కాస్త.. చూసి వడ్డించండి | 20 to 25 percent of food is being wastage in marriages and events | Sakshi
Sakshi News home page

కాస్త.. చూసి వడ్డించండి

Published Sun, Dec 1 2019 2:28 AM | Last Updated on Sun, Dec 1 2019 5:24 AM

20 to 25 percent of food is being wastage in marriages and events - Sakshi

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’అని భోజనాన్ని దైవంతో పోలుస్తాం. ఇలాంటి మన దేశంలో ఆహార పదార్ధాల వృథా పెరిగిపోతోంది. ఓ పక్క దేశంలో ఆహార భద్రత కరువై పేదలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోపక్క పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు, శుభకార్యాల పేరిట చేస్తున్న హం గామాతో వేల కోట్ల విలువైన ఆహారం చెత్తకుప్పల్లోకి వెళుతోంది. దేశ వ్యాప్తంగా ఏటా జరుగుతున్న శుభకార్యాల ద్వారా కనిష్టంగా 20 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతోందని, దాని విలువ కనిష్టంగా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ అంచనా వేసింది. ఆర్థిక, సామాజిక పరపతిని చూపించుకోవడం కోసం ఎక్కువ సంఖ్యలో వంటకాలు పెట్టడం, భారీ సంఖ్యలో జనం హాజరైన సందర్భాల్లోనే వృథా ఎక్కువగా ఉంటోందని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. 

75 రోజులు.. 838 కార్యక్రమాలు.. ఓ సర్వే
దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో 21.4 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కరువైంది. మూడేళ్లలోపు చిన్నారుల్లో 46% మంది ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఆహార కొరత కారణంగా 23% మంది తక్కువ బరువు తో పుడుతున్నారు. ఇదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల పేరిట భారీగా ఆహార వృథా దేశాన్ని పట్టి పీడుస్తోందని కేంద్రం గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు.. అసలు ఎక్కడెక్కడ వృథా ఎక్కువగా ఉంది.. ఆర్థిక ప్రభావం ఏయే సందర్భాల్లో వృథా పెరుగుతోంది.. వంటి అంశాలపై కేంద్ర ఆహార సంస్థ ప్రధాన పట్టణాల్లో సర్వే చేయించింది. దేశవ్యాప్తంగా 75 రోజుల పాటు ఆతిథ్య రంగ సంస్థలు, వివిధ రకాల ప్రజలు, చెత్త నిర్వహణ సిబ్బందితో విడివిడిగా ఓ కమిటీతో అభిప్రాయ సేకరణ చేసింది. 838 వివాహాది శుభకార్యాలను, సాంఘిక జన సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. దీనిని విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది.

ముఖ్య పరిశీలనలు ఇలా..
- వివాహాది కార్యక్రమాల సమయంలో వృథా ఎక్కువగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 89 శాతం మంది తెలిపారు. ఆ తర్వాత వార్షికోత్సవాలు, పుట్టిన రోజు వేడుకల్లో వృథా ఎక్కువని 32.5 శాతం ప్రజలు అభిప్రాయాలు చెప్పారు.
ఆతిథ్య రంగ సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం వృథా ఉంటోందని 44.9 శాతం ప్రజలు తెలిపారు.
వృథా అవుతున్న దాంట్లో 67.9% ఎక్కువ వంటకాలు వడ్డించి నప్పుడు, 57.4% భారీగా జనాలు హాజరైనప్పుడు ఉంటోంది. ఇందులో కూరగాయల భోజనంలో వృ«థా ఎక్కువగా ఉండగా, బియ్యం, బిర్యానీ వంటకాలను ఎక్కువగా పారేస్తున్నారు. 
కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించిన సమయంలో ఆహార వృథా 11.45 శాతమే ఉంటుండగా, క్యాటరింగ్‌ నిర్వాహకులు వడ్డిస్తే 14.45 శాతం ఉంటోంది. బఫేలో అయితే ఈ వృథా 74.95 శాతం ఉంటోంది. 
వడ్డించకుండా వదిలేసిన, లేక మిగిలిన వంటకాలను చారిటీలకు లేక ఎన్జీవోలకు దానం చేసే విధానం 7.2 శాతం మాత్రమే ఉండగా, 15.6 శాతం వివిధ సందర్భాల్లో జరుగుతోంది. 77.2 శాతం మాత్రం పూర్తిగా వృథాగానే పారేస్తున్నారు. 

10 వేల కోట్ల వృథా..
దేశంలో ఆర్థిక సంపద పెరుగుతున్న మాదిరే మధ్య, దిగువ తరగతి సంపద వృద్ధి చెందుతోందని, దీనికి అనుగుణంగానే శుభకార్యాల నిర్వహణ, వాటిల్లో ఆహార వంటకాలపై ఖర్చు పెరిగిందని కేంద్రం అధ్యయనం తేల్చింది. సమాజంలో ఆర్ధిక పరపతిని చూపేందుకు, సామాజికంగా తన బలాన్ని తెలిపేందుకు కార్యక్రమాల్లో విరివిగా ఖర్చు చేసేందుకు ప్రజలు వెనుకాడటం లేదని గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏటా రూ.1.10 లక్షల కోట్లు శుభకార్యాలపై ఖర్చు చేస్తుండగా, ఇందులో రూ.40 వేల కోట్ల మేర అంటే దాదాపు 40 శాతం ఆహార వంటకాలపై వెచ్చిస్తున్నారు. ఇందులో 15 నుంచి 25 శాతం అంటే రూ.10 వేల కోట్ల ఆహార వృథా ఉంటోంది. వంటకాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, భారీగా జనాలు హాజరైనప్పుడే వృథా ఎక్కువగా ఉంటోందని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో ఏటా పెళ్లిళ్లు, ఇతర సామూహిక సమ్మేళనాల పేరిట రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని అంచనా ఉంది. ఇందులో రూ.4 వేల కోట్ల మేర వంటకాలపై ఖర్చు చేస్తున్నా, ఆహార వృ«థా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని కేంద్ర నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 

కమిటీ ప్రతిపాదనలు ఇలా..
- అతిథుల సంఖ్యను పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు కనుక ఆహార వృథాపై అవగాహన కల్పించడమే సరైన మార్గం.
కొన్ని స్వచ్ఛంద సంస్థలకు నిధులు కేటాయించి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసేలా చూడాలి.
ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ఒక ప్రణాళిక లేకపోవడంతో ఆహార వృథా అవుతోంది. దీన్ని నివారించాలి.
​​​​​​​- ఆహ్వాన పత్రికల మీద ఆహార వృథాపై అవగాహన సందేశాలతో పాటు కార్యక్రమానికి హాజరయ్యేది, లేనిది ముందే సమాచారం ఇచ్చేలా ఆహ్వానితులకు అవగాహన కల్పించాలి.
​​​​​​​- ఆహారాన్ని గౌరవించేలా, వృథా వల్ల జరిగే నష్టాన్ని వివరించి చెప్పేలా విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఈ అంశంపై బోధన ఉండాలి.
​​​​​​​- అస్సాం, రాజస్థాన్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లో గెస్ట్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ ప్రకారం ఆరు రకాలైన వంటకాలు మాత్రమే శుభకార్యాల్లో వడ్డించాలనే నిబంధన ఉంది. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఫలితం ఉంటుంది. 
- (సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement