అంతటా రద్దీ | Rush over | Sakshi
Sakshi News home page

అంతటా రద్దీ

Published Mon, Dec 26 2016 11:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Rush over

  • కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు
  • కిక్కిరిసిన బ్యాంకులు
  • పాక్షికంగానే పనిచేసిన ఏటీఎంలు 
  •  రెండు రోజుల సెలవు తర్వాత సోమవారం బ్యాంకులు తెరుచుకోవడంతో ఖాతాదారులు పోటెత్తారు. జిల్లా అంతటా చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని బ్యాంకు శాఖల్లోనూ రద్దీ కన్పించింది. 48 రోజులవుతున్నా ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకులకు తగినంత నగదు సరఫరా కాకపోవడంతో రోజూ సర్దుబాట్లు చేయాల్సి వస్తోంది. ఒకేసారి రూ.24 వేలు విత్‌డ్రా తీసుకోవచ్చనే నిబంధన ఉన్నా.. ఇప్పటివరకు ఎక్కడా సాధ్యం కాలేదు. ఖాతాదారులు, నగదు నిల్వలను బట్టి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. అత్యవసరమో లేదా సిఫారసు ఉంటే తప్ప కొంచెం కూడా ఎక్కువ ఇవ్వని పరిస్థితి ఉంది. కరెన్సీ చెస్ట్‌లు కలిగిన ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్, సిండికేట్‌ బ్యాంకు తదితర వాటిలోనూ విత్‌డ్రాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. సర్దుబాట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) ఎంవీఆర్‌ మురళీకృష్ణ, ఏజీఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లాలోని బ్యాంకుల్లో ఎక్కడా 'నోక్యాష్‌' బోర్డు పెట్టకున్నా, నగదు సరఫరా ఆలస్యం కావడంతో కొన్ని శాఖల్లో మధ్యాహ్నం తర్వాత విత్‌డ్రాలు ప్రారంభించారు. మరోవైపు పాత రూ.500, రూ.1,000 నోట్ల డిపాజిట్లు చేసుకునేందుకు విధించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. అయినా పెద్దగా డిపాజిట్లు పెరగలేదని ఏపీజీబీ, సిండికేట్‌, కెనరా, ఆంధ్రా బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. కొన్ని శాఖల్లో మాత్రమే 10 శాతం మేర పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు.  ప్రైవేట్‌, కార్పొరేట్‌ బ్యాంకుల్లో మాత్రం కొంత పెరిగినట్లు సమాచారం. అనంతపురం సాయినగర్‌లోని ఎస్‌బీఐ ప్రధానశాఖలో జనం పోటెత్తారు. రెండు రోజుల సెలవు ప్రభావం స్పష్టంగా కనిపించింది. సామాన్యులు, వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లు, ఉద్యోగులు డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం బారులుతీరారు. ఇక్కడ పోలీసు పçహారా మధ్య లావాదేవీలు కొనసాగాయి. ఏటీఎంల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రధాన బ్యాంకులకు చెందిన ఒకట్రెండు ఏటీఎంలు మినహా మిగతావి పనిచేయలేదు.  అలాగే కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల ఏటీఎంలు పాక్షికంగా పనిచేశాయి. బ్యాంకు వేళలు ముగిసిన తర్వాత తాము ఏటీఎంలలో డబ్బు పెడుతున్నట్లు ఆంధ్రాబ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ పి.అమ్మయ్య తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement