నిధుల వేట!
♦ యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
♦ ఈ నెలాఖరులోపు విధివిధానాలు ఖరారు
♦ క్రమబద్ధీకరణ అధికారం కలెక్టర్‌కే..
♦ వేలం జాబితాలో ఖాళీ భూములు
♦ భారీ రాబడిపై సర్కారు అంచనాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేట కొనసాగిస్తోంది. భారీ ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తున్న సర్కారు.. వాటికయ్యే నిధుల సమీకరణకు భూముల అమ్మకాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తోంది. గతేడాది జిల్లాలో 11 మండలాల్లో 8,883.32 ఎకరాల మేర యూఎల్‌సీ భూములున్నాయి. దీంట్లో 2883.23 ఎకరాలపై వివాదాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 1,749 ఎకరాలను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించగా, మరో 1673 ఎకరాలను క్రమబద్ధీకరించారు. వివాదరహితంగా ఉన్న మరో 176 ఎకరాల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
భూ క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టిన ప్ర భుత్వం.. తాజాగా పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్‌సీ) భూములపై దృష్టి సారించింది. ఈ స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా భారీగా రాబడి వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. తమ ఆధీనంలోని ఖాళీ భూములను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపింది. అంతే గాకుండా యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ విచక్షణాధికారాన్ని కలెక్టర్లకే కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఈ జాగాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించే అవకాశముంది. క్రమబద్ధీకరణ అధికారం కలెక్టర్లకే అప్పగించినప్పటికీ, వీటి కనీస ధరల ఖరారుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎదురుచూపులు!
యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ అంశం కొన్నేళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. గతేడా ది చెల్లింపు కేటగిరీలో వీటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారని భావించారు. అయితే, ప్రభుత్వం అనూహ్యంగా యూఎల్‌సీ భూములను పక్కనపెట్టి.. కేవలం క్రమబద్ధీకరణను సర్కారీ స్థలాలకే పరిమితం చేసింది. తాజాగా ఆర్థిక వనరుల సమీకరణ వేట కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కారు.. యూఎల్‌సీ స్థలాలను అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇప్పటికే కబ్జాలో ఉన్న స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని భావించింది.
ఈ మేరకు మండలాలవారీగా యూఎల్‌సీ భూముల చిట్టాను తయా రు చేసింది. సుమారు 1,411 ఎకరాలు ఆక్రమణదారుల చె రల్లో ఉన్నాయని సర్వేలో తేల్చిన అధికారులు.. 672.37 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని గుర్తిం చారు. వీటి క్రమబద్ధీకరణతో ఖజానాకు రూ. 3,984.72 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసిం ది. మరోవైపు ప్రభుత్వ ఆధీనంలోని వివాదరహిత 2,577 ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా మరో రూ. ఆరే డు వేల కోట్లు సమకూరుతాయని లెక్క గడుతోంది.