plain bainama
-
సాదా బైనామాపై పలు సందేహాలు
కొత్తగూడెం : సాదా బైనామాపై సవాలక్ష సందేహాలు.. అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడేందుకు.. మరికొందరు ఎలాగైనా తమ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సైతం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు పహాణీలోకి ఎక్కకపోవడం.. పట్టాదారు పాస్‌పుస్తకాలు సైతం లేకపోవడం తో ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భూములను పహాణీలో ఎక్కించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో మై దాన ప్రాంత పరి స్థితులు వేరే ఉండగా.. ఏజెన్సీలో మా త్రం దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1969 తర్వాత గిరిజనేతరు లు క్రయవిక్రయాలు చేస్తే అవి చట్టవిరుద్ధం కావడంతో.. 1970 తర్వాత గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూ ములను క్రమబద్ధీకరించుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అసలు అధికారులు విచారణ ఏ ప్రాతిపదికన చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడమే.. మైదాన ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో గతంలో అమ్మిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొంద రు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తమకున్న భూమిలో కొంత మేరకు మాత్రమే అమ్మిన వారు.. కొనుగోలు చేసిన వారు ఎంత మేరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై గందరగోళం నెల కొంది. మరికొన్ని చోట్ల అమ్మకం చేసిన వ్యక్తు లు కొనుగోలుదారుల వద్ద నుంచి ఎంతో కొం త రాబట్టుకునేందుకు అబ్జెక్షన్ దరఖాస్తులు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్ర స్తుతం మైదాన ప్రాంతంలో దీనిపైనే ప్రధాన చర్చ జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏజెన్సీ ప్రాంతంలో దీనికి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1969 తర్వాత గిరిజనేతరుల భూముల అమ్మకాలు, కొనుగోలు నిషేధించడంతో ఇప్పటికే వారి వద్ద నుంచి కొనుగోలు చేసి.. సాగు చేసుకుంటున్న రైతులు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులున్నాయి. ప్రహాసనమేనా.. సాదా బైనామా ప్రక్రియ ప్రహాసనంలా మారనుందనే ప్రశ్నకు రెవెన్యూ వర్గాలు అవుననే సమాధామిస్తున్నాయి. సాధారణంగా పహాణీ లో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుం టే.. కనీసం 6 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాకు సిద్ధం కావడంతో 2,01,762 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం డివిజన్లో అత్యధికంగా 1,28,769, కొత్తగూడెం డివిజన్లో 52,119, పాల్వంచ డివిజన్లో 19,337, భద్రాచలం డివిజన్లో 1,537 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో రెవెన్యూ శాఖ సతమతమవుతుండటం.. ఉన్న పనులే సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొనడంతో.. ప్రస్తు తం సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎన్నేళ్లు పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలెన్నో... ⇔ అధికారులు విచారణ సమయంలో అమ్మకం, కొనుగోలుదారుల వాంగ్మూలం స్వీకరిస్తారా? ⇔ హద్దులు లేని అగ్రిమెంట్లను ఏ ప్రాతిపదికన చేస్తారు? ⇔ అమ్మకందారులు మరణిస్తే వారి వారసుల వాంగ్మూలం సేకరిస్తారా? ⇔ పంపకాలు జరగని వారసత్వ భూములను ఎలా క్రమబద్ధీకరిస్తారు? ⇔ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ నిలిచేనా? ⇔ ఏజెన్సీలో నకిలీ డాక్యుమెంట్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? ⇔అమ్మకందారులు స్థానికంగా లేనిపక్షంలో వారి వాంగ్మూలం సేకరణ పరిస్థితి ఏమిటి? ⇔ సాదా బైనామాకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారా? ⇔ వివాదంలో ఉన్న భూముల అడ్డదారి క్రమబద్ధీకరణ నిలిచేనా? ⇔ డాక్యుమెంట్ రాత సమయంలో సాక్షుల సంతకాలు లేకుంటే వాటి పరిస్థితి ఏమిటి? -
సాదా బైనామాకు వచ్చిన దరఖాస్తులు2,01,762
అత్యధికం ఖమ్మం, అత్యల్పం భద్రాచలం ఖమ్మం జెడ్పీసెంటర్: సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,01,762 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఖమ్మం డివిజన్ పరిధిలో 1,28,769; అత్యల్పంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,537 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం భూములు అమ్మిన, కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇస్తారు. వారి సమక్షంలో రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ తరువాత, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ధరలు పెరగడంతో... అనేక ఏళ్ళ క్రితం అమ్మిన భూములకు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనుండడంతో విక్రయదారులు ఆ భూములపై మెలిక పెట్టి, అందినంద దండుకునే అవకాశముంది. ఈ పరిస్థితి, గ్రా మాల్లో ఘర్షణ వాతావరణం సృష్టించవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారుల్లో వణుకు ప్రతి సొమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌లో ప్రతిసారి వచ్చే దరఖాస్తుల్లో 80 శాతం వరకు భూసమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ‘నా తండ్రి పేరుతో ఉన్న భూమిని ఫలానా వీఆర్వో, తహసీల్దార్ కలిసి నాకు తెలియకుండా నా అన్నకు పాస్ బుక్ ఇచ్చారు’, ‘నా భూమి పాస్ పుస్తకాలను నా పక్క రైతుకు ఇచ్చా రు’ ఇలా, అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకా ఇతరత్రా ఫిర్యాదులు, సమస్యలు అనే కం ఉన్నాయి. వీటన్నింటిని ఒక కొలిక్కి తేవడం రెవెన్యూ అధికారులకు ఇబ్బందికరంగా పరిణమించనుంది. -
సాదాసీదా కాదు!
♦ ‘సాదా బైనామా’లో అనేక ఇబ్బందులు ♦ రిజిస్ట్రేషన్లకు అడ్డుతగులుతున్న ‘సమ్మతి’ ♦ భూముల ధరలు పెరగడంతో కిరికిరి ♦ నిబంధనల్లో సడలింపులు కోరుతున్న రైతులు నక్కర్తమేడిపల్లికి చెందిన ఓ భూస్వామి అప్పట్లో తన వ్యవసాయ బావి వద్ద వెట్టిచాకిరీ చేస్తున్నందుకు ఓ పేద రైతుకు రెండెకరాలు తెల్లకాగితంపై రాసిచ్చాడు. ఇప్పటివరకు ఆ రైతు దాన్ని మ్యుటేషన్ చేయించుకోలేదు. ‘సాదాబైనామా’ ప్రకటన తెలుసుకుని భూస్వామిని ‘సమ్మతి’ కోసం కలిశాడు. అప్పట్లో రేట్లు లేక ఎంతపడితే అంతకు ఇచ్చినం. ఇప్పుడు ఆ భూమి నీకు పట్టా కావాలంటే.. ఇప్పటి ధరలో సగమన్నా ఇవ్వమని మెలిక పెట్టాడు. యాచారం: సాదా బైనామాల (తెల్లకాగితంపై జరిగిన క్రమవిక్రయాలు) క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో చాలా మంది రైతులు సంతోషించారు. కానీ మార్గదర్శకాలు చూసి దీని వల్ల ప్రయోజనం కొంతేనని నిట్టూర్చుతున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో యాచారం, మంచాల మండలాల్లోనే సాదా బైనామాలకు అవకాశం ఉంది. మంచాల, యాచారం మండలాల్లో పది గ్రామాల వరకు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో సాదా బైనామాలకు వీల్లేదు. మిగతా గ్రామాల్లో 2014 జూన్ 2లోపు భూముల క్రయ, విక్రయాల కోసం రాసుకున్న తెల్ల కాగితాలకు సెక్షన్ 22 (2) ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్‌బుక్స్ చట్టం మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సాదా బైనామాల పేరు తో ప్రభుత్వం తెల్లకాగితాలపై రాసుకున్న భూ క్రయ, విక్రయాలకు రిజి్ర స్టేషన్, మ్యూటేషన్, పట్టాదారు, పా సుపుస్తకాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించడం సంతోషకరమైన విషయమైనప్పటికీ.. ఇది ఎంత వరకు ఫలితాలనిస్తుందనేది తేలాల్సి ఉంది. భూముల ధరల పెరుగుదలతో చిక్కులు.. పదేళ్ల కింద ఇబ్రహీంపట్నం డివిజన్లో కేవలం ఇబ్రహీంపట్నం పట్టణం మినహా యాచారం, మంచాల మండలాల పరిధి గ్రామాల్లోని భూములకు పెద్దగా ధరల్లేవు. అప్పట్లో కొందరు భూస్వాములు తమవద్ద వెట్టిచాకిరీ చేసినందుకు కొందరికి తెల్లకాగితంపై రాసిచ్చారు. ఏళ్ల క్రితం అంతోఇంతో ఇచ్చి తెల్లకాగితంపై సంతకాలు తీసుకుని సొంతం చేసుకున్నవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని పట్టాలు అవగా మరికొన్ని తెల్లకాగితంపైనే ఒప్పదంగా అయి ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాల పేరుతో ఉచిత రిజిస్ట్రేషన్‌కు సడలింపు ఇవ్వడం, భూముల ధరలు రూ.లక్షల్లో పెరగడం వల్ల సాదా బైనామాలకు విక్రయదారులు ససేమిరా అంటున్నారు. కొన్ని గ్రామా ల్లో కొనుగోలు దారులు, విక్రయదారుల కుటుంబ సభ్యులను కలిసి అంతోఇంతో ఇచ్చుకుంటామంటూ భేరసారాలు చేసుకుంటున్నారు. యాచారం మండలంలోని నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, మాల్, మంతన్‌గౌరెల్లి, చింతపట్ల, మొండిగౌరెల్లి, కొత్తపల్లి, నల్లవెల్లి, మంచాల మండలంలోని లోయపల్లి, ఆరుట్ల, మంచాల, ఎల్లమ్మతండా తదితర గ్రామాల్లో అప్పట్లో తెల్లకాగితాలపై జరిగిన క్రయవిక్రయాలు అనేకం ఉన్నాయి. -
‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణకు ఓకే
♦ జిల్లా కలెక్టర్లకు అధికారాలిస్తూ సర్కారు ఉత్తర్వులు ♦ క్లెయిముల స్వీకరణకు ఆఖరు తేదీ జూన్ 15 సాక్షి, హైదరాబాద్: తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా ఊపింది. సెక్షన్ 22(2) ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టం మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ విన్నపం మేరకు జూన్ 2, 2014లోపు తేదీలు ఉన్న సాదా బైనామాలను రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. క్లెయిమ్‌ల వన్‌టైమ్ సెటిల్మెంట్ అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్ప గించింది. క్లెయిమ్‌ల స్వీకరణకు గడువును జూన్ 15గా నిర్ణయించింది. ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హక్కు బదిలీ, కేటాయింపు కోరుకునే సాదాబైనామా జూన్ 2, 2014కు ముందు రాసుకున్నదై ఉండాలి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదు. ఉత్తర్వుల అమలుపై తగిన చర్యలు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ , అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్ట్రేషన్లు ఇలా... రిజిస్ట్రేషన్ కోరుకునేవారు ఫారమ్ 10తో పాటు సాదా బైనామా జిరాక్స్ ప్రతిని జతచేసి సంబంధిత మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలన అనంతరం ఫారమ్ 11 ద్వారా నోటీసులుచ్చి తహసీల్దారు సదరు ఆస్తిపై విచారణ చేయిస్తారు. అనంతరం ఫారమ్ 10లో కోరిన భూమిని దరఖాస్తుదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆ ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్‌కు తహసీల్దారు సిఫారసు చేస్తా రు. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓనరుతో ఎంతమాత్రం పనిలేదు. లబ్ధిదారులు ఒక్క రూపాయి చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సాదాబైనామా క్రమబద్ధీకరణ అవకాశం ద్వారా ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు లక్షన్నర మంది వ్యవసాయదారులకు తాజా ప్రక్రియ ద్వారా లబ్ధిచేకూరనుంది.