బాధితులు నర్సమ్మ, ఆమె మనుమడు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో కులపెద్దల కట్టుబాటుతో ఓ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంచాయితీ పెద్దలను గౌరవించలేదని ఆ కుటుంబంపై కక్షగట్టారు. కులస్తులు దూరంగా ఉండాలని ఆంక్షలు విధించారు. దీంతో బాధిత కుటుంబంలో వ్యక్తి మృతిచెందినా అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేదు. చివరకు అంత్యక్రియలకు సాయపడిన ఓ సామాజిక కార్యకర్తపై కూడా కన్నెర్ర చేశారు. అతడి కిరాణా షాపులో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయొద్దని కట్టుబాటు విధించారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.. మగ్గిడి ఎల్లయ్య (93)కు ముగ్గురు కుమార్తెలు. ఇందులో చిన్న కుమార్తెకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపగా, మిగతా ఇద్దరు కుమార్తెలు మగ్గిడి నర్సమ్మ, మగ్గిడి భూమవ్వలకు ఇల్లరికం పెళ్లి చేశాడు. తనకున్న భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని తన పోషణ అనంతరం సమంగా తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో భూమవ్వ తనను పోషించడం లేదని కొద్దిరోజుల క్రితం తన పేరున ఉన్న భూమిని నర్సమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. దీంతో కొంతకాలంగా నర్సవ్వ, భూమవ్వల మధ్య భూవివాదం కొనసాగుతోంది.
ఇదే అంశంపై భూమవ్వ కుల పెద్దలను ఆశ్రయించగా పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 7న ఉదయం ఎల్లయ్య మృతిచెందాడు. దీంతో తాము చెప్పిన తీర్పునకు కట్టుబడి ఉంటేనే అంత్యక్రియలకు హాజరవుతామని కులపెద్దలు తేల్చిచెప్పారు. కులస్తులు ముందుకు రాకపోవడంతో నర్సమ్మ సాయంత్రం వరకూ ఎదురుచూసింది. దీంతో అంత్యక్రియలకు సహకరించాలని బాధితులు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కాసారపు రమేశ్‌తోపాటు మరికొందరిని సంప్రదించగా వారు ముందుకొచ్చి కార్యక్రమం పూర్తి చేశారు.
దీంతో రమేశ్ కిరాణా దుకాణానికి ఎవరూ వెళ్లవద్దని కులపెద్దలు కట్టుబాటు పెట్టారు. దీంతో 17 రోజులుగా ఎవరూ రమేశ్ కిరాణా దుకాణానికి వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో మగ్గిడి నర్సవ్వతో పాటు, ఆమె మనుమడు, కాసారపు రమేశ్‌లు గురువారం జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కులపెద్దల అరాచకంపై ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment