉంది. జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి ఆగస్టు 12 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 371.3 మిల్లీమీటర్లు. కురిసిన వర్షపాతం 260.0 మి.మీ. జూలై నెలాఖరు నాటికి 308 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 246.4 మి.మీ. మాత్రమే కురిసింది. 15 రోజులుగా ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో నారుమళ్లు ఎండుతున్నాయి.