అత్యధికం ఖమ్మం, అత్యల్పం భద్రాచలం
ఖమ్మం జెడ్పీసెంటర్: సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,01,762 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఖమ్మం డివిజన్ పరిధిలో 1,28,769; అత్యల్పంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,537 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం భూములు అమ్మిన, కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇస్తారు. వారి సమక్షంలో రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ తరువాత, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తారు.
ధరలు పెరగడంతో...
అనేక ఏళ్ళ క్రితం అమ్మిన భూములకు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనుండడంతో విక్రయదారులు ఆ భూములపై మెలిక పెట్టి, అందినంద దండుకునే అవకాశముంది. ఈ పరిస్థితి, గ్రా మాల్లో ఘర్షణ వాతావరణం సృష్టించవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రెవెన్యూ అధికారుల్లో వణుకు
ప్రతి సొమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌లో ప్రతిసారి వచ్చే దరఖాస్తుల్లో 80 శాతం వరకు భూసమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ‘నా తండ్రి పేరుతో ఉన్న భూమిని ఫలానా వీఆర్వో, తహసీల్దార్ కలిసి నాకు తెలియకుండా నా అన్నకు పాస్ బుక్ ఇచ్చారు’, ‘నా భూమి పాస్ పుస్తకాలను నా పక్క రైతుకు ఇచ్చా రు’ ఇలా, అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకా ఇతరత్రా ఫిర్యాదులు, సమస్యలు అనే కం ఉన్నాయి. వీటన్నింటిని ఒక కొలిక్కి తేవడం రెవెన్యూ అధికారులకు ఇబ్బందికరంగా పరిణమించనుంది.