రాజబాట
గన్నవరం పరిసరాల్లో జోరుగా సర్వేలు
గన్నవరం పలు ప్రభుత్వ సంస్థలకువరంగా మారనుంది. విజయవాడనగరానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ముందుగా అభివృద్ధిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అధికారులు ఈ ప్రాంతం లోని భూములను సర్వే చేస్తున్నారు.
విజయవాడ : గన్నవరానికి మహర్దశ పట్టనుంది. విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న గన్నవరం ప్రాంతాన్ని ముందుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కొద్ది రోజులుగా గన్నవరంపై దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములను గుర్తించేందుకు గ్రామాల వారీగా సర్వే చేస్తున్నారు. విమానాశ్రయ అభివృద్ధి, కస్టమ్స్ కమిషనరేట్‌తో పాటు ఐటీ హబ్‌కు కూడా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడు బృందాలు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల కొండ పోరంబోకు, ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు సర్వే చేస్తున్నాయి. గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో సర్వే నంబర్-192, 7బీలో 200 ఎకరాల్లో ఐటీ హబ్ ఏర్పాటుకు కొండపోరంబోకు భూమిని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేస్తోంది. కొద్ది రోజులుగా 15 మంది రెవెన్యూ ఉద్యోగులు మూడు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో సర్వే నంబర్-6లో 429 ఎకరాల కొండపోరంబోకు భూమిని గుర్తించారు. ఇక్కడ కూడా 20 మంది సర్వేయర్లు నాలుగు బృందాలుగా భూమికి హద్దులు గుర్తిస్తున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రకృతి వైద్యం, యోగా పరిశోధన సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ ఏర్పాటైతే ఇక్కడ వంద పడకల ఆస్పత్రి కూడా నిర్మిస్తారు. వెదురుపావులూరులో ఖాళీగా ఉన్న 80 ఎకరాలను కూడా అధికారులు గుర్తించారు. కేసరపల్లిలో విమానాశ్రయం ఎదురుగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో కస్టమ్స్ కమిషనరేట్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు.
వలస వస్తున్న పారిశ్రామికవేత్తలు
గన్నవరానికి ప్రభుత్వ సంస్థలు తరలి వస్తున్న నేపథ్యంలో కొందరు పారిశ్రామికవేత్తలు కూడా ఈ ప్రాంతంలో తమ సంస్థలను నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలోని తమ భూముల్లో సంస్థల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ భూముల కోసం ప్రయత్నిస్తున్నారు. విజయ డెయిరీ యాజమాన్యం ఫీడ్ మిక్సింగ్ ప్లాంటును గన్నవరం ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న విమానాశ్రయం దినదినాభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ సర్వీసులు నడిపే దిశగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ - గన్నవరం మధ్య పలు కార్పొరేట్ విద్యాసంస్థలు, కార్ల షోరూమ్‌లు ఏర్పాటయ్యాయి. కొద్ది కాలంలో విజయవాడలో గన్నవరం కలిసిపోతుందని వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు.