Government agencies
-
Kim Jong Un: ద.కొరియా మన శత్రువు
సియోల్: గతంలో ఉత్తరకొరియా నేతలు దక్షిణకొరియా, ఉత్తరకొరియాలను కలిపేందుకు పునరేకీకరణ పనుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వసంస్థలను శాశ్వతంగా మూసేయాలని ఉ.కొరియా నియంత కిమ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉ.కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రసంగం వివరాలను అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ‘‘ అమెరికా, జపాన్ల అండతో కయ్యానికి కాలు దువ్వుతున్న దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే మాటే లేదిక. దక్షిణ కొరియాతో స్నేహబంధం అనే భావనను రాజ్యాంగం నుంచి తొలగించండి. పునరేకీకరణ, సయోధ్యను ప్రోత్సహిస్తూ అందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మూసేయండి. దక్షిణకొరియాను శత్రుదేశంగా ప్రకటించండి. యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. తప్పని పరిస్థితి ఎదురైతే యుద్ధానికి దిగుతాం’’ అని పార్లమెంట్‌సభ్యులకు కిమ్ ఆదేశాలిచ్చారు. రైల్వే బంధం తెంపేద్దాం, స్మారకం కూల్చేద్దాం కిమ్ ఆదేశాల మేరకు కమిటీ ఫర్ ది పీస్ఫుల్ రీయూనిఫికేషన్, నేషనల్ ఎకనమిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మిని్రస్టేషన్ సంస్థలను మూసేయనున్నారు. ‘‘ ద.కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు, అమెరికా వ్యూహాత్మక సైనిక బలగాల మొహరింపు, ద.కొరియా, అమెరికా, జపాన్ల త్రిముఖ భద్రతా సహకారం.. కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచుకు నెట్టుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద.కొరియాతో స్నేహం, సహకారం అసంభవం. ద.కొరియా, ఉ.కొరియాల మధ్య ఉన్న రైల్వే రైళ్లను మూసేయండి. ప్యాంగ్యాంగ్లోని పునరేకీకరణ స్మారకాన్ని కూల్చేయండి’’ అని కిమ్ ఆదేశాలిచ్చారు. ‘ ద్వీపకల్పంలో అణు యుద్ధం మొదలైతే ద.కొరియాను ఈ భూపటంపై లేకుండా చేస్తాం. అమెరికా కనీవినీ ఎరుగని అపార నష్టాన్ని చవిచూస్తుంది’ అని కిమ్ హెచ్చరించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. ‘‘ అతను జాతి వ్యతిరేకి. చరిత్రను ఒప్పుకోని మనిíÙ. కవి్వంపు చర్యలకు దిగితే అంతకు మించి సైనిక చర్యలతో మట్టికరిపిస్తాం’’అని ద.కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం కేబినెట్ భేటీలో అన్నారు. -
ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్లకు ధారాదత్తం
తిరుపతి కల్చరల్: నవరత్నాల్లాంటి ప్రభుత్వ సంస్థలను అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ నుంచి ఈ దేశాన్ని కాపాడుకుందాం అంటూ జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి రామతులసీ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం సభ నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. 6,300 కోట్లకుపైగా లాభం వస్తున్న విశాఖ ఉక్కును అమ్మడంలో మర్మమేంటన్నారు. పోలవరం నిర్వాసితులకు ఒక్కపైసా నష్టపరిహారం, పునరావాసం కల్పించలేదన్నారు. త్వరలోనే తిరుపతి విమానాశ్రయాన్ని ఆదాని చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. -
కాస్త.. చూసి వడ్డించండి
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’అని భోజనాన్ని దైవంతో పోలుస్తాం. ఇలాంటి మన దేశంలో ఆహార పదార్ధాల వృథా పెరిగిపోతోంది. ఓ పక్క దేశంలో ఆహార భద్రత కరువై పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోపక్క పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు, శుభకార్యాల పేరిట చేస్తున్న హం గామాతో వేల కోట్ల విలువైన ఆహారం చెత్తకుప్పల్లోకి వెళుతోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరుగుతున్న శుభకార్యాల ద్వారా కనిష్టంగా 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతోందని, దాని విలువ కనిష్టంగా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ అంచనా వేసింది. ఆర్థిక, సామాజిక పరపతిని చూపించుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో వంటకాలు పెట్టడం, భారీ సంఖ్యలో జనం హాజరైన సందర్భాల్లోనే వృథా ఎక్కువగా ఉంటోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. 75 రోజులు.. 838 కార్యక్రమాలు.. ఓ సర్వే దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో 21.4 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కరువైంది. మూడేళ్లలోపు చిన్నారుల్లో 46% మంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఆహార కొరత కారణంగా 23% మంది తక్కువ బరువు తో పుడుతున్నారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల పేరిట భారీగా ఆహార వృథా దేశాన్ని పట్టి పీడుస్తోందని కేంద్రం గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు.. అసలు ఎక్కడెక్కడ వృథా ఎక్కువగా ఉంది.. ఆర్థిక ప్రభావం ఏయే సందర్భాల్లో వృథా పెరుగుతోంది.. వంటి అంశాలపై కేంద్ర ఆహార సంస్థ ప్రధాన పట్టణాల్లో సర్వే చేయించింది. దేశవ్యాప్తంగా 75 రోజుల పాటు ఆతిథ్య రంగ సంస్థలు, వివిధ రకాల ప్రజలు, చెత్త నిర్వహణ సిబ్బందితో విడివిడిగా ఓ కమిటీతో అభిప్రాయ సేకరణ చేసింది. 838 వివాహాది శుభకార్యాలను, సాంఘిక జన సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. దీనిని విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ముఖ్య పరిశీలనలు ఇలా.. - వివాహాది కార్యక్రమాల సమయంలో వృథా ఎక్కువగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 89 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత వార్షికోత్సవాలు, పుట్టిన రోజు వేడుకల్లో వృథా ఎక్కువని 32.5 శాతం ప్రజలు అభిప్రాయాలు చెప్పారు. - ఆతిథ్య రంగ సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం వృథా ఉంటోందని 44.9 శాతం ప్రజలు తెలిపారు. - వృథా అవుతున్న దాంట్లో 67.9% ఎక్కువ వంటకాలు వడ్డించి నప్పుడు, 57.4% భారీగా జనాలు హాజరైనప్పుడు ఉంటోంది. ఇందులో కూరగాయల భోజనంలో వృ«థా ఎక్కువగా ఉండగా, బియ్యం, బిర్యానీ వంటకాలను ఎక్కువగా పారేస్తున్నారు. - కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించిన సమయంలో ఆహార వృథా 11.45 శాతమే ఉంటుండగా, క్యాటరింగ్ నిర్వాహకులు వడ్డిస్తే 14.45 శాతం ఉంటోంది. బఫేలో అయితే ఈ వృథా 74.95 శాతం ఉంటోంది. - వడ్డించకుండా వదిలేసిన, లేక మిగిలిన వంటకాలను చారిటీలకు లేక ఎన్జీవోలకు దానం చేసే విధానం 7.2 శాతం మాత్రమే ఉండగా, 15.6 శాతం వివిధ సందర్భాల్లో జరుగుతోంది. 77.2 శాతం మాత్రం పూర్తిగా వృథాగానే పారేస్తున్నారు. 10 వేల కోట్ల వృథా.. దేశంలో ఆర్థిక సంపద పెరుగుతున్న మాదిరే మధ్య, దిగువ తరగతి సంపద వృద్ధి చెందుతోందని, దీనికి అనుగుణంగానే శుభకార్యాల నిర్వహణ, వాటిల్లో ఆహార వంటకాలపై ఖర్చు పెరిగిందని కేంద్రం అధ్యయనం తేల్చింది. సమాజంలో ఆర్ధిక పరపతిని చూపేందుకు, సామాజికంగా తన బలాన్ని తెలిపేందుకు కార్యక్రమాల్లో విరివిగా ఖర్చు చేసేందుకు ప్రజలు వెనుకాడటం లేదని గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏటా రూ.1.10 లక్షల కోట్లు శుభకార్యాలపై ఖర్చు చేస్తుండగా, ఇందులో రూ.40 వేల కోట్ల మేర అంటే దాదాపు 40 శాతం ఆహార వంటకాలపై వెచ్చిస్తున్నారు. ఇందులో 15 నుంచి 25 శాతం అంటే రూ.10 వేల కోట్ల ఆహార వృథా ఉంటోంది. వంటకాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, భారీగా జనాలు హాజరైనప్పుడే వృథా ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో ఏటా పెళ్లిళ్లు, ఇతర సామూహిక సమ్మేళనాల పేరిట రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని అంచనా ఉంది. ఇందులో రూ.4 వేల కోట్ల మేర వంటకాలపై ఖర్చు చేస్తున్నా, ఆహార వృ«థా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని కేంద్ర నివేదిక ఆధారంగా తెలుస్తోంది. కమిటీ ప్రతిపాదనలు ఇలా.. - అతిథుల సంఖ్యను పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు కనుక ఆహార వృథాపై అవగాహన కల్పించడమే సరైన మార్గం. - కొన్ని స్వచ్ఛంద సంస్థలకు నిధులు కేటాయించి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసేలా చూడాలి. - ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ఒక ప్రణాళిక లేకపోవడంతో ఆహార వృథా అవుతోంది. దీన్ని నివారించాలి. - ఆహ్వాన పత్రికల మీద ఆహార వృథాపై అవగాహన సందేశాలతో పాటు కార్యక్రమానికి హాజరయ్యేది, లేనిది ముందే సమాచారం ఇచ్చేలా ఆహ్వానితులకు అవగాహన కల్పించాలి. - ఆహారాన్ని గౌరవించేలా, వృథా వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పేలా విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఈ అంశంపై బోధన ఉండాలి. - అస్సాం, రాజస్థాన్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లో గెస్ట్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆరు రకాలైన వంటకాలు మాత్రమే శుభకార్యాల్లో వడ్డించాలనే నిబంధన ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఫలితం ఉంటుంది. - (సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి) -
దోమ కుట్టకుండా.. రూ.6 వేల కోట్లు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం చేస్తున్న ఖర్చు మాత్రమేనండోయ్!!. ఇక కార్యాలయాలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, వీధుల్లో ప్రభుత్వ సంస్థలు చేస్తున్న వ్యయం దీనికి అదనం. దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకయ్యే ఆసుపత్రి ఖర్చులు, వాటికోసం వాడే మందులు ఈ లెక్కలోకి రావటం లేదు. ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యాతోపాటు కొత్తగా జికా, వెస్ట్ నైల్ వంటి వైరస్ల వ్యాప్తికి దోమలు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో!!. అందుకే దోమల నివారణకు ఇళ్లలో లిక్విడ్ వేపరైజర్స్, ఏరోసోల్స్, ఇన్సెన్స్ స్టిక్స్, క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్ వంటి ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. సగం కుటుంబాల్లో.. దోమల నివారణ ఉత్పత్తులు ఇప్పుడు పల్లెలకూ పాకాయి. కిరాణా దుకాణాలు, జనరల్ స్టోర్స్, మందుల షాపుల్లో విరివిగా లభిస్తున్నాయి. అటు కంపెనీలు సైతం విభిన్న రకాల్లో వీటిని తయారు చేస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీలు ఈ ఉత్పత్తుల తయారీకి ఏళ్ల తరబడి శ్రమిస్తున్నాయి. పరిశోధన, పరీక్షల అనంతరం వీటిని విడుదల చేస్తున్నాయి. భారత్‌లో 28 కోట్ల కుటుంబాల్లో.. 13.4 కోట్ల కుటుంబాలు అన్ బ్రాండెడ్ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా చెప్పారు. దేశంలో చిన్నాచితకా యూనిట్లు తయారు చేసిన నకిలీ ఇన్సెన్స్ (అగర్బత్తీలు) వ్యాపారం ఏటా రూ.500 కోట్లు ఉంటోందని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇక కాయిల్స్ చవకగా దొరుకుతాయి కాబట్టి వీటికి ఎక్కువ గిరాకీ ఉంటోందని వెల్లడించారు. బ్రాండెడ్ కంపెనీల కాయిల్స్ వ్యాపారం రూ.2,220 కోట్లుగా ఉంది. ఇదీ భారత మార్కెట్.. దేశవ్యాప్తంగా ఇళ్లలో వాడుతున్న దోమల నివారణ ఉత్పత్తుల మార్కెట్ రూ.6,000 కోట్లు. ఏటా ఈ మార్కెట్ 10 శాతం వృద్ధి చెందుతోంది. వీటిలో కాయిల్స్ వాటా అత్యధికంగా 37 శాతం ఉంది. లిక్విడ్ వేపరైజర్స్ 34 శాతం, ఏరోసోల్స్ 14, ఇన్సెన్స్ స్టిక్స్ 11 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. మిగిలిన వాటాను క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్ వంటి ఉత్పత్తులు దక్కించుకున్నాయి. చిత్రమేంటంటే వీటన్నిటిలో టాప్–5 బ్రాండ్స్ ఏకంగా 80 శాతం మార్కెట్‌ను చేజిక్కించుకున్నాయి. దోమల నివారణ ఉత్పత్తుల రంగంలో గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్, ఎస్సీ జాన్సన్, రెక్కిట్ బెన్కిసర్, జ్యోతి ల్యాబొరేటరీస్, డాబర్లు అగ్రశ్రేణి కంపెనీలుగా కొనసాగుతున్నాయి. గోద్రెజ్‌కు చెందిన గుడ్‌నైట్ బ్రాండ్ ఏటా రూ.2,500 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ టాప్ వన్ స్థానంలో ఉంది -
మళ్లీ ఎల్ఆర్ఎస్ మేళా..!
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కారానికి గ్రేటర్ అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువును ఎన్నిసార్లు పొడిగించినా, పూర్తిస్థాయిలో పరిష్కారం కావడంలేదు. జీహెచ్ఎంసీకి మొత్తం 85,260 దరఖాస్తులు రాగా, చెరువులు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, యాజమాన్య హక్కులపై కోర్టు వివాదాలు, ప్రభుత్వస్థలాలు, యూఎల్సీ విభాగం నుంచి ఎన్వోసీలు తెచ్చుకోని వారికి సంబంధించిన దరఖాస్తుల్ని తిరస్కరించారు. అవి పోను మిగతా 71,944 దరఖాస్తుల్లో ఇప్పటికీ ఫీజులు చెల్లించకపోవడం, అవసరమైన పత్రాలు సమర్పించకపోవడంతో 4,997 దరఖాస్తులు పెండింగ్‌లో ఉ న్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జోనల్ కార్యాలయాల్లో ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ డైరెక్టర్(ప్లానింగ్) శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆన్లైన్ సమస్యలు పరిష్కరించేందుకు సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) సేవలు వినియోగించుకుంటామన్నారు. ఫీజులకు సంబంధించిన డీడీలు చెల్లించినట్లు ఆన్లైన్లో నమోదైన వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ టాప్ : భవన నిర్మాణ దరఖాస్తులు, అనుమతుల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల దాకా అన్నింటా ఎల్బీనగర్ జోన్ అగ్రభాగాన ఉంది. పెండింగ్ దరఖాస్తుల్లోనూ ఎల్బీనగర్ జోన్‌వే అత్యధికంగా 3,230 దరఖాస్తులున్నాయి. -
పార్టీలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ సంస్థల కిందకే వస్తాయనీ, వాటన్నింటికీ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం వర్తిస్తుందని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం స్పష్టతనిచ్చింది. జాతీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా ప్రకటిస్తూ, వాటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని 2013 జూన్‌లోనే కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈసీ మాత్రం ఇటీవల ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం వివాదాస్పదమవడం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తమెంతో చెప్పాలని సహ చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా, ఆ వివరాలు తమ వద్ద లేవనీ, పార్టీలు చట్టం పరిధిలోకి రావంటూ సమాధానమిచ్చింది. ఈ విషయం సోమవారం పత్రికల్లో రావడంతో జాగ్రత్త పడిన ఈసీ తన సమాధానంపై వివరణ ఇచ్చింది. ఏకకాల ఎన్నికలపై స్పందించని పార్టీలు లోక్‌సభతోపాటు దేశంలోని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపడంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ కోరగా, ఏడు జాతీయ పార్టీల్లో ఒక్కటి కూడా స్పందించలేదు. తమ అభిప్రాయాలు చెప్పిన ప్రముఖులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మలు మాత్రమే. అభిప్రాయాలు చెప్పేందుకు మే 8 చివరి తేదీ కాగా, ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీల్లో ఒక్క పార్టీ కూడా తమ వైఖరిని తెలియజేయలేదు. నారాయణ స్వామి మాత్రం.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని సవరించి కొన్ని శాసనసభల పదవీకాలాన్ని పెంచడం లేదా తగ్గించాల్సి ఉంటుందనీ, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పినట్లు సమాచారం. -
ధాన్యం.. దైన్యం!
ఈసారైనా ‘మద్దతు’ లభించేనా? - పక్షం రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ బాట - కొనుగోళ్లకు ప్రభుత్వ సంస్థలు దూరం - సహకార సంఘాలకే బాధ్యత లు! - ఉత్పత్తుల సేకరణపై అనుమానాలు గజ్వేల్: వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఈసారైనా మార్పులుంటాయా? మద్దతు ధర లభించేనా?.. మరో 15 రోజుల్లో వ్యవసాయోత్పత్తులు మార్కెట్ బాట పట్టే అవకాశమున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది. మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్, వడ్లను కొనుగోలు చేసే సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ), ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ), ఆముదాలు, పొద్దుతిరుగుడు వంటి నూనె ఉత్పత్తులు కొనుగోలు చేసే ఆయిల్‌ఫెడ్ సంస్థలు జిల్లాలో తమ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. మరోపక్క పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నామమాత్రంగానే కేంద్రాలను నడుపుతున్నది. కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేస్తూ ప్రభుత్వరంగ సంస్థలు పర్యవేక్షణకే పరిమితం కావడం రైతులను కుంగదీస్తున్నది. ఈసారి ఐకేపీ కేంద్రాలనూ ఎత్తేసి సహకార సంఘాలకే కొనుగోళ్ల బాధ్యతను పూర్తిస్థాయిలో అప్పగించనున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.. ఏదేమైనా ప్రభుత్వ సంస్థలను నేరుగా రంగంలోకి దిగితే తప్ప ఇబ్బందులు తీరేలా లేవు. బాధ్యతల నుంచి తప్పుకున్న మార్క్‌ఫెడ్ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 80 వేల హెక్టార్లకుపైగా మొక్కజొన్న, 1.10 హెక్టార్లలో పత్తి, మరో 40 హెక్టార్లకుపైగా వరిసాగైంది. మొక్కజొన్నకు సంబంధించిన ఉత్పత్తులు మరో 15 రోజుల్లో మార్కెట్ బాటపట్టే అవకాశమున్నది. అక్టోబర్ నెలాఖరులోగా ధాన్యం, పత్తి ఉత్పత్తులూ మార్కెట్లోకి రానున్నాయి. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ జిల్లాలోని విస్తృత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మొక్కజొన్న ఉత్పత్తులను సేకరించాల్సి ఉండగా ఆ సంస్థ ఈ బాధ్యతను ఎప్పుడో మరిచిపోయిందనే చెప్పాలి. ఐకేపీ సంఘాలకే కొనుగోలు బాధ్యతలను అప్పగించి తాను పర్యవేక్షణకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం గజ్వేల్‌లో మక్కల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకొన్నాయి. ముగ్గురు ఐకేపీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వరిదీ అదే దారి.. వరి ఉత్పత్తుల సేకరణకు గతంలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్ తదితర చోట్ల 8 వరకు కొనుగోలు కేంద్రాలను మూడేళ్ల క్రితం వరకు ఏర్పాటుచేయగా.. ప్రస్తుతం వాటిని ఎత్తేశారు. కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేసి కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమవుతున్నది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేదికాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. ప్రత్యేకించి సహకార సంఘాలు కొనుగోళ్ల రంగంలోకి రావడం ఇది రెండో ఏడాదే. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్నచోట మార్కెటింగ్ శాఖ అధికారులు సమకూరుస్తుండగా మిగతాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతున్నది. సీసీఐదీ అదే తీరు.. పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదు. సీజన్లో ఈ కేంద్రాలను నిరంతరంగా తెరవకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కాగా, ఈసారి కొత్తగా కొనుగోళ్ల బాధ్యత నుంచి ఐకేపీ కేంద్రాలను తప్పిస్తున్నారని, ఇందుకు సంబంధించిన జీఓ కూడా విడుదలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల బాధ్యతను పూర్తిగా సహకార సంఘాలకు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనే ఇబ్బందులకు అడ్డుకట్ట కొనుగోళ్ల రంగంలోకి తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనే రైతుల ఇబ్బందులు తీరే అవకాశమున్నది. కొత్త రాష్ట్రంలో...ఈ విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నది. -
రాజబాట
గన్నవరం పరిసరాల్లో జోరుగా సర్వేలు గన్నవరం పలు ప్రభుత్వ సంస్థలకువరంగా మారనుంది. విజయవాడనగరానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ముందుగా అభివృద్ధిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అధికారులు ఈ ప్రాంతం లోని భూములను సర్వే చేస్తున్నారు. విజయవాడ : గన్నవరానికి మహర్దశ పట్టనుంది. విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న గన్నవరం ప్రాంతాన్ని ముందుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కొద్ది రోజులుగా గన్నవరంపై దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములను గుర్తించేందుకు గ్రామాల వారీగా సర్వే చేస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధి, కస్టమ్స్ కమిషనరేట్‌తో పాటు ఐటీ హబ్‌కు కూడా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడు బృందాలు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల కొండ పోరంబోకు, ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు సర్వే చేస్తున్నాయి. గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో సర్వే నంబర్-192, 7బీలో 200 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటుకు కొండపోరంబోకు భూమిని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేస్తోంది. కొద్ది రోజులుగా 15 మంది రెవెన్యూ ఉద్యోగులు మూడు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో సర్వే నంబర్-6లో 429 ఎకరాల కొండపోరంబోకు భూమిని గుర్తించారు. ఇక్కడ కూడా 20 మంది సర్వేయర్లు నాలుగు బృందాలుగా భూమికి హద్దులు గుర్తిస్తున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వైద్యం, యోగా పరిశోధన సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ ఏర్పాటైతే ఇక్కడ వంద పడకల ఆస్పత్రి కూడా నిర్మిస్తారు. వెదురుపావులూరులో ఖాళీగా ఉన్న 80 ఎకరాలను కూడా అధికారులు గుర్తించారు. కేసరపల్లిలో విమానాశ్రయం ఎదురుగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో కస్టమ్స్ కమిషనరేట్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. వలస వస్తున్న పారిశ్రామికవేత్తలు గన్నవరానికి ప్రభుత్వ సంస్థలు తరలి వస్తున్న నేపథ్యంలో కొందరు పారిశ్రామికవేత్తలు కూడా ఈ ప్రాంతంలో తమ సంస్థలను నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలోని తమ భూముల్లో సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ భూముల కోసం ప్రయత్నిస్తున్నారు. విజయ డెయిరీ యాజమాన్యం ఫీడ్ మిక్సింగ్ ప్లాంటును గన్నవరం ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న విమానాశ్రయం దినదినాభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ సర్వీసులు నడిపే దిశగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ - గన్నవరం మధ్య పలు కార్పొరేట్ విద్యాసంస్థలు, కార్ల షోరూమ్‌లు ఏర్పాటయ్యాయి. కొద్ది కాలంలో విజయవాడలో గన్నవరం కలిసిపోతుందని వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు. -
టీఐఐసీ స్థలాల్లోనూ క్రమబద్ధీకరణ
► సర్కారీ సంస్థలకిచ్చిన స్థలాల రెగ్యులరైజేషన్‌పై మల్లగుల్లాలు ► జీఓ 58ని అమలు చేసే అంశంపై ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన ► 696 దరఖాస్తులకు గ్రీన్‌సిగ్నల్! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వివిధ ప్రభుత్వ సంస్థలకు బదలాయించిన స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణపైసర్కారు ఎటూ తేల్చుకోలేకపోతోంది. జీఓ 58 కింద పేదలు తిష్టవేసిన స్థలాలను క్రమబద్ధీకరించే అంశంలో ఆయా శాఖల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం గతంలో టీఐసీసీ, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ, దేవాదాయ, అటవీశాఖలకు అప్పగించిన స్థలాల్లో కొంత విస్తీర్ణంలో నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణకు లైన్‌క్లియర్ చేయడంతో ఈ స్థలాల్లో నివసిస్తున్న కొందరు ఆక్రమణదారులు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ స్థలాలపై హక్కులున్న ఆయా శాఖలు క్రమబద్ధీకరణకు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్థలాలను రెగ్యులరైజ్ చేయొద్దని విన్నవించాయి. సీఎం ఆదేశాలతో.. వీలున్నంత మేరకు పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కోణంలోనే దరఖాస్తులను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో రెవెన్యూ యంత్రాంగం.. ఆయా శాఖలకు బదలాయించిన స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్థాయి అధికారులతో హైపవర్ కమిటీని నియమించింది. దీంట్లోభాగంగా బుధవారం సీసీఎల్ఏ నేతృత్వంలో అటవీ, టీఐఐసీ స్థలాల్లోని క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన జరిగింది. ఏయే స్థలాలు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయనే అంశంపై ఇంకా స్పష్టత రానప్పటికీ, దరఖాస్తుల్లో ఎక్కువమొత్తంలో ఆమోదముద్ర వేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని వన్యప్రాణుల సంస్థ స్థలంలో 300 దరఖాస్తులు, బాలానగర్ మండలంలోని టీఐఐసీకి సంబంధించి అల్లావుద్ధీన్ కుట్టీలోని 350, చర్లపల్లి పారిశ్రామికవాడలోని 46 దరఖాస్తుల క్రమబద్ధీకరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దశాబ్ధాల క్రితమే ఇక్కడ నిర్మాణాలు వెలిశాయని, వాటిని తిరిగి తీసుకునే పరిస్థితి లేనందున రెగ్యులరైజ్ చేయడమే మేలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.