జీవితం కుప్పకూలింది | Life collapsed | Sakshi
Sakshi News home page

జీవితం కుప్పకూలింది

Published Mon, Nov 28 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

జీవితం కుప్పకూలింది

జీవితం కుప్పకూలింది

భూవిలయం, జల ప్రళయం, దావానలం, వాయు ప్రచండం, గగన గమనం... ఇవన్నీ మనిషి చేతిలో ఉండని విపత్తులు, విషాదాలు, ప్రకృతి వైపరీత్యాలు. యుద్ధాలు, ఎమర్జెన్సీలు, పాలనా విధానాలు... ఇవి మాత్రం మానవ స్వయంకృతాలు. ఎలాగూ చేతిలో లేనివాటిని నివారించలేం. నిరోధించలేం. చేజేతులా చేసుకున్నదాన్ని చక్కబెట్టుకోలేమా? పెద్ద నోట్లు రద్దయ్యాక జనజీవనం అస్తవ్యస్తమయింది. రైతులు, చిన్నచిన్న వ్యాపారులు కుప్పకూలిపోయారు. వృద్ధులు రాలిపోయారు. వీరి కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలి. ‘పెద్దవాళ్లను’ కట్టడి చెయ్యడం మంచిదే. చిన్నవాళ్ల కష్టాలు కూడా చూడాలి కదా!

పండ్లమ్మిన చోటే పడిగాపులు
సైదులు పండ్ల వ్యాపారి. సూర్యాపేట  ‘వాణిజ్య భవన్’లో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ముప్ఫై ఏళ్లుగా ఇదే ఆయన జీవనోపాధి. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడా ఉపాధికి గండి పడింది. రోజుకు సుమారు రు.6 వేల వరకు పండ్ల అమ్మకాలు జరిపే సైదులుకు ఇప్పుడు రూ.500 వ్యాపారం కూడా జరగడం లేదు. గతంలో 10 గెలల అరటిపండ్లు, 5 బాక్సుల ఆపిల్స్, రెండు బాక్సుల దానిమ్మ, ఎనిమిది బాక్సుల కమలాలు అమ్మకానికి తెచ్చుకుంటే సాయంత్రానికి మొత్తం అమ్ముడయ్యేవి. ఇప్పుడు అమ్మకాలు తగ్గి, తెచ్చిన పండ్లు తెచ్చినట్టుగానే పాడైపోతున్నాయి. చిల్లర లేని కారణంగా గిరాకీని వదులుకోవలసి వస్తోంది.

పంట డబ్బొచ్చినా పైసా లేదు!
నక్కా భగవంతరెడ్డి వృద్ధ రైతు. ఆయనది నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం గ్రామం. లక్ష రూపాయలకు పైగా పంట డబ్బు పోచంపల్లి కెనరా బ్యాంకులో జమ అయింది. డ్రా చేసుకోడానికి బ్యాంకు దగ్గర పొద్దస్తమానం క్యూలో నిలబడాల్సి రావడంతో, ఇంటి దగ్గర పశువులను చూడ్డానికి రోజుకు రూ.300 ఇచ్చి మనిషిని కూలీకి పెట్టుకున్నారు. ఆ నష్టం ఒకటైతే తను బ్యాంకు క్యూలో నిలుచున్నా రోజుకు రూ.4 వేలకు మించి డ్రా చేసుకోలేకపోయారు. బ్యాంకు వాళ్లు పూర్తి డబ్బు ఇవ్వకపోతే రబీలో దుక్కులకు, విత్తనాలకు, ఎరువులకు కష్టమే అని తీవ్రంగా బాధ పడుతున్నాడు.

ఖరీఫ్‌కి అప్పులు... రబీకి తిప్పలు
గగ్గనపల్లి రాజశేఖర్‌రెడ్డి ఓ రైతు. ఊరు సూర్యాపేట జిల్లా  ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్ల గ్రామం. ఇరవై రోజుల క్రితం 105 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా అకౌంట్‌లో రూ.1,59,406 లు జమ అయ్యాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోడానికి నెమ్మికల్‌లోని బ్యాంకుకు వెళితే మొదట 20 వేలు ఇచ్చారు. తర్వాత రోజుకు 2 వేలు మాత్రమే ఇస్తున్నారు. వాటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలుచోవలసి వస్తోంది. ఖరీఫ్‌లో పంట కోసం అప్పు తెచ్చాడు. ఆ డబ్బు కోసం వ్యాపారులు రాజశేఖరెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రబీ సీజన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఏం చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు.

లక్ష ఉన్నా...  రోజుకింత భిక్ష!
సంగారెడ్డి జిల్లా చింతకుంట రైతు ఎం.డి. మౌలానా అప్పు చేసి పంట పండించాడు. 70 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. వారం తర్వాత ఆయన ఖాతాలో లక్షా ఆరు వేల రూపాయలు జమ అయ్యాయి. అయితే ఆ డబ్బును పూర్తిగా డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వారానికి రూ.2 వేలు మాత్రమే ఇస్తారని తెలిసి హతాశుడయ్యాడు. డబ్బంతా ఒకేసారి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని బ్యాంకు అధికారులు కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడేం చెయ్యాలో ఆయనకు దిక్కుతోచడం లేదు. అప్పులోళ్ల దగ్గర మాట పోతోందని ఆవేదన చెందుతున్నాడు.

క్యూలోనే తెల్లారుతున్న జీవితాలు
నల్లధనానికి చెక్ పెట్టడానికంటూ కేంద్ర సర్కారు తీసుకున్న హఠాత్ నిర్ణయం వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్ళకే  పెద్ద తలనొప్పిగా మారితే, వయసు మళ్ళినవారికి ఈ కష్టం ప్రాణం తీస్తోంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంకి చెందిన  పోలంకి ఇన్నయ్య అగ్నిమాపకదళంలో ఫైర్ ఆఫీసర్‌గా  రిటైరయ్యారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత  పాత నోట్లు చెల్లకపోవడంతో కొత్త నోట్లుతీసుకునేందుకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకుకు వచ్చి వెళు తున్నా ఖర్చులకు కొత్త కరెన్సీ దొరకలేదు. నవంబర్ 15వ తేదీ మంగళవారం ఆయన అయిదో రోజు క్యూలో నిలుచున్నాడు. శారీరకంగా, మానసికంగా నలిగిపోయి గుండెపోటుకు గురయ్యాడు. దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది.  చేయని పాపానికి పడిన పెద్ద శిక్షతో గుండెలవిసేలా ఏడుస్తున్న ఇన్నయ్య కుటుంబ సభ్యుల లాంటి ఎందరికో ఎవరు జవాబుదారీ?

నా మొగుడ్ని తెచ్చిస్తరా?
జూలూరి నర్సయ్యది మెదక్‌జిల్లా వెల్దుర్తి మండలం, అచ్చంపేట. 65 ఏండ్లకు పైనే ఉంటడు.  భార్య దుర్గమ్మే అతని తోడు. చలికాలం ఆరోగ్యం అంతంత మాత్రం కావడంతో ఆమె భయపడుతున్నట్టుగానే నర్సయ్యకు సుస్తి చేసింది. దానికి తోడు నోట్ల రద్దు వచ్చి పడింది. ఆమె పాతనోట్లనే తీస్కొని, చుట్టుపక్కల హాస్పిటళ్లకు తిరిగితే ఎవరూ పాతనోట్లు తీసుకోము అన్నారు. అట్లనే హైదరాబాద్ తీస్కొచ్చింది చుట్టాల సాయంతో. హైదరాబాద్‌లో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ తిప్పితే, అక్కడా పాత పెద్దనోట్లు చెల్లవన్నరు. డాక్టర్లు రాసిచ్చిన టెస్టులు చేయించడానికి పోతే పాత నోట్లు తీసుకోలేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగి, భర్తను ఇంటికి తీసుకొస్తే ఇంటికొచ్చిన కాసేపటికే నర్సయ్య ప్రాణం వదిలాడు. ‘ఎంత పనిజేస్తివిరా..  బగమంతుడా.. ’ అంటూ ఆమె గుండెలవిసేలా ఏడ్చింది. ‘గింత అన్యాయమా? పాత నోట్లు డాక్టర్లు తీస్కోకనే మా ఆయనను షెరీఖ్ జేస్కోలే. మనుషుల పానాలతో ఆడుకుంటుండ్రు. ఇప్పుడు నా మొగుడ్ని పాణాలతో తెచ్చిస్తరా’ అని అడుగుతోంది దుర్గమ్మ.

డబ్బులకెళితే... దెబ్బలు!
మాధవరెడ్డి అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వాతావరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. నోట్ల మార్పిడి ప్రకటన జారీ అయ్యాక మూడు రోజులు ఆగి సాయి నగర్ స్టేట్‌బ్యాంకుకెళ్లాడు. తన వంతు కోసం ఎదురు చూస్తూ క్యూలో గంటలకొద్దీ వేచి ఉన్నాడు. ఇంతలో  పోలీసు పటాలం బ్యాంకు దగ్గర దిగింది. రావడం రావడమే  రాయలేని భాషతో రెచ్చిపోయింది. అదేమిటని ప్రశ్నించిన వారి మీద విరుచుకుపడింది. నిలదీసిన మాధవరెడ్డిని ఎస్‌ఐ మీద చేయిచేసుకున్నాడంటూ చితకబాదారు. బూటుకాలితో తంతూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మాధవ్‌రెడ్డి ఏమయ్యాడో తెలియక రెండ్రోజులపాటు అనిశ్చితి కొనసాగింది. భర్త ఆచూకీ చెప్పమని స్టేషన్‌కొచ్చిన భార్యకు సమాధానం చెప్పలేదు పోలీసులు. చివరకు వదిలిపెట్టారు ‘ఆయన మృదు స్వభావి. పోలీసుల మీద చెయ్యి చేసుకున్నాడంటే ఎవరూ నమ్మరు. అన్యాయంగా అరెస్టు చేశారు’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతోంది భార్య భార్గవి.

ఆ రైతు చివరకు అంతకు తెగించాడు!
కర్నూలు జిల్లా, తూడిచెర్లకు చెందిన నల్లబోతుల పుల్లయ్య, భార్య వెంకటేశ్వరమ్మ ఏడాదంతా కష్టపడి పంట పండించారు. ఈ ఏడాది కొడుక్కి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ధాన్యం అమ్మితే డెబ్భై వేలు చేతికి వచ్చాయి. పాత నోట్లు చెల్లవనే ప్రకటనతో చేసేదేమీ లేక చేతిలో ఉన్న డబ్బుని బ్యాంకులో వేశారు. వాటిని తిరిగి ఇమ్మంటే బ్యాంకువాళ్లు చిన్న నోట్లు లేవు, కొత్త నోట్లు రాలేదు పొమ్మంటున్నారు. డిసెంబర్ ఒకటో తేదీన కొడుకు పెళ్లి. పెళ్లి కూతురికి ప్రధానం చీర, సారె పట్టుకెళ్లాలి. చేతిలో డబ్బులేదు. ఇంట్లో ఎవరూ పెళ్లికి కొత్త దుస్తులు కొనుక్కోలేదు. బంధువులను పిలుచు కున్నారు. వారికి విందు భోజనం పెట్టాలంటే దినుసులు కొనడానికి పైసల్లేవు. దిక్కుతోచని పుల్లయ్య పురుగుల మందు డబ్బా అందుకున్నాడు. ‘నా డబ్బు నాకు ఇస్తారా, చావమంటారా’ అంటూ బ్యాంకు ముందు డబ్బా మూత తీశాడు. ఆ చిన్న రైతు బ్యాంకులో దాచుకున్న తన రెక్కల కష్టం తాను తీసుకోవడానికి అంతటి అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది.

ఉపాసమే ఉన్నం!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని తహసిల్దార్ ఆఫీస్‌కు పొయ్యే దారిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. దాని ప్రహరీ ముందు ఓ జంట కనిపిస్తుందెప్పుడూ. అతని పేరు శివరాజ్. ఆమె అతని భార్య. పొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిద్దాక వాళ్లు అక్కడే చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర లేక జనం కూరగాయలే కొనడం లేదు. ఇక చెప్పులు కుట్టించుకునేందుకు ఎవరు వస్తారు? ‘మొన్న ఒకాయన వొచ్చిండు.. కుడి కాలు చెప్పు తెగిపోయింది కుట్టియ్యమని. నా భార్య కుట్టిచ్చింది. పది రూపాయలని జెప్పినం. ‘యాభై నోటుంది.. చిల్లరుందా?’ అని అడిగిండు. అప్పటిదాకా అయిన గిరాకీ నలభై రూపాయలిచ్చి, యాభై నోటు దీస్కున్నం. అంతా సగవెట్టుకొని ఇంటికి వోకుంటా ఏదో సామాన్ దీస్కపోదామని కిరాణ దుకునంకు పోయినం. సామాను దీస్కోని యాభై నోటిస్తే నోటును ఎన్కకు, ముందుకు చూసిన సేఠ్ ‘ఎయ్.. గిది నకిలీ నోటు. చెల్లదు’ అని మా సామాన్ వాపస్ దీస్కోని మా నోటు మాకు ఇచ్చేసిండు. రోజంతా కష్టపడ్డ పైసలు కూడా మాకు దక్కకపోయే. ఏం జేస్తం? ఆ పూట ఉపాసమే ఉన్నం’ అంటూ బాధపడ్డాడు శివరాజ్.

నా పెన్షన్ ఇస్తే అన్నం తింటా!
ఈమె కత్తి లక్ష్మమ్మ. నెల్లూరు జిల్లా కోవూరు. పంచాయతీ కార్మికుల కాలనీలో నివాసం. భర్త పంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తూ మరణించాడు. భర్త మరణానంతరం లక్ష్మమ్మకు ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తోంది. అదే ఆమెకు జీవనాధారం. అయితే 5 నెలల నుంచి ప్రభుత్వం ఫించన్ విడుదల చేయట్లేదు. అందిన చోటల్లా అప్పు చేసి, పొట్ట నింపుకుంటూ ఫించన్ డబ్బు కోసం ఎదురు చూస్తూ గడిపింది. ఇటీవల పెద్ద నోట్ల రద్దుకు ముందు పింఛను డబ్బు ఆమె ఖాతాలో జమ అయింది. దానిని తీసుకుని అప్పులు తీరుద్దామని ఆశతో బ్యాంకుకు వెళితే డబ్బులు లేవనీ, రేపు రావాలనీ పంపేశారు. అలా  రోజూ బ్యాంక్‌కు వెళ్లడం, బ్యాంకు వాళ్లు డబ్బుల్లేవనడం... ఆమె ఉసూరు మంటూ కాళ్లీడ్చుకుంటూ ఇంటికెళ్లడం... చివరకు ఎదురుపడిన అప్పులోళ్లకు ముఖం చూపించలేక ఊరు వదిలి కూతురింటికి వెళ్లిపోయింది. కాలూ చెయ్యి ఆడనప్పుడు బిడ్డ పంచన చేరాలి అని అనుకున్న ఆమె పెద్ద నోట్ల రద్దుతో ఇప్పుడు కూతురి మీద ఆధారపడే స్థితికి చేరుకుంది. ఇది ఆమెను వేదనకు గురి చేస్తోంది.

ఈ లెక్కకు బదులేది?
దేశంలో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బ్యాంకులు లేవు. పెద్ద నోట్ల ఉపసంహరణతో వచ్చే ఇబ్బందుల నుంచి వాళ్ళను గట్టెక్కించే మార్గం ప్రభుత్వం చూసుకోనే లేదు.

పెద్ద నోట్ల దెబ్బతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయి. ఇక, అసంఘటిత రంగంలో దాదాపు 4 కోట్ల మందికి ఉపాధి, ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.

మన ‘స్థూల జాతీయోత్పత్తి’ (జి.డి.పి)లో దాదాపు 40 శాతం నగదు లావాదేవీల ద్వారా జరుగుతుంది.

దేశ యువజనుల్లో నూటికి 31 మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు.

భారత్‌లో దాదాపు 45 కోట్ల మంది శ్రామికులు ఉన్నారు. వారిలో ప్రతి 100 మందిలో 7 మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ 3.1 కోట్ల మందిలో కూడా దాదాపు 2.4 కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వంలో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంటే, మిగతావాళ్ళు ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నారు.

అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న 41.5 కోట్ల మందిలో సగం మంది వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు.

ఇక, భవన నిర్మాణం, చిన్న తరహా తయారీ, రిటైల్ రంగాల్లో ఒక్కోదానిలో 10 శాతం మంది వంతున పనిచేస్తున్నారు.

అసంఘటిత రంగంలో అత్యధిక మంది రోజు వారీ కూలీలే. పెపైచ్చు, ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న కనీస వేతనాల కన్నా తక్కువ సంపాదిస్తున్నవాళ్ళు. కాబట్టి, ఒక రకంగా ప్రభుత్వం ‘అన్ ఎకౌంటెడ్ మనీ’ అని చెబుతున్నదంతా నిజానికి ఇలా చలామణీలో ఉన్న డబ్బే అని విశ్లేషకుల మాట!

2200 కోట్లు  ...ఇది ప్రస్తుతం చెల్లకుండాపోయిన నోట్ల సంఖ్య. ఇన్ని కోట్ల నోట్ల స్థానంలో సరికొత్త నోట్లు తేవడానికి చాలా టైమ్ పడుతుందని ఆర్.బి.ఐ. తేల్చేసింది.

100 కోట్ల పైగా జనాభా ... ఇది మన దేశంలో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న జన సంఖ్య. కానీ, ఆ ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికీ కేవలం 7.8 బ్యాంకు శాఖలే ఉన్నాయి. మనది ‘బ్యాంకులు తక్కువున్న ఆర్థిక వ్యవస్థ’ అనేది అందుకే!

4 శాతం ... ఇది మొత్తం మన దేశ జనాభాలో టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేవారి శాతం.

90 శాతం  ...లావాదేవీలు మన దేశంలో నగదుతోనే జరుగుతాయి.

48.2 కోట్ల మంది ... జీవనోపాధికి ఈ నోట్ల రద్దు దెబ్బతో ముప్పు ఏర్పడింది. మన జనాభాలో వీరంతా డబ్బు రూపంలో సంపాదన చేసేవారే!

ఒక శాతం దొంగల్ని పట్టుకోవడానికి 99 శాతం మందిని బాధిస్తారా?
భారతదేశ ఆర్థికవ్యవస్థ విలువ దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్లు (రూ. 156 లక్షల కోట్లు).

ఇందులో 20 శాతం దొంగ డబ్బే. ఇది ముంబయ్‌కి చెందిన ‘యాంబిట్ క్యాపిటల్’ చెప్పిన లెక్క.

దేశ జి.డి.పి.లో 20 శాతం , దాదాపు రూ. 30 లక్షల కోట్లు (నగదే కాక మిగతావన్నీ కలిపి) దొంగ డబ్బు అని వివిధ సంస్థల అంచనా. దేశంలోని లెక్కచూపని డబ్బులో 60 శాతం కేవలం ఒక శాతం బడాబాబుల దగ్గరుంటే, వాళ్ళను పట్టుకోవడానికి 99 శాతం మంది సామాన్యుల్ని బాధిస్తారా?

ఏ నోట్లు ఎంత ఉన్నాయి?
38 శాతం.... రూ. 1000 నోట్లు

47 శాతం...  రూ. 500 నోట్లు

10 శాతం... రూ. 100 నోట్లు

4 శాతం...  రూ. 100 కన్నా తక్కువ నోట్లు 1 శాతం... చిల్లర నాణాలు

కొత్త నోటు... బాగా ఖర్చే !
30 వేలు... ఇది మొత్తం 2.2 లక్షల ఏ.టి.ఎం.ల్లో ఇప్పటికి కొత్త 2వేల నోటుకి తగ్గట్లు రిపేరైనవాటి సంఖ్య.
12 వేలు... ఇది ప్రతిరోజూ కొత్త నోటుకి తగ్గట్లు  రిపేరవుతున్న ఏ.టి.ఎం.ల సంఖ్య.
రూ.10 వేలు... ఇది ఒక్కో ఏ.టి.ఎం.ను ఇలా కొత్త నోటుకు తగ్గట్లు మార్చడానికయ్యే ఖర్చు.
రూ. 200+ కోట్లు... మొత్తం ఏ.టి.ఎం.లను ఇలా మార్చడానికి అవుతున్న ఖర్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement