సాక్షి, మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఏ పిల్లలైనా ఆడిపాడడం తప్పా మరో లోకం తెలీదు. కానీ, చిన్నతనంలోనే తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా బావించి బాధ్యతలను తన భుజంపై మోస్తూ.. చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ.. చదువు కోసం పోరాటం చేస్తున్న 11ఏళ్ల బాలుడే వినయ్. ఏ చీకూచింతా లేని ఆ బాలుడి కుటుంబంలో భవన కూలీగా పనిచేసే తండ్రి ప్రమాదవశాత్తు పైఅంతస్తు నుంచి కింద పడి నడుము విరిగిపోవడంతో కష్టాలు చుట్టుముట్టాయి.
తండ్రికి తల్లిలా మారి..
బాలుడి తండ్రి మల్లయ్య భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. అయితే, పని చేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడడంతో మల్లయ్య వెన్నుముక విరిగిపోయింది. నాటి నుంచి మంచంపై నుండి కదల్లేని పరిస్థితి. దీంతో ఇళ్లు గడిచేందుకు ఆదాయం లేకపోవడంతో తల్లి లక్ష్మీ చేసే కష్టం మాత్రమే వీరికి ప్రధాన ఆదాయమైంది. తల్లి ఉదయం కూలి పనికి వెళ్తే తండ్రిని, ఏడాదిన్నర వయస్సున చెల్లిని ఇంటి వద్దే ఉండి చూసుకునే బాధ్యత వినయ్ మీదనే పడింది. ఈ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా ఉపాధ్యాయులు గుర్తించారు.
అనారోగ్యంతో ఉన్న తండ్రి అన్నం తినలేని పరిస్థితి, చిన్న వయస్సు ఉన్న చెల్లి అన్నం తినలేని పరిస్థితి. వారి ఇద్దరికి వినయ్ క్రమం తప్పకుండా అన్నం తినిపించి, సాయంత్రం తల్లివచ్చే వరకు వారి ఆలనా పాలన చూసుకునే వాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్న కానీ చదువుకోవాలని ఉత్సాహం ఉన్న వినయ్ వీరిద్దరినీ చూసుకుటూ చదువుపై ఉన్న మక్కువతో బడికి వస్తున్నాడని గ్రహించారు. దీంతో తన చెల్లిని తనతో పాటు స్కూల్‌కు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు అనుమతించారు. అంతేగాక తండ్రి ఇబ్బందులు తీర్చేందుకు వినయ్ పాఠశాల మధ్యలో వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు.
ఆదుకునేవారు లేక.. అప్పులు చేసి వైద్యం
తండ్రి మలయ్యకు ప్రమాదం జరిగిన తర్వాత కార్మిక శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. ప్రమాదం జరిగిన ఇంటి యజమాని కొంత డబ్బుమాత్రమే ఇచ్చారు. దీంతో వైద్యానికి కొంత మేర డబ్బు సరిపోయిన మిగిలిన డబ్బును అప్పు రూపంలో సమకూర్చారు. దీంతో కుటుంబం అప్పుల పాలైంది. ఇప్పటికి గాయాలు మానకపోవడంతో వారానికి ఓ సారి రూ.2వేల వరకు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ పింఛన్ కోసం దరఖాస్తులు చేశారు. ఇప్పటికి పింఛన్ రాలేదు. ఇళ్లు గడవలేని పరిస్థితి ఇబ్బందులు, భార్యా పిల్లలను పోషించేందుకు మల్లయ్య దిక్కుతోచక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ జాగాను అమ్మేశారు. తన కన్న కొడుకును అందరికంటే బాగా ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలన్న తన కోరిక నెరవేరకపోగా, పిల్లలు తనమూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయాడు.
తల్లీ లక్ష్మీ, కొడుకు నవీన్
చెల్లిని భుజాన ఎత్తుకొని స్కూలుకి..
మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు వినయ్. మల్లయ్య, లక్ష్మి దంపతులకు వినయ్‌తోపాటు ఏడాదిన్నర కూతురు ఉంది. అయితే, మొదటి నుంచి బాలుడికి చదువుకోవాలని ఉత్సాహం ఎక్కువ. పాఠశాలకు విద్యార్థులందరూ ఒక్కరే వెళ్తే వినయ్ మాత్రం తనతో పాటు తన ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న తన చెల్లి గౌతమిని కూడా తనతో పాటు తరగతి గదిలోకి తీసుకెళ్లే వారు. మధ్యాహ్న భోజనం తనకు పెట్టిన భోజనంలో చెల్లికి కూడా తినిపించే వాడు వినయ్. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు ఓ సారి మందలించారు. అంత చిన్న వయస్సు ఉన్న పాపను పాఠశాలకు తీసుకురావద్దని వాదించారు. కానీ వినయ్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చేది కాదు. చివరకు విషయం ఏంటని తెలుసుకునే ఆరా తీసిన ఉపాధ్యాయులకు గుండె తరుక్కు పోయే విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది.
బడి మానిపిస్తారేమోనని..
అమ్మ కూలి పనికి వెళ్లడంతో ఇంటి వద్ద నాన్నకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా నేనే చూసుకోవాలి. చెల్లి చిన్నది కావడంతో ఆమెను పాఠశాలకు తీసుకెళ్లి అన్నం పెట్టాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే చూసుకోవాలి. కొన్ని రోజులు ఇంటి వద్దే ఉన్నా. దీంతో బడి పూర్తిగా మానిపిస్తారేమో అనుకుని, బడికి వెళ్తూ చెల్లిని, నాన్నను చూసుకుంటున్నారు.
– వినయ్, విద్యార్థి
సహాయం చేసి ఆదుకోండి
వెన్నెన్నుముక విరిగాక రెండు కాళ్లు పనిచేయడం లేదు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం. అయినా ఇప్పటికి గాయాలు మానలేదు. సమస్య తీరలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. దీంతో కూలిపనికి వెళ్లి ఒక్కదాన్నే కుటుబాన్ని పోషిస్తున్నా. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దమనసుతో ప్రభుత్వం, సంస్థలు, వ్యక్తులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
– లక్ష్మీ, వినయ్ తల్లి
Comments
Please login to add a commentAdd a comment