Land regulation
-
ఎల్ఆర్ఎస్ పిడుగు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్).. రాష్ట్రంలో లక్షలాది మందిని ఇరకాటంలో పడేసింది. లే–అవుట్లు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాపురించింది. గ్రామాలు, పట్టణాల్లో లే–అవుట్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. నూతన విధానంతో ప్లాట్లు క్రమబద్ధీకరణ ఫీజు అధికంగా ఉండటంతో ఆ మేరకు వెచ్చించడం పేదలకు భారంగా మారింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్లీ రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,569 లే–అవుట్లు ఉండగా.. వాటిలో 3,568కు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి. 11,001 లే–అవుట్లకు ఎలాంటి అనుమతులు లేవు. అనధికార లే–అవుట్లు అని తెలియక చాలామంది భవిష్యత్తు, ఇతర అవసరాల దృష్ట్యా ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటిలో రెండు, మూడుసార్లు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనధికార లే–అవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండి ఉంటే తాము జాగ్రత్త పడి ఉండేవారమని బాధితులు చెబుతున్నారు. ఇదిలాఉండగా అక్రమ లే–æఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అక్రమ లే–అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్ల క్రయవిక్రయాలు నిషేధించడం, బోర్డులు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు గతంలో ఇవేమీ పట్టించుకోకపోవడంతోనే తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రియల్’వ్యాపారులకు వరం అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ చాలామంది సామాన్యులపై భారం మోపుతుండగా, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం వరంగా మారింది. రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి అమాయకులకు అంటగట్టారు. తాజాగా ఎల్ఆర్ఎస్ అమలుతో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలపై చార్జీల భారం పడింది. ఇదిలాఉండగా జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి లేకుండానే నాలా కన్వర్షన్ చేయకుండా, సరైన రోడ్లు, కనీస వసతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లకు ఎల్ఆర్ఎస్ వరంగా మారింది. ఎల్ఆర్ఎస్ చార్జీ చెల్లించడం ద్వారా అక్రమ లే–అవుట్లు సక్రమంగా మార్చుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లు ఈ ప్లాట్లు విక్రయించేటప్పుడు ఎల్ఆర్ఎస్ సైతం కలుపుకొని ధరలు పెంచి చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్‌లో ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఇలా.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3,416 లే–అవుట్లు ఉండగా వాటిలో 1,609కి మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1,014 లే–అవుట్లు ఉండగా 296, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,480 లే–అవుట్లకు గాను 489, నిజామాబాద్ జిల్లాలో 952 లే–అవుట్లకు 176, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో 825కు 223, నాగర్‌కర్నూల్ జిల్లాలో 676 లే–అవుట్లు ఉంటే 72కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో 58, జగిత్యాలలో 170 లే–అవుట్లు ఉంటే వాటిలో ఒక్క దానికి అనుమతి లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బుజగౌని రాఘవేందర్‌గౌడ్. మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో సర్వే నం.375/ఆ లో 150 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఆ ప్లాట్లు అక్రమమని, ఎల్ఆర్ఎస్ చెల్లించాలని మున్సిపల్ అధికారులు చెప్పడంతో ఆందోళనలో పడ్డాడు. అయితే.. అప్పుడే అక్రమమని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపితే కొనేవాళ్లమే కాదని, ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవంటున్నాడు. ఇతనొక్కడే కాదు రాష్ట్రంలో అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరిదీ ఇదే ఆవేదన. రాష్ట్రంలో మొత్తం లే–అవుట్లు: 14,569 లే–అవుట్ల పరిధిలో ప్లాట్లు: 16,22,681 ప్లాట్ల విస్తీర్ణం (ఎకరాల్లో): 1,22,338.24 అనుమతులు లేని లే–అవుట్లు: 11,001 వాటి పరిధిలో ప్లాట్లు: 12,14,574 విస్తీర్ణం: 83,452.12 అనుమతులున్న లే–అవుట్లు: 3,568 వాటి పరిధిలో ప్లాట్లు: 4,08,107 విస్తీర్ణం: 38,886.12 -
లక్కీ చాన్స్!
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న, సాగు భూములుగా వినియోగించుకుంటున్న వారు.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు మార్లు ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ.. మరోమారు అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆక్రమిత స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసి సఫలీకృతమైంది. గతంలోనే జీవో.నెం 59 ద్వారా ఆక్రమిత నివాస గృహాల స్థలాలకు సాధారణ మార్కెట్ ధర ప్రకారం లబ్ధిదారుల పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులు దీన్ని సద్వినియోగం చేసుకోలేదని నిర్ధారించుకున్న ప్రభుత్వం మరోమారు అవకాశమిచ్చింది. అంతే కాకుండా పలు కారణాలతో గతంలో తిరస్కరించిన దరఖాస్తులకు కూడా ఈ విడతలో పరిష్కరించాలని నిర్ణయించింది. గతంలో ఆఫ్‌లైన్‌లో సాగిన ఈ ప్రక్రియ ఈ సారి ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి గాను మొదటిసారిగా జీవో.166ను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం 200 చదరపు గజాల విస్తీర్ణం మేర రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తులలో అర్హత ఉంటే వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఆమోదం మేరకు ఆక్రమణదారులకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కాగా ప్రస్తుత క్రమబద్ధీకరణ ప్రక్రియను భూపరిపాలన చీ ఫ్ కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగుతోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జీవో.179 విడుదల... ప్రభుత్వ స్థలాల, భూముల ఆక్రమణకు సంబంధించి క్రమబద్ధీకరణకు గాను ప్రభుత్వం తాజాగా జీవో.179 విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ మరోమారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి 20015లో జీవో.58, 59లను జారీచేశారు. జీవో 58 కింద 125 గజాలలోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారికి ఉచితంగా రెగ్యులరైజ్ చేశారు. జీవోనెం.59 ప్రకారం 125 గజాలకు పైగా ఆక్రమించుకున్న వారికి మార్కెట్ ధరపై (నామినల్ రేట్) ప్రకారం క్రమబద్ధీకరించారు. ఆక్రమించుకున్న స్థలంలో శాశ్వత కట్టడం (ఇళ్లు నిర్మించుకొని) ఉంటేనే రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. ఖాళీ స్థలాలు ఉన్న పక్షంలో క్రమబద్ధీకరణకు అనర్హులని షరతు పెట్టారు. దీంతో అప్పట్లో ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకున్నా..ఇంకా చట్టబద్ధత లేని ఆక్రమిత స్థలాలు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ముఖ్యంగా మండల కేంద్రాల్లో ఈ ఆక్రమణలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల సూచనల మేరకు మరోమారు ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకున్న వారికి, వేయి చదరపు గజాల కంటే ఎక్కువ ప్రభుత్వ భూములను అనధికారికంగా కబ్జాలో ఉంచుకున్నవారికి ఆ భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కులు పొందేందుకు గాను తాజాగా జీవోనెం.179ను జారీచేశారు. ఆక్రమణ స్థలం మార్కెట్ రేటు ప్రకారం ఎంత చెల్లించాలనేది నిర్ణయిస్తారు. రెండు, మూడు వాయిదాల్లో ఈ సొమ్మును చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. గతంలో తిరస్కరించిన, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఈ దఫా మోక్షం కలిగించాలని ప్రభుత్వం సూచించింది. ఈనెల 15వతేదీ నుంచి ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. వచ్చేనెల 15వతేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. -
సింగరేణి భూముల ‘క్రమబద్ధీకరణ’!
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా మందమర్రి, నర్సపూర్, బెల్లంపల్లి మండలాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) భూముల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడు మండలాల్లోని 789.24 ఎకరాల్లో కబ్జాలో ఉన్న పేదలకు భూములను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖ బుధవారం జీవో నంబర్ 187 విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో 125 గజాల లోపు ఉంటే ఉచితంగా, ఆపైన ఉంటే మార్కెట్ ధరను తీసుకుని క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలివీ.. - క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు (పట్టణ ప్రాంతాల్లో), రూ.1.50 లక్షల (గ్రామీణ ప్రాంతాల్లో) లోపు ఉండాలి. - 125 గజాల్లోపు భూమి కోసం ఆధార్ కార్డు లేదా మరో ఇతర డాక్యుమెంట్‌తోపాటు కబ్జాలో ఉన్నట్టుగా ధ్రువీకరించేందుకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను, విద్యుత్, నీటి తీరువా చెల్లింపు బిల్లులు, ఇతర డాక్యుమెంట్లు దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. - ఆర్డీవోల నేతృత్వంలో తహసీల్దార్ మెంబ ర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వాటిని అసైన్ చేస్తుంది. ఈ ఉత్తర్వులు వెలువడిన 6 నెలల్లోపు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. - అసైన్ చేసిన రోజు నుంచి పదేళ్ల తర్వాతే అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. - 125 గజాల కన్నా ఎక్కువ ఉన్న భూమి క్రమబద్ధీకరణకు ప్రస్తుతమున్న మార్కెట్ ధరలో 25 శాతం మొత్తాన్ని డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 2 వాయిదాల్లో 6 నెలల్లోపు చెల్లించాలి. అసైన్ చేసిన తర్వాత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలకు మినహాయింపు ఉంటుంది. -125 గజాలలోపు భూమి విషయంలో జిల్లా కలెక్టర్లకు అప్పీలు చేసుకోవచ్చు. ఆ పై మాత్రం సీసీఎల్ఏ కార్యా లయంలో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. -
125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై గతంలో జారీ చేసిన జీవోల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులు (జీవో 179) జారీ చేశారు. 2008లో జారీ చేసిన జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారికి జీవో 59 కింద భూములను క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడంతోపాటు మూడు విడతల్లో రుసుము చెల్లించే అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో 134 అమలుకు మార్గదర్శకాలను అందులో పొందుపరిచారు. ఈ జీవో ప్రకారం... - 125 గజాలు పేద వర్గాల చేతుల్లో ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. పేదల చేతిలో 150 గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్రపు మార్కెట్ విలువను చెల్లించాలి. - 150 గజాల్లోపు భూములు నోటిఫైడ్, గుర్తించిన మురికివాడల్లో ఉంటే 10 శాతం మార్కెట్ విలువ చెల్లిస్తే చాలు. - 250 గజాల్లోపు 25 శాతం, 500 గజాల్లోపు 50 శాతం, 1,000 గజాల్లోపు 75 శాతం, 1,000 గజాలు దాటితే పూర్తి మార్కెట్ విలువను చెల్లించాలి. - ఖాళీ స్థలాలకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా పూర్తి మార్కెట్ విలువ చెల్లించాలి. - జీవో 58, 59 తరహాలోనే ఆన్లైన్ విధానంలో, దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ ఆధారంగా పరిశీలన నిర్వహించాలి. - వెబ్‌పోర్టల్‌ను ఈ నెల 15లోగా సిద్ధం చేసి అక్టోబర్ 15లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలి. - దరఖాస్తులను స్వీకరించిన వెంటనే ఆన్లైన్లోనే నోటీసు జారీ చేయాలి. 1,000 గజాలు దాటితే దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించాల్సిందే. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే సంబంధిత తహసీల్దారే కన్వేయన్స్ డీడ్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. - దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, క్రమబద్ధీకరణ ప్రక్రియ అంతా 2019 జనవరి 31లోగా పూర్తి చేయాలి. మూడు వాయిదాలు... దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణ రుసుమును మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. తొలి వాయిదాను నవంబర్ 1లోగా, రెండో వాయిదాను డిసెంబర్ 1లోగా, మూడో వాయిదాను 2019 జనవరి 1లోగా చెల్లించాలి. ఏకకాలంలో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభించనుంది. -
మళ్లీ ఎల్ఆర్ఎస్ మేళా..!
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి గ్రేటర్ అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువును ఎన్నిసార్లు పొడిగించినా, పూర్తిస్థాయిలో పరిష్కారం కావడంలేదు. జీహెచ్ఎంసీకి మొత్తం 85,260 దరఖాస్తులు రాగా, చెరువులు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, యాజమాన్య హక్కులపై కోర్టు వివాదాలు, ప్రభుత్వస్థలాలు, యూఎల్సీ విభాగం నుంచి ఎన్వోసీలు తెచ్చుకోని వారికి సంబంధించిన దరఖాస్తుల్ని తిరస్కరించారు. అవి పోను మిగతా 71,944 దరఖాస్తుల్లో ఇప్పటికీ ఫీజులు చెల్లించకపోవడం, అవసరమైన పత్రాలు సమర్పించకపోవడంతో 4,997 దరఖాస్తులు పెండింగ్‌లో ఉ న్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జోనల్ కార్యాలయాల్లో ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ డైరెక్టర్(ప్లానింగ్) శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆన్లైన్ సమస్యలు పరిష్కరించేందుకు సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) సేవలు వినియోగించుకుంటామన్నారు. ఫీజులకు సంబంధించిన డీడీలు చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైన వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ టాప్ : భవన నిర్మాణ దరఖాస్తులు, అనుమతుల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల దాకా అన్నింటా ఎల్బీనగర్ జోన్ అగ్రభాగాన ఉంది. పెండింగ్ దరఖాస్తుల్లోనూ ఎల్బీనగర్ జోన్‌వే అత్యధికంగా 3,230 దరఖాస్తులున్నాయి. -
చుక్కల భూమిలో అమలుకాని హక్కులు
చుక్కల భూములపై యాజమాన్య హక్కులు రైతులకు దక్కేలా కనిపించడం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ భూములపై అన్నదాతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం వచ్చి పదినెలలవుతున్నా దీనిపై రైతులకు అవగాహన కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. దీంతో పరిమిత సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించేందుకు తహసీల్దార్లు సుముఖత చూపకపోవడంతో హక్కుల కోసం రైతన్నలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు, మదనపల్లె: జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లోనున్న చుక్కల భూముల హక్కులపై రైతులకు అవగాహన కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారు. ఈ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2017 జూన్ 14న చట్టం అమల్లోకి తెచ్చింది. జూలై 17న మార్గదర్శకాలను విడుదల చేసింది. భూములపై హక్కులు కల్పించాలని రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 56,378 మంది రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 23 మండలాల్లోని భూములకు 985 దరఖాస్తులు అందాయి. ఇందులో చాలా దరఖాస్తులు పరిశీలనకు రాకపోవడం గమనార్హం. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో 135 దరఖాస్తులను క్రమబద్ధీకరణ కోసం కలెక్టర్ వద్దకు పంపితే 85 పరిష్కారమయ్యాయి. అందులో 54మందికి హక్కు కల్పించి, 31మందిని వివిధ కారణాల చేత తిరస్కరించారు. జిల్లాలోని పీలేరు, వాల్మీకిపురం, కలికిరి, తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో ఎక్కువ సంఖ్యలో చుక్కల భూములు ఉన్నాయి. చట్టం ఏం చెబుతోందంటే... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1954లో భూముల రీసర్వే జరిగింది. రికార్డుల్లో సర్వే నంబర్ల వారీగా ఖాతాదారుల పేర్లు లేని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు(డాట్స్) పెట్టారు. చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు నిషేధించేందుకు ఆ భూములను ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ (పీవోబీ) నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ చట్టాన్ని 2017 జూన్ 11న చేశారు. జూలై 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్న భూములకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. చట్టం చేసిన నాటికి 12 ఏళ్లు భూమి స్వాధీనానుభవంలో ఉండాలి. రైతులు ఫారం–3లో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను బట్టి అధికారులు గ్రామసభ నిర్వహించి ఈ భూముల రైతులను నిర్ధారించుకోవాలి. నివేదికలు ఆర్డీవోలకు, అక్కడి నుంచి జిల్లాస్థాయి కమిటీకి వెళతాయి. కమిటీ ఆరునెలల్లోగా అర్జీలను పరిశీలించి ఈ భూములకు ఆమోదం తెలిపిన తర్వాత రీసెటిల్మెంట్ రిజిస్టర్ కాలం(16) కింద చుక్కల స్థానంలో పట్టాదారుల పేర్లు చేర్చుతుంది. తహసీల్దార్ల నిర్లక్ష్యం తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్న అర్జీల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఆయా సాగుదారులు ఈ భూముల్లో సాగుచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని స్వయంగా విచారించాలి. వారితో స్టాంప్ పేపర్లపై అఫిడవిట్లు తయారు చేయించి నోటరీ ద్వారా నిర్థారణ చేసుకోవాలి. కాని తహసీల్దార్లు కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదికలనే జిల్లాస్థాయి కమిటీలకు పంపుతున్నారు. మరోవైపు దరఖాస్తుదారులకు దస్త్రాల పేరుతో కొర్రీలు పెడుతూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. చుక్కల భూములు మిగులు చూసుకుని వాటిలో తమకు అనుకూల వ్యక్తుల పేర్లను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘మిగులు’కు మరో ఛాన్స్ '
♦ దరఖాస్తుల నమోదు గడువు పొడిగింపు ♦ ప్రభుత్వానికి లేఖ రాసిన యంత్రాంగం ♦ ఆక్రమణదారులు ముందుకు రాకపోవడమే కారణం ⇒ జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ⇒ మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,627 అర్జీలే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులొచ్చారుు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) భూముల క్రమబద్ధీకరణ గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి ఛాన్ ్స అని హెచ్చరించినా ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆక్రమణదారులకు మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. జీఓ 92 కింద యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ర్ట సర్కారు వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంట్లో భాగంగా జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు గత నెల 25వ తేదీవరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఒకవేళ క్రమబద్ధీకరణకు ముందుకు రాకపోతే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. అరుునప్పటికీ మీ-సేవ కేంద్రాల ద్వారా 4,627 అర్జీలు మాత్రమే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు నమోదు కావడంతో రెవెన్యూయంత్రాంగం ఆశ్చర్యపోరుుంది. అరుుతే గుర్తించిన భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు జారీ చేసినా.. నిర్ణీత వ్యవధిలో వారికి అందలేదని అధికారుల పరిశీలనలో బయటపడింది. అర్జీల సమర్పణ గడువు ముగిసిన తర్వాత చాలా మందికి నోటీసులు అందినట్లు తేలింది. ఇది దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణమైనట్లు స్పష్టమైంది. దీనికితోడు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల అప్‌లోడ్‌లో జాప్యం, ఆక్రమణదారుల్లో చాలా మంది స్థానికంగా నివసించకపోవడం.. పొజిషన్ లో ఉన్నవారికి తమ స్థలాలు యూఎల్సీ పరిధిలో ఉన్నాయని తెలియకపోవడం కూడా దరఖాస్తులపై ప్రభావం చూపిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును పెంచే అంశాన్ని పరిశీలించాలంటూ యూఎల్సీ ప్రత్యేకాధికారి ప్రభుత్వాన్ని కోరారు. కనీసం మూడు వారాలపాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఇవ్వాలని లేఖ రాశారు. -
సాదా బైనామాకు వచ్చిన దరఖాస్తులు2,01,762
అత్యధికం ఖమ్మం, అత్యల్పం భద్రాచలం ఖమ్మం జెడ్పీసెంటర్: సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,01,762 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా ఖమ్మం డివిజన్ పరిధిలో 1,28,769; అత్యల్పంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,537 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం భూములు అమ్మిన, కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇస్తారు. వారి సమక్షంలో రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ తరువాత, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ధరలు పెరగడంతో... అనేక ఏళ్ళ క్రితం అమ్మిన భూములకు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనుండడంతో విక్రయదారులు ఆ భూములపై మెలిక పెట్టి, అందినంద దండుకునే అవకాశముంది. ఈ పరిస్థితి, గ్రా మాల్లో ఘర్షణ వాతావరణం సృష్టించవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారుల్లో వణుకు ప్రతి సొమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రీవెన్స్‌లో ప్రతిసారి వచ్చే దరఖాస్తుల్లో 80 శాతం వరకు భూసమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ‘నా తండ్రి పేరుతో ఉన్న భూమిని ఫలానా వీఆర్వో, తహసీల్దార్ కలిసి నాకు తెలియకుండా నా అన్నకు పాస్ బుక్ ఇచ్చారు’, ‘నా భూమి పాస్ పుస్తకాలను నా పక్క రైతుకు ఇచ్చా రు’ ఇలా, అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకా ఇతరత్రా ఫిర్యాదులు, సమస్యలు అనే కం ఉన్నాయి. వీటన్నింటిని ఒక కొలిక్కి తేవడం రెవెన్యూ అధికారులకు ఇబ్బందికరంగా పరిణమించనుంది. -
నిధుల వేట!
♦ యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం ♦ ఈ నెలాఖరులోపు విధివిధానాలు ఖరారు ♦ క్రమబద్ధీకరణ అధికారం కలెక్టర్‌కే.. ♦ వేలం జాబితాలో ఖాళీ భూములు ♦ భారీ రాబడిపై సర్కారు అంచనాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేట కొనసాగిస్తోంది. భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తున్న సర్కారు.. వాటికయ్యే నిధుల సమీకరణకు భూముల అమ్మకాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తోంది. గతేడాది జిల్లాలో 11 మండలాల్లో 8,883.32 ఎకరాల మేర యూఎల్సీ భూములున్నాయి. దీంట్లో 2883.23 ఎకరాలపై వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 1,749 ఎకరాలను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించగా, మరో 1673 ఎకరాలను క్రమబద్ధీకరించారు. వివాదరహితంగా ఉన్న మరో 176 ఎకరాల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. భూ క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టిన ప్ర భుత్వం.. తాజాగా పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) భూములపై దృష్టి సారించింది. ఈ స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా భారీగా రాబడి వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. తమ ఆధీనంలోని ఖాళీ భూములను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపింది. అంతే గాకుండా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ విచక్షణాధికారాన్ని కలెక్టర్లకే కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఈ జాగాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించే అవకాశముంది. క్రమబద్ధీకరణ అధికారం కలెక్టర్లకే అప్పగించినప్పటికీ, వీటి కనీస ధరల ఖరారుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎదురుచూపులు! యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ అంశం కొన్నేళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. గతేడా ది చెల్లింపు కేటగిరీలో వీటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే, ప్రభుత్వం అనూహ్యంగా యూఎల్సీ భూములను పక్కనపెట్టి.. కేవలం క్రమబద్ధీకరణను సర్కారీ స్థలాలకే పరిమితం చేసింది. తాజాగా ఆర్థిక వనరుల సమీకరణ వేట కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కారు.. యూఎల్సీ స్థలాలను అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పటికే కబ్జాలో ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని భావించింది. ఈ మేరకు మండలాలవారీగా యూఎల్సీ భూముల చిట్టాను తయా రు చేసింది. సుమారు 1,411 ఎకరాలు ఆక్రమణదారుల చె రల్లో ఉన్నాయని సర్వేలో తేల్చిన అధికారులు.. 672.37 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని గుర్తిం చారు. వీటి క్రమబద్ధీకరణతో ఖజానాకు రూ. 3,984.72 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసిం ది. మరోవైపు ప్రభుత్వ ఆధీనంలోని వివాదరహిత 2,577 ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా మరో రూ. ఆరే డు వేల కోట్లు సమకూరుతాయని లెక్క గడుతోంది. -
‘లెక్క’ తప్పింది!
♦ కాసులు కురిపించని క్రమబద్ధీకరణ ♦ ప్రభుత్వ అంచనాలు తారుమారు ♦ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత ♦ నిర్దేశిత మొత్తం చెల్లించేందుకు వెనుకడుగు ♦ మరోసారి గడువు పెంచే యోచనలో సర్కారు మొత్తం దరఖాస్తులు 11,846 అర్హమైనవి 6,746 తిరస్కరించినవి 4,872 రావాల్సిన ఆదాయం రూ.243 కోట్లు ఇప్పటివరకు వచ్చింది రూ.88.36 కోట్లు భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ గాడితప్పింది. కాసుల వర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు లెక్క తారుమారైంది. మార్గదర్శకాల జారీలో జాప్యం.. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతికపరమైన ఇబ్బందులు.. డీడీల రూపేణా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనతో అసలుకే ఎసరొచ్చింది. దీంతో జిల్లావ్యాప్తంగా రూ. 243.99 కోట్ల ఆదాయం రావాల్సిఉండగా, కేవలం రూ.88.36 కోట్లు మాత్రమే జమ అయ్యింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చెల్లింపు కేటగిరీ (జీఓ 59) కింద జిల్లాలో 11,846 దరఖాస్తులు అధికార యంత్రాంగానికి అందాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన రెవెన్యూ అధికారులు 6,746 అర్జీలు క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన విగా తేల్చారు. 4,872 దరఖాస్తులను తిరస్కరించింది. అయితే, క్రమబద్ధీకరణకు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు మొగ్గు చూపలేదు. అధికార యంత్రాంగం సృష్టించిన గంద రగోళమే ఇందుకు కారణం. ఏకమొత్తం చెల్లించిన దరఖాస్తులకు కూడా మోక్షం కలగకపోవడంతో క్రమబద్ధీకరణపై మీమాంసకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశించినట్లు క్రమబద్ధీకరణ ఖజానాకు కాసుల వర్షాన్ని కురిపించలేకపోయింది. భారీగా ఆశలు.. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. శివార్లలో భూముల విలువలు ఆకాశన్నంటినందున.. వీటిని విలువ ఆధారంగా పెద్దఎత్తున రాబడి వస్తుందని లెక్క గట్టింది. అయితే, క్రమబద్ధీకరణకు సంబంధించిన చెల్లింపులకు డిమాండ్ డ్రాఫ్ట్‌లను ముడిపెట్టడంతో చాలా ఆక్రమణదారులు వెనక్కి తగ్గారు. ప్రతి చెల్లింపుపై ఆదాయశాఖ (ఐటీ) నిఘా ఉంటుందని భావించి దరఖాస్తు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మార్కెట్ విలువకు అనుగుణంగా కనీస ధరలను నిర్ధేశించడం కూడా వెనుకడుగు వేసేందుకు కారణమైంది. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా 11,846 మంది స్థలాల రెగ్యులరైజేషన్‌కు అర్జీలు పెట్టుకున్నారు. ఈ మేరకు రూ.133 కోట్లను చెల్లించారు. దీంట్లో 628 మంది ఏకమొత్తంలో నిర్దేశిత ఫీజులను కూడా కట్టారు. అయితే, దరఖాస్తుల వడపోతలో చాలావరకు ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురయ్యాయి. వాస్తవానికి ఆమోదం పొందిన దరఖాస్తులతో ఖజానాకు రూ.243 కోట్లు వస్తాయని లెక్క గట్టింది. విధివిధానాల ఖ రారులో అస్పష్టత, మార్గదర్శకాలను సకాలంలో వెలువరించకపోవడం, యాజమాన్య హక్కుల (కన్వియెన్స్డీడ్)లు కల్పించకపోవడంతో క్రమబద్ధీకరణ విషయంలో అర్జీదారుల్లో సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. దీంతో అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా నిర్దేశిత ఫీజుల చెల్లింపుపై వేచిచూసే ధోరణిని అవలంబించారు. ఈ క్రమంలోనే తుది గడువు (ఫిబ్రవరి 29) కాస్తా ముగిసింది. ఈ పరిణామాలతో ఇప్పటివరకు రూ.88.36 కోట్లు మాత్రమే ప్రభుత్వ పద్దుకు చేరాయి. దీంట్లో జనవరిలో రూ.78.79 కోట్లు, ఫిబ్రవరిలో రూ.9.41 కోట్లు, గడువు ముగిసిన తర్వాత అంటే మార్చిలో రూ.15.97 లక్షలు ఖజానాకు జమ అయ్యాయి. మరోసారి గడువు పొడిగింపు? భూ క్రమబద్ధీకరణ (జీఓ 59) గడువును మరోసారి పొడగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి సాంకేతిక సమస్యలు తలెత్తడం, కన్వియెన్స్ డీడ్ ఖరారు కాకపోవడం, ఇతరత్రా పాలనాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఈ దిశగా ఆలోచ న చేస్తోంది. మరోవైపు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా స్థలాల రెగ్యులరైజ్‌కు ఆసక్తి చూపకపోవడాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని విశ్లేషించుకున్న ఉన్నతాధికారులు.. గడువు పొడగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వ్యవధి పొడగింపు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కూడా సంకేతాలు పంపిన ప్రభుత్వం.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. -
క్రమబద్ధీకరణకు మార్గం సుగమం!
డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు సర్కారు ఆమోదం చెల్లింపు కేటగిరీలో డిసెంబర్ 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్లు సర్కారు ఖాతాకు చేరిన మొత్తం రూ. 162.79 కోట్లు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కోసం భూపరిపాలన విభాగం అధికారులు రూపొందించిన డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు రాష్ట్ర ఆమోదం తెలిపింది. దీంతో పూర్తి సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు సదరు భూమి హక్కులను వెంటనే బదలాయించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీట ర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చెల్లింపు కేటగిరీలో 28,233 దరఖాస్తులు రాగా.. ఉచిత కేటగిరీలో వచ్చిన 23,784 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీ కింద అర్హమైనవిగా తేల్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో మొత్తం దరఖాస్తుల సంఖ్య 52,107కు చేరింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరులోగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. తాజాగా డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆన్లైన్లో పంపారని, డిసెంబర్ 1నుంచి అర్హులైన లబ్ధిదారులకు భూమి హక్కుల బదలాయింపు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారు. రూ. 162.79 కోట్లు జమ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగా, ఆపైన ఉన్న స్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో సులభ వాయిదాలతో పాటు ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి రాయితీని కూడా కల్పించారు. ప్రస్తు తం చెల్లింపు కేటగిరీలో ఉన్న 52,017 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 409 మంది ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారు. మిగతా లబ్ధిదారులు డిసెంబర్‌లోగా పూర్తి సొమ్ము చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు డిమాండ్ నోటీసులు జా రీచేశారు. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు ఖాతాలో రూ.162.79 కోట్లు జమ అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సంతకంపై సంశయం! లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే విషయమై తహసీల్దార్లు చేయాల్సిన సంతకంపై రెవెన్యూ యంత్రాంగంలో సంశయం ఏర్పడింది. డీడ్ ఆఫ్ కన్వేయన్స్పై డిజిటల్ సిగ్నేచర్ చేయాలా, ఇంకు సంతకం చేయాలా.. అన్న అంశంపై స్పష్టత రాలేదని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించిన సర్కారు... అవకతవక లు జరిగితే వారినే బాధ్యులుగా చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తే మేలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టత రానుందని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. -
గ్రీన్‌సిగ్నల్
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రభుత్వ స్థలాల్లో దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసుకున్న ‘గూడు’ను పేదలు క్రమబద్ధీకరించుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడతగా దాదాపు 443మంది పేదలకు భూ క్రమబద్ధీకరణ కింద పట్టాలు మంజూరు చేసింది. వీటిని ఈ నెల 7వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల ముగింపు సభలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తదితరులు లబ్ధిదారులకు ఈ పట్టాలు పంపిణీ చేయనున్నారు. అయితే జీఓ 58 కింద జిల్లాలోని 64 మండలాలకు చెందిన 5226 మంది 125గజాల్లోపు గల తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిపై దాదాపు 7 నెలలుగా వివిధ దశలుగా విచారణ జరిపిన అధికారులు వీటిలో 443 మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించి మండలాల వారిగా పట్టాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. జీఓ 58 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పలు ప్రభుత్వపరమైన అంశాలు కొన్ని శాఖలకు అభ్యంతరాలు ఉండడం వంటి సాంకేతిక అంశాలు ముడిపడి ఉండడంతో 3,764 దరఖాస్తులను ఇప్పటికిప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదని వీటిపై సమగ్ర విచారణతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలతో సంప్రదించాల్సి ఉందన్న పేరుతో ఆ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు చేతులెత్తేశారు. మిగిలి ఉన్న 1013 దరఖాస్తులను అధికారులు విచారణ చేయాల్సి ఉంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందోనని ఇందులో ఎంతమందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తిస్తుందనే ఆందోళన నెలకొంది. 7 నెలల నిరీక్షణ అనంతరం కనీసం 443 మందికైనా ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ చేయడం దరఖాస్తుదారుల్లో కొంత ఊరట కలిగిస్తున్న మొత్తం దరఖాస్తులను విచారణ జరిపి భూ క్రమబద్ధీకరణను పూర్తిచేయడం ఎప్పటికి అవుతుందోనని నిరాశ, నిస్పృహలు దరఖాస్తుదారుల్లో అలుముకున్నాయి. ఆందోళనలో జీఓ 59 దరఖాస్తుదారులు... 250గజాలకు మించి ప్రభుత్వ స్థలాలను ఆధీనంలో ఉంచుకున్న వాటిని క్రమబద్ధీకరించడం కోసం జీఓ నెం.59 పేరుతో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ జీఓ ప్రకారం జిల్లాకు చెందిన 424మంది దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం సూచించిన విధంగా రుసుము సైతం చెల్లించారు. అందువల్ల ప్రభుత్వానికి రూ.11 కోట్లకు పైగా ఆదాయం లభించింది. అయితే ఈ దరఖాస్తుదారులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరుపకపోవడం.. అర్హులెవరో గుర్తించకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేవన్న కారణంతో జిల్లాలో అధికారులు ఇప్పటి వరకు కనీసం విచారణ సైతం జరుపకపోవడంతో 59 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.