
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి గ్రేటర్ అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువును ఎన్నిసార్లు పొడిగించినా, పూర్తిస్థాయిలో పరిష్కారం కావడంలేదు. జీహెచ్‌ఎంసీకి మొత్తం 85,260 దరఖాస్తులు రాగా, చెరువులు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్ జోన్లు, యాజమాన్య హక్కులపై కోర్టు వివాదాలు, ప్రభుత్వస్థలాలు, యూఎల్‌సీ విభాగం నుంచి ఎన్‌వోసీలు తెచ్చుకోని వారికి సంబంధించిన దరఖాస్తుల్ని తిరస్కరించారు.
అవి పోను మిగతా 71,944 దరఖాస్తుల్లో ఇప్పటికీ ఫీజులు చెల్లించకపోవడం, అవసరమైన పత్రాలు సమర్పించకపోవడంతో 4,997 దరఖాస్తులు పెండింగ్‌లో ఉ న్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జోనల్ కార్యాలయాల్లో ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ డైరెక్టర్(ప్లానింగ్) శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించేందుకు సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) సేవలు వినియోగించుకుంటామన్నారు. ఫీజులకు సంబంధించిన డీడీలు చెల్లించినట్లు ఆన్‌లైన్‌లో నమోదైన వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఎల్‌బీనగర్ టాప్ : భవన నిర్మాణ దరఖాస్తులు, అనుమతుల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల దాకా అన్నింటా ఎల్‌బీనగర్ జోన్ అగ్రభాగాన ఉంది. పెండింగ్ దరఖాస్తుల్లోనూ ఎల్‌బీనగర్ జోన్‌వే అత్యధికంగా 3,230 దరఖాస్తులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment