సాదాసీదా కాదు!
♦ ‘సాదా బైనామా’లో అనేక ఇబ్బందులు
♦ రిజిస్ట్రేషన్లకు అడ్డుతగులుతున్న ‘సమ్మతి’
♦ భూముల ధరలు పెరగడంతో కిరికిరి
♦ నిబంధనల్లో సడలింపులు కోరుతున్న రైతులు
నక్కర్తమేడిపల్లికి చెందిన ఓ భూస్వామి అప్పట్లో తన వ్యవసాయ బావి వద్ద వెట్టిచాకిరీ చేస్తున్నందుకు ఓ పేద రైతుకు రెండెకరాలు తెల్లకాగితంపై రాసిచ్చాడు. ఇప్పటివరకు ఆ రైతు దాన్ని మ్యుటేషన్ చేయించుకోలేదు. ‘సాదాబైనామా’ ప్రకటన తెలుసుకుని భూస్వామిని ‘సమ్మతి’ కోసం కలిశాడు. అప్పట్లో రేట్లు లేక ఎంతపడితే అంతకు ఇచ్చినం. ఇప్పుడు ఆ భూమి నీకు పట్టా కావాలంటే.. ఇప్పటి ధరలో సగమన్నా ఇవ్వమని మెలిక పెట్టాడు.
యాచారం: సాదా బైనామాల (తెల్లకాగితంపై జరిగిన క్రమవిక్రయాలు) క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో చాలా మంది రైతులు సంతోషించారు. కానీ మార్గదర్శకాలు చూసి దీని వల్ల ప్రయోజనం కొంతేనని నిట్టూర్చుతున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో యాచారం, మంచాల మండలాల్లోనే సాదా బైనామాలకు అవకాశం ఉంది. మంచాల, యాచారం మండలాల్లో పది గ్రామాల వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో సాదా బైనామాలకు వీల్లేదు.
మిగతా గ్రామాల్లో 2014 జూన్ 2లోపు భూముల క్రయ, విక్రయాల కోసం రాసుకున్న తెల్ల కాగితాలకు సెక్షన్ 22 (2) ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్‌బుక్స్ చట్టం మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సాదా బైనామాల పేరు తో ప్రభుత్వం తెల్లకాగితాలపై రాసుకున్న భూ క్రయ, విక్రయాలకు రిజి్ర స్టేషన్, మ్యూటేషన్, పట్టాదారు, పా సుపుస్తకాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించడం సంతోషకరమైన విషయమైనప్పటికీ.. ఇది ఎంత వరకు ఫలితాలనిస్తుందనేది తేలాల్సి ఉంది.
భూముల ధరల పెరుగుదలతో చిక్కులు..
పదేళ్ల కింద ఇబ్రహీంపట్నం డివిజన్‌లో కేవలం ఇబ్రహీంపట్నం పట్టణం మినహా యాచారం, మంచాల మండలాల పరిధి గ్రామాల్లోని భూములకు పెద్దగా ధరల్లేవు. అప్పట్లో కొందరు భూస్వాములు తమవద్ద వెట్టిచాకిరీ చేసినందుకు కొందరికి తెల్లకాగితంపై రాసిచ్చారు. ఏళ్ల క్రితం అంతోఇంతో ఇచ్చి తెల్లకాగితంపై సంతకాలు తీసుకుని సొంతం చేసుకున్నవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని పట్టాలు అవగా మరికొన్ని తెల్లకాగితంపైనే ఒప్పదంగా అయి ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాల పేరుతో ఉచిత రిజిస్ట్రేషన్‌కు సడలింపు ఇవ్వడం, భూముల ధరలు రూ.లక్షల్లో పెరగడం వల్ల సాదా బైనామాలకు విక్రయదారులు ససేమిరా అంటున్నారు. కొన్ని గ్రామా ల్లో కొనుగోలు దారులు, విక్రయదారుల కుటుంబ సభ్యులను కలిసి అంతోఇంతో ఇచ్చుకుంటామంటూ భేరసారాలు చేసుకుంటున్నారు. యాచారం మండలంలోని నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, మాల్, మంతన్‌గౌరెల్లి, చింతపట్ల, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, నల్లవెల్లి, మంచాల మండలంలోని లోయపల్లి, ఆరుట్ల, మంచాల, ఎల్లమ్మతండా తదితర గ్రామాల్లో అప్పట్లో తెల్లకాగితాలపై జరిగిన క్రయవిక్రయాలు అనేకం ఉన్నాయి.